
అబ్దుల్ కలాంకు అవమానం.. సీతకొండ వ్యూపాయింట్ కు వైఎస్సార్ పేరు
- Ap political StoryNewsPolitics
- April 22, 2023
- No Comment
- 40
రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి, వింత పోకడలకు పోతోంది జగన్ సర్కార్. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా పేర్లు మార్చుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక పథకాలకు,ఓ యూనివర్సిటీకి పేరు మార్చిన వైసీపీ ప్రభుత్వం… తాజాగా ఓ వ్యూ పాయింట్ నేమ్ చేంజ్ చేసింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన సీతకొండలోని అబ్దుల్ కలాం వ్యూపాయింట్ కు వైఎస్సార్ పేరును తగిలించింది. జగన్ పేర్ల కక్కుర్తిపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా అంతా నా ఇష్టం అన్నట్లు జగన్ రెడ్డి చెలరేగిపోతున్నారు.
అధికార వైసీపీ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. గత ప్రభుత్వంలోని పథకాలకు పేరు మార్చిన మాదిరే అవకాశమున్నచోటల్లా, జగన్ సర్కార్ పేర్లు మార్చుకుంటూ వెళ్తోంది.ఎంతటి మహానుభావులైనా ఏపీలో వైఎస్సార్ తర్వాతే అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. కొత్తగా ప్రవేశపెట్టే వాటికి వైఎస్సార్ పేరు పెడితే, ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, గతంలో ఆల్రెడీ ఉన్న పేర్లను మార్చడం వివాదాస్పదమవుతోంది. తాజాగా విశాఖపట్టణం బీచ్ రోడ్డులో ఉన్న సీతకొండ వ్యూపాయింట్ పేరు మారిపోయింది. పర్యాటకులతో రద్దీగా కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు ‘వైఎస్సార్ వ్యూ పాయింట్’గా మారింది. అబ్దుల్ కలాం పేరుతో ఉన్న ఈ వ్యూపాయింట్ ను వైసీపీ ప్రభుత్వం, వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిజానికి సీతకొండ వ్యూపాయింట్ ను గత ప్రభుత్వ సహకారంతో, వైజాగ్ వాలంటీర్స్ అనే స్వచ్చంద సంస్థ అభివృద్ధి చేసింది. అయితే ఇటీవల G20 సదస్సు సుందరీకరణలో కేంద్రం నిధులు పెట్టి అభివృద్ధి చేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. సీన్ కట్ చేస్తే, ఇప్పుడు అక్కడ వైఎస్‌ఆర్ వ్యూ ప్యాయింట్ అని పెద్దపెద్ద అక్షరాలు ఏర్పాటు చేయడం చూసి నగర వాసులు ఆశ్చర్యపోతున్నారు. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ గా మార్చడం, ఆ మహనీయుడిని అవమానించడమేనంటూ మాజీ సీఎం చంద్రబాబు, వైజాగ్ వాలంటీర్స్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇలాంటిదేదో జరుగుతుందనే, శాశ్వతంగా అధికారికంగా కలాం పేరు పెట్టాలని కోరుతూ…వైజాగ్ వాలంటీర్స్ సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, వీరిని ప్రభుత్వం పట్టించుకోలేదు.
గతంలోనూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. పేరు మార్చడాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించారు. అయినా, ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ఓ సారి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టారు.అయితే, ఆ తర్వాత మళ్లీ వెనక్కి తగ్గారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చడంపైనా దుమారం చెలరేగడంతో, అబ్బే అలాంటిదేమీ లేదని ప్రభుత్వం బుకాయించింది.ఇలా ఎంతటి మహనీయులైనా, దేశానికి వారెంత సేవలు చేసినా డోంట్ కేరు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్. ఫుట్ పాత్ దగ్గర్నుంచి పారిశ్రామిక విధానాల వరకు అన్నింటా వైఎస్సార్ పేరు పెడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం పేర్ల మార్పు కక్కుర్తిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తామేం చేసినా చెల్లుతుందనే రీతిలో జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారనే విషయం వైసీపీ నాయకులు గుర్తిస్తే మంచిది.