
భింద్రేన్ వాలా 2.0
- NewsPolitics
- March 23, 2023
- No Comment
- 149
దాదాపు రెండు దశాబ్దాల నుంచి శాంతియుతంగా ఉన్న పంజాబ్ లో మళ్లీ ఇప్పుడు.. అలజడి రావడానికి కారణం.. ఖలిస్తాన్ ఉద్యమం. 1947లో భారత్, పాకిస్తాన్ విడిపోవడంతో.. అప్పటి పంజాబ్ సంస్థానం రెండు ముక్కలైంది. స్వయం ప్రతిపత్తి కోసం.. పంజాబీ మాట్లాడేవారి కోసం సుబా ఉద్యమం ప్రారంభమైంది. రాష్ట్రాల పునర్ వ్యవస్థరించే కమిషన్ ఆ డిమాండ్ తిరస్కరించింది. 1966లో పంజాబ్ మళ్లీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా.. పంజాబ్, హరిణాయా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1971లో ఇందిరాగాంధీ హవా నడుస్తుండగానే.. ఖలిస్తాన్ ఉద్యమం ఊపొందుకుంది. అయితే ఆరోజుల్లో పంజాబ్ లో వేర్పాటువాదం కోరుకున్న వారిలో.. జర్నయిల్ భింద్రన్ వాలా ఒకరు. ఒక వర్గానికి అధినాయకుడిగా ఎదుగుతూ వచ్చిన.. ఆయన 1980లో.. ఇందిర ప్రభుత్వానికి సవాల్ గా మారారు. కారణం.. ప్రజల్లో హింసావాదాన్ని ప్రేరేపించేలా.. ప్రభోదాలు చేయడం
1982లో ధరమ్ యుద్ధ మోర్చా పేరుతో.. శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని భింద్రన్ వాలా ఆరంభించారు. దీనికి అకాళీదళ్ పార్టీ సహకరించింది. స్వర్ణదేవాలయాన్ని స్థావరంగా మార్చుకుని.. హింసాయుత కార్యక్రమాలకు పురిగొల్పేవారు. భింద్రన్ వాలే చర్యలతో పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా పట్టుకోల్పోతూ వస్తోంది. ఇది గమనించిన ఇందిరాగాంధీ.. మిలటరీతో చర్చలు జరిపి.. స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించింది. బ్లూ స్టార్ ఆపరేషన్ లో భాగంగా.. 490 మంది వేర్పాటువాదులు.. 80 మంది సైనికులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. తాము పవిత్రంగా భావించే.. స్వర్ణదేవాలయంలో.. హింస జరగడం .. సిక్కులు జీర్ణించుకోలేక పోయారు. ఆనాటి ఘటనలో భింద్రన్ వాలే మరణించినా.. ఖలిస్తాన్ ఉద్యమం అంతం కాలేదు. స్వర్ణ దేవాలయంలో మిలటరీ ప్రవేశం జీర్ణించుకోలేక.. 1984లో అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు సిక్కులు.. ఇందిరాగాంధీని హత్య చేశారు. అనంతరం జరిగిన ఘటనలో .. వేలాదిమంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి కాలంలో .. ఖలిస్తాన్ ఉద్యమాన్ని.. కేంద్రం పూర్తిగా అణగదొక్కింది. కానీ.. సిక్కుల్లో ఖలిస్తాన్ ఉద్యమం పట్ల ఉన్న సానుభూతి మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.
ఇదంతా గత చరిత్ర.. ఈ తరం వారికి తెలియక పోవచ్చు.. ప్రస్తుతం ఖలిస్తాన్ ఉద్యమానికి నేతగా చెప్పుకుంటున్న.. అమృత్ పాల్ సింగ్ గురించి తెలుసుకుందాం. అతని చరిత్రను పరిశీలిస్తే.. 2012లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడే పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే .. మరో ఖలిస్థాన్ నేత లఖ్‌బీర్ సింగ్ రోడే సోదరుడు జస్వంత్, ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. దీంతో అమృత్ పాల్ భారత్ పై ద్వేషం పెంచుకున్నాడు. జార్జియాకు వెళ్లి .. ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ఐఎస్ ఐ పంజాబ్‌లో అశాంతి రేపడానికి .. పక్కా వ్యూహాంతోనే భారత్ లోకి అడుగుపెట్టాడు. అమృత్ పాల్ సింగ్ కనీసం తలపాగా కూడా ధరించకుండా.. చాలా సాధారణ వ్యక్తిలా జీవించేవాడు. ఆ సమయంలో.. వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు.. యాక్టర్ దీప్ సిద్ధు మరణించాడు. ఆ సమయంలో.. దీప్ సిద్ధూ అనుచరులకు దిశానిర్దేశం చేసేవారు ఎవరూ లేకుండా పోయారు. ఈ పరిస్థితిని అమృత్ పాల్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత చాలా వేగంగా వారిస్ పంజాబ్ దేను హైజాక్ చేశాడు. వారిస్ పంజాబ్ దే కు నాయకుడిగా ప్రకటించుకున్నారు. అక్కడి నుంచి అమృత్‌పాల్ మెరుపువేగంతో ఎదిగాడు.
విధ్వంసం చేసేవాడి ఆలోచనలు వేరే ఉంటాయి. ఉద్యమం.. సమాజానికి మేలు చేసేలా ఉండాలి.. కానీ.. పక్కదారి పట్టకూడదు. అమృత్ పాల్ సింగ్ వెనుక ఉన్న..కుట్రలను ఓ.. రకంగా పంజాబ్ యువత.. గ్రహించ లేదనే చెప్పొచ్చు. 1980లో ప్రత్యేక దేశం కావాలన్న..ఉద్యమ నినాదంలో చిక్కుకుని విలవిల లాడి పోయారు. అదే వారి పాలిట శాపంగా మారింది. ఛాందసవాదం, ప్రత్యేక దేశ నినాదం.. వారిని పెడత్రోవ పట్టించేలా చేసింది.
అమృత్ పాల్ సింగ్ బోధనలతో .. పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమం మళ్లీ పురుడు పోసుకుంది. ఖలిస్థానీ ఉద్యమ కార్యకలాపాలు మళ్ళీ జోరందుకున్నాయి. పంజాబ్ యువతను రెచ్చగొడుతూ.. పదునైన మాటలతో.. ఆకట్టుకుంటూ.. తనేం చెబితే అది చేసేటట్టుగా.. ప్రభావితం చేస్తున్నారు. దీంతోపాటు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా.. అమృత్ పాల్ సింగ్ .. సంబంధాలు పెంచుకున్నాడు. ఐఎస్ఐ తో కూడా పరిచయాలు ఉండటంతో.. పాకిస్థాన్ నుంచి తరచూ పంజాబ్‌లోకి చొరబడే డ్రోన్ల ద్వారా అమృత్‌పాల్‌కు అవసరమైన ఆయుధాలు సమకూరేవి. యూకేలో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా ప్రధాన హ్యాండిలర్‌గా వ్యవహరించేవాడు. కాని ఓ కంట.. భారత ఇంటెలిజెన్స్… అమృత్ పాల్ సింగ్ కార్యకలాపాలను కనిపెడుతూనే.. కేంద్రానికి సమాచారం పంపేది. 2022 ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్‌పాల్ ఎదుగుదల వెనుక చాలా ప్లాన్లు ఉన్నాయని నిఘా వర్గాల సమాచారం.
ఖలిస్తాన్ కు మద్దతుదారుల్లో అమృత్ పాల్ సింగ్ ఒకరయ్యారు.. మాదకద్రవ్య వ్యసన విముక్తి కేంద్రాలను.. ఒక గురుద్వారాను అడ్డం పెట్టుకుని ఆయుధాలను నిల్వ చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు యువతను సిద్ధం చేశాడు. పంజాబ్ లోని.. అనేకమంది యువకుల మనసుల్ని మార్చి, వారిని మానవ బాంబులుగా తయారు చేశాడు. ఎవరైనా .. ఎక్కడైనా.. ఉగ్రవాదులు హతమైనప్పుడు వారిని పోరాటయోధులుగా కీర్తిస్తూ.. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేవాడు. ఇలా కాలక్రమంలో.. అమృత్ పాల్ సింగ్ ఎదుగుతూ వచ్చాడు. అమృత్‌పాల్‌సింగ్ వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపించేది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అతనికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. పోలీసుల కన్నుగప్పి.. చాలా సార్లు తప్పించుకున్నాడు. అమృత్ పాల్ సింగ్ ఎంతలా ఎదిగాడంటే.. సమాంతరంగా.. ప్రైవేటు సైన్యం నడిపేంతలా.. ఎదిగాడు. ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ ఏకేఎఫ్‌గా దీనికి పేరుపెట్టారు. అమృత్ పాల్ సింగ్ చర్యలను గమనించిన ఎన్ ఎస్ ఐ ఐదుగురు వ్యక్తులపై ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదు చేసింది.
ఐరోపా దేశాల నుంచి పనిచేస్తున్న ఇతర తీవ్రవాద భావజాల మూకలు, ఐఎస్‌ఐ, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద ముఠాలు ఖలిస్థాన్ ఉద్యమాన్ని ఎగదోస్తూ.. అమృత్ పాల్ సింగ్ కు .. వెనుక నుంచి ఆర్థిక సహాయం అందించేవి. 2019లో పాక్-భారత్ మధ్య కర్తార్‌పుర్ కారిడార్ తెరచుకున్న తరవాత ఖలిస్థానీ ప్రచారం మరింత ఊపందుకొంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఖలిస్థానీ ప్రచారాన్ని.. అమృత్ పాల్ సింగ్ ఉధృతం చేయసాగాడు. కెనడా వంటి దేశాల నుంచి పనిచేస్తున్న సిక్కు గ్రూపుల ఆర్థిక సాయంతో పంజాబులో ఖలిస్థాన్ ఉద్యమానికి పునరుజ్జీవం పోశాడు. నార్త్ అమెరికా, ఐరోపాలో తీవ్రవాద భావజాల సిక్కు మూకలు.. ఆయా దేశాల్లోని పరిస్థితులను .. తమ భావజాలానికి రాజకీయ మద్దతు కూడగట్టేందుకు వినియోగించుకోబడ్డాయి. ఇవ్వన్నీ గమనించిన… పంజాబ్ ఇంటెలిజెన్స్… ఖలిస్థానీ అనుకూలవాది, వారిస్ పంజాబ్‌దే సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ ప్రధాన అనుచరుడిని అరెస్టు చేసింది. నిరసనగా అతడి మద్దతుదారులు అమృత్‌సర్‌కు సమీపంలోని అజ్‌నాలా ప్రాంతంలో కత్తులు, తుపాకులతో వీరంగం సృష్టించారు. ఖలిస్థానీ నినాదాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
భారతదేశంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలతో అనాది నుంచి కలిసేఉంటుంది. ప్రాంతాలు వేరైనా.. భాషలు వేరైనా.. మన మంతా భారతీయులమే. భారతీయ సంస్కృతి.. అందరినీ కలిపి ఉంచుతోంది. భారతీయత అనేది.. మన పుట్టుకలోనే ఉంది. భారత జాతి ఒక్కటే.. ఇక ఎన్నటికీ విచ్ఛిన్నమయ్యే ప్రసక్తే లేదు.. కానీ.. వేర్పాటు వాదంతో.. కుల, మతాలను రెచ్చగొట్టి.. ప్రాంతాలను విడదీసే వారిని దూరంగా ఉంచాలి… భారతీయ సంస్కృతిపై దాడి చేయాలనే విదేశీ కుట్రలను.. ఎప్పటికప్పుడూ గమనించి.. కూకటివేళ్లతో పెకిలించి వేయాలి. అమృత్ పాల్ లాంటి వాళ్లను.. చేరదీస్తే.. భావితరాలకు నష్టం చేసిన వారమవుతారని గ్రహించాలి.
అమృత్‌పాల్‌పై ఆపరేషన్ మొదలుపెట్టగానే.. గురుగ్రామ్‌లో ప్రధాన అనుచరుడు దల్జిత్ సింగ్ ఖల్సీ విచారించగానే.. కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ప్రైవేటు సైన్యం ఏర్పాటు కోసం విదేశాల నుంచి భారీగా నిధులను సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అమృత్‌పాల్ తరపున ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు అనుబంధంగా ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ ఏర్పాటు కోసం దల్జిత్ తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. అమృత్ పాల్ సింగ్ ఫోన్ లో ఉన్న సమాచారం ప్రకారం.. ఏకేఎఫ్ దళం గుర్రాలపై ఆయుధాలు చేతబూని ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ పతాకాలతో ఉన్న వీడియోలు బయటపడ్డాయి. దల్జిత్ సింగ్ బ్యాంక్ ఖాతాల్లో గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ. 35 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు.
పంజాబ్ సరిహద్దులో 34 మంది .. అమృత్ పాల్ సానుభూతిపరులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమృత్‌పాల్ సింగ్ అనుచరులను అరెస్ట్ చేయడంతో.. విదేశాల్లోని ఖలిస్థానీ సానుభూతిపరులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. లండన్ లోని భారత్ హైకమిషన్ భవనంపై ఉన్న జెండాను కిందికి దింపి ఆందోళనకారులు అగౌరవ పరిచారు. అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో లోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడికి దిగారు. అమృత్‌పాల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఫ్రీ అమృత్‌పాల్ అంటూ కాన్సులేట్ భవనం గోడలపై పెయింట్‌తో రాశారు. ఈ దృశ్యాలన్నింటినీ తమ కెమెరాల్లో బంధించి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. భారత్ కాన్సులేట్ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద అతికించిన ఖలిస్థాన్ జెండాలను ముగ్గురు వ్యక్తులు తొలగిస్తే.. వారిపై దాడి చేశారు. మరోవైపు కాన్‌బెర్రాలోని అస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఎదుట పెద్దసంఖ్యలో ఖలిస్థాన్ సానుభూతిపరులు.. అమృత్‌పాల్ సింగ్, అనుచరులకు అనుకూలంగా నినాదాలు చేశారు.
అమృత్‌పాల్ కాన్వాయ్‌కి చెందిన కారును జలంధర్ జిల్లాలో పోలీసులు గుర్తించారు. వాకీటాకీ, తుపాకీ, డజన్ల కొద్దీ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమృత్ పాల్ సింగ్ కొనుగోలు చేశాడని విచారణలో తేలింది. అక్రమ ఆయుధాల కోణంలో అమృత్‌పాల్ అనుచరులను ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 తుపాకులు, 193 తూటాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గాలింపు చర్యల్లో భాగంగా అమృత్‌పాల్ స్వగ్రామం జల్లుపుర్‌లోని నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మరో వైపు.. అమృత్‌పాల్‌సింగ్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారనీ, విడుదలకు ఆదేశించాలని కోరుతూ.. పంజాబ్-హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ.. అమృత్ పాల్ సింగ్ ఎక్కడున్నాడనేది.. ఇప్పటివరకు ఎవరికీ తెలియని సమాచారం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ విభేదాలు పక్కన పెట్టి.. అమృత్ పాల్ సింగ్ వంటి .. కరడు కట్టిన, మత ఛాందనవాది, ఐఎస్ఐతో లింకులున్న వ్యక్తిని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. లేదంటే.. 1980 నాటి పరిస్థితులు.. మళ్లీ పునరావృతమే.. మతాల మధ్య గొడవలకు దారి తీసే అవకాశం ఎంతైనా ఉంది. అమృత్ పాల్ ఉచ్చులో.. చిక్కుకుని.. ఎంతోమంది మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. ముఖ్యంగా మాదకద్రవ్య భూతం నుంచి పంజాబ్‌ను బంధ విముక్తం చేయాలి. వేర్పాటువాదం పేరుతో దారితప్పుతున్న యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి మంచి మార్గంలో నడిపించాలి. గతంలో పంజాబులో పేట్రేగిన ముఠాలను ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేయాలి. దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్న దుష్ట శక్తులను కూకటివేళ్లతో పెకలించివేయాలని.. అందరూ కోరుతున్నారు.