
ఎడాపెడా కరెంట్ కోతలతో.. ఆంధకారంలో ఆంధ్రప్రదేశ్
- Ap political StoryNewsPolitics
- May 23, 2023
- No Comment
- 72
ఏపీలో విద్యుత్ కోతలతో జనం విల విల్లాడిపోతున్నారు . ఒకవైపు నిప్పులు కక్కుతున్న సూరీడు..మరోవైపు ఉక్కపోత..వీటికితోడు అంధకారంతో అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అన్ని జిల్లాల్లో వేళా పాళా లేకుండా అప్రకటిత కరెంట్ కోతలను విధిస్తున్నారు. కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న జగన్ సర్కారు మాటలు నీటముటల్లానే మారాయి.
మండుతున్న ఎండల వల్ల విద్యుత్ వినియోగం పెరగటంతో.. డిమాండ్ కు సప్లైకే మధ్య అంతరం భారీగా పెరిగి పోతోంది. దీంతో కరెంటు కోతలు అనివార్యం అవుతున్నాయి. లోడ్ రిలీఫ్ పేరిట అధికారులు పవర్ కట్ చేస్తుండటంతో మండువేసవిలో కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. పల్లెలతో పాటు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలాంటి ప్రధాన నగరాల్లోనూ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వేసవిలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా సర్కారు కరెంట్ ను సమకూర్చుకోవాలి. కానీ డిమాండు కంటే 1.61 మిలియన్ యూనిట్లు తక్కువ సరఫరా ఉన్నట్లు దక్షిణ ప్రాంతీయ లోడ్‌డిస్పాచ్ సెంటర్ చెబుతోంది. అధికారికంగా చూపుతున్న మొత్తం కంటే 2, 3 రెట్లు అధికంగా విద్యుత్‌లోటు ఉంటోందని తెలుస్తోంది. 5-6 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సర్దుబాటు చేయడానికి గ్రామాల్లో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. పట్టణాల్లోనూ కోతలు తప్పట్లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 245.11 మిలియన్ యూనిట్లు గా నమోదైంది.
ఆ మేరకు విద్యుత్‌ను సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్ నుంచి 44.5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. అయినా 1.61 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్న దక్షిణగ్రిడ్‌లో విద్యుత్ కొరత 2.04 మిలియన్ యూనిట్లుగా ఉన్నట్లుగా చూపితే.. అందులో మన రాష్ట్రానికే 1.61 మిలియన్ యూనిట్లు ఉండటం గమనార్హం. రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు.. జగన్ మోహన్ రెడ్డి అసమర్థ విధానాలు తోడవ్వటంతో.. ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పటం లేదు.
ఇక.. రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ఏపీ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గంటల తరబడి కరెంటు తీసేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉక్కపోత.. బయటకు వస్తే దోమల మోతతో జాగారం చేస్తున్నారు. పసిపిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇళ్లలో నరకం కనిపిస్తోంది. పసిబిడ్డలకు తల్లులు రాత్రంతా విసనకర్రతో విసరాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఆస్పత్రుల్లో రోగులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. సప్లయికి మించి విద్యుత్ వినియోగం పెరుగడంతో అధికారులు అప్రకటిత కోతలను విధిస్తున్నారు. కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ… మరమ్మతుల పేరిట కరెంటు సరఫరాలో ఏదో ఒక సాకుతో కోతలు విధిస్తున్నారు. వ్యవసాయ, పరిశ్రమలు, గృహాలు, కమర్షియల్ సర్వీసులకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. సబ్‌స్టేషన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు, స్తంభాల ఏర్పాటు, లూజ్ వైర్ల మరమ్మతులు అంటూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో మండు వేసవిలో జనానికి ఇబ్బందులు తప్పటం లేదు.