
లిక్కర్ స్కామ్‌లో సుఖేష్ సంచలనం…
- NewsPoliticsTelangana Politics
- April 9, 2023
- No Comment
- 50
సుకేష్ చంద్రశేఖర్… ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనూహ్యంగా తెరపైకి వచ్చి సంచలనంగా మారాడు. అసలు ఎవరీ సుఖేష్..? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది ఓ సారి చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అతనో పక్కా లోఫర్ అని అంతా అంటు ఉంటారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఊచలు లెక్కపెడుతున్న ఇతగాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ లో కీలకంగా మారాడు. కేజ్రీవాల్, బీఆర్ఎస్ మధ్య సంబంధాలను బయటపెడుతూ వరుస లేఖలతో హల్చల్ చేస్తున్నాడు. అసలు జైల్లో ఉన్న సుఖేష్ కోటాను కోట్లు కేజ్రీవాల్, బీఆర్ఎస్ నేతలకు ఇచ్చానని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుంటే, ఏకంగా అక్కడి నుంచి లెటర్ లు విడుదల చేసేంత స్వేచ్ఛ అతనికి ఇస్తుందెవరు?అనేది హాట్ టాపిక్ గా మారింది.
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్….. మద్యం కుంభకోణానికి సంబంధించి విడుదల చేస్తున్న లేఖలు సినిమా ట్రైలర్ ల మాదిరి సంచలనం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న కేజ్రీవాల్ చెప్పారని బీఆర్ఎస్ పార్టీకి పదిహేను కోట్లు ఇచ్చానని ఓ లేఖ వదిలిన సుఖేష్, తాజాగా మరో బాంబ్ పేల్చాడు. మరో పదిహేను కోట్లు అరుణ్ పిళ్లైకు ఇచ్చానని చెబుతూ లేఖ విడుదల చేశాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనతో, హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీసులో ఆ పార్టీ నేతకు 15 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా బీఆర్ఎస్ లీడర్‌తో జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా లేఖలో ప్రస్తావించాడు. ముందుగా చెప్పినట్టు వాట్సాప్ చాట్ ను బయటపెట్టనప్పటికీ, తనతో చాట్ చేసిన వ్యక్తి సౌత్ గ్రూప్‌లోని బీఆర్ఎస్ లీడర్ అని తెలిపాడు. రేంజ్ రోవర్ కారు నంబర్ సహా, ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందనే విషయాన్ని చెప్పాడు. ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని స్పష్టం చేశాడు. అంతేకాదు, ఈ విషయంలో అవసరమైతే తాను నార్కో టెస్ట్‌కు సిద్ధమంటున్నాడు.
ఇక.. తాజా లేఖలో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రికి సుఖేష్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటివరకు వదిలింది టీజర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందంటూ హెచ్చరించాడు. త్వరలోనే బీఆర్ఎస్ నేతకు, తనకు మధ్య ఉన్న చాట్ ను విడుదల చేస్తానంటున్నాడు. సౌత్ గ్రూప్ , బీఆర్ఎస్ నేత, కేజ్రీవాల్ కు మధ్య ఉన్న సంబంధాలను ఈ చాట్ స్పష్టం చేస్తోందని సుఖేష్ చెబుతున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ తనతో చేసిన 700 పేజీల వాట్సాప్ చాట్, టెలిగ్రామ్ చాట్‌లు తన దగ్గరున్నట్టు చెప్తూ వస్తున్నాడు. అయితే, అసలు సుఖేష్ కు, ఈ కేసులకు సంబంధం ఏంటి? ఆయన చేత లేఖలు విడుదల చేయిస్తుందెవరు? కేసీఆర్, కేజ్రీవాల్ లను ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు వాళ్లకు డబ్బులు ఎందుకు ఇచ్చాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ చీటింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న సుఖేష్….లిక్కర్ స్కామ్ లింకులను బయటపెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సుఖేష్ చంద్రశేఖర్ చరిత్ర ఓ సారి చూస్తే.. బెంగళూరులోని భవానీనగర్‌కు చెందిన ఓ రబ్బరు కాంట్రాక్టరు కుమారుడు. 17ఏళ్ల వయసులో నేరజీవితాన్ని మొదలుపెట్టాడు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీతారలను మోసం చేసి, బెదిరించి, మభ్యపెట్టి కోట్లాది రూ పాయలు నొక్కేసిన ఘరానా మోసగాడు. ప్రముఖుల కుమారుడిననో.. సెక్రటరీననో.. పరిచయం చేసుకుని, ప్రభుత్వ కాంట్రాక్టులు, బెయిళ్లు ఇప్పిస్తానంటూ దోచుకోవడం ఇతడి స్టైల్. తమిళనాడులో జయలలిత చనిపోయాక, అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులను ఇప్పిస్తానంటూ టీటీవీ దినకరన్‌తో 50 కోట్లకు డీల్ కుదుర్చుకుని అడ్డంగా పోలీసులకు దొరికిపోయి తిహార్ జైలుకు చేరాడు. అప్పుడు జైల్లో నుంచే ఫోన్లు, గొంతు మార్చే పరికరాల సాయంతో.. ర్యాన్‌బాక్సీ యజమాని శివీందర్ సింగ్ భార్యకు ఫోన్ చేసి ఆయనకు బెయిల్ ఇప్పిస్తానంటూ 200 కోట్లు దోచుకున్నాడు. ఇలా సంపాదించిన సొమ్ముతో.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి వంటి సినీతారలకు వల వేసి, వారికి ఖరీదైన కానుకలిచ్చి బుట్టలో వేసుకున్నాడు.
ఈడీ ఉచ్చుకు చిక్కి 2017 నుంచి జైల్లో మగ్గుతున్నాడు సుఖేష్. జైల్లోంచే బెదిరింపు రాకెట్ నడపడానికి వీలు కల్పించినందుకు.. అక్కడి అధికారులకు నెలకు కోటి రూపాయల దాకా లంచంగా ఇచ్చేవాడట. అందుకే, సుఖేష్ ను కలవడానికి వచ్చే వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతిచ్చేవారట. జైల్లోనూ సుఖేష్ లగ్జరీ లైఫ్ అనుభిస్తున్నాడని అతని భార్య మారియాపాల్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. జైల్లో అతడిచ్చే పార్టీలకు….పలువురు మోడళ్లు, నటీమణులు వచ్చేవారట. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి కూడా ఇలా అతడు ఇచ్చిన పార్టీలకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇటీవల జైలు నుంచే తన ప్రేయసి జాక్వలిన్ ఫెర్నాండేజ్ కు సుకేష్ లవ్ లెటర్ రాసి కలకలం రేపాడు. ఇలాంటి పక్కా 420….ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన లావాదేవీలపై లేఖలు విడుదల చేయడం సంచలనం రేపుతోంది. బీజేపీయే సుఖేష్ తో ఈ కథంతా నడుపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అదెంత నిజమోగానీ, సుఖేష్ జైలు నుంచి వదులుతున్న లేఖలు హైలెట్ అవుతున్నాయి.