ఒకటో తేదీ జీతం కోసమా ఉద్యోగ సంఘాల పోరాటం?

ఒకటో తేదీ జీతం కోసమా ఉద్యోగ సంఘాల పోరాటం?

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆరునూరైనా ఒకటో తేదీ జీతం అందుతుందనే భరోసా ఉండేది. అదంతా గతం. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఏ తేదీన అందుతుందో తెలియడం లేదు. సీఎం చెప్పేది ఒకటి చేసేది మాత్రం మరొకటి. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి పడేస్తానంటూ ప్రతి ఎన్నికల సభలో సీఎం జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే హామీని రద్దు చేసి పడేశారు. మా సీఎం తెలియక అలా చెప్పారంటూ సలహాదారు సజ్జల చెప్పడం మోసం చేయడం కాదా..? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సమయానికి జీతాలు, పింఛన్లు ఇవ్వడం ఎప్పుడో మానేశారు. ఇంత జరుగుతుంటే ఉద్యోగ సంఘాల నాయకుడు బండి శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నట్టు…? బండి శ్రీనివాసరావు కనీసం ప్రభుత్వంతో జరిపే చర్చలకు కూడా హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇది ఉద్యోగులను మోసం చేయడం కాదా? నాయకులుగా ఎన్నుకున్నందుకు లక్షలాది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా అంటూ లక్షలాది ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగ సంఘాల నాయకులకు ఉద్యోగుల ప్రయోజనాలు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వంతో చర్చలకు వెళతారు. చర్చల్లో ఏమైనా తేలుతుందా? అంటే ఏమీ ఉండదు. టీ తాగడం, బిస్కెట్లు తిని బయటకు రావడం, చెప్పిందే మీడియాకు మరలా చెప్పడం. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు కూడా ఉద్యోగ సంఘాల నాయకుల తీరును ఛీదరించుకుంటున్నారు. ప్రభుత్వంతో జరిపే చర్చల్లో మంత్రి బొత్స నాలుగు జోకులు వేయడం, మరో మంత్రి బుగ్గన ప్రవచనాలు వల్లించడం, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ చిరునవ్వులు చిందించడం ఇదే తంతు. ఆ తరవాత ఉద్యోగ సంఘాల నాయకులు చర్చల నుంచి బయటకు వచ్చి జీతాలు ఎప్పడిస్తారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్టు చాలా ఆవేదనగా చెబుతూ ఉంటారు. ఇలా ఉద్యోగులను ఎన్నాళ్లు ప్రభుత్వానికి తాకట్టు పెడతారు, 2024 ఎన్నికలు అయ్యే వరకు ఇలాగే చేస్తారా? అంటూ ఉద్యోగ సంఘాల నాయకుల తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల్లో 95 శాతం మంది కేవలం జీతంపై ఆదారపడి జీవిస్తున్నారని ప్రభుత్వానికి తెలియదా? ఒకటో తేదీ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? జీతాల కోసం ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రుల కాళ్లు పట్టుకోవాలా? ఛీఛీ ఉద్యోగ సంఘాల నాయకులు ఇంతగా దిగజారిపోవడంపై ఉద్యోగులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల నుంచి ఉపాధ్యాయులు వేరుపడే ఆలోచనలో ఉన్నారనే సమాచారం అందుతోంది. సీపీఎస్ రద్దులాంటి ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలంటూ టీచర్లు విజయవాడ BRTS రోడ్డులో పెద్దఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల నిరసన సక్సెస్ కావడంతో, తమపై వైసీపీ సర్కార్ పగబట్టిందని ఉపాధ్యాయులే చెబుతున్నారు.యాప్ ల పేరుతో వారిని వేధించడంతోపాటు లక్షల జీతాలు తీసుకుంటూ ఇంకా పెంచమంటున్నారంటూ మంత్రులు జోకులేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఒక రోజు అటో ఇటో ఇస్తున్నాం కదా. నాలుగు రోజులు జీతం లేటయితే చచ్చిపోతారా? అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రశ్నించడం చూస్తుంటే అసలు ఇలాంటి వారికా మనం రెండు చేతులతో ఓట్లేసి గెలిపించింది..? అని ఉద్యోగులు కుమిలిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చినా ఉపాధ్యాయలు సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. కేవలం 5 వేలకు అమ్ముడుపోయి వైసీపీ ఎమ్మెల్సీలను గెలిపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను గెలిపించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బాగానే చేస్తుందనే సంకేతాలు పంపించారు. జీతాలు సమయానికి రావడం లేదు. పీఎఫ్ వాడేశారు అంటూ ఇప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగం ఉంటుందంటూ జనం సెటైర్లు వేస్తున్నారు.

ఉద్యోగులకు ప్రభుత్వం 25 నుంచి 30 వేల కోట్లు బకాయి పడింది. మార్చి నెలాఖరులకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో, కనీసం 3 వేల కోట్లు చెల్లిస్తామని గత నెలలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇంత వరకు నెరవేర్చలేదు. ఉద్యోగ సంఘాలు ఒకటో తేదీ జీతాల కోసం ఉద్యమాలు చేయాల్సి రావడం బాధాకరం. ఎవరు చేసుకున్న ఖర్మ వారు అనుభవించాల్సిందే అంటే ఇదే నేమో. రెండు చేతులతో ఓట్లేసి గెలిపించారుగా? మీకు తగిన శాస్తి జరిగిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తుంటే ఉద్యోగులపై ప్రజల్లో కూడా ఏ మాత్రం సానుభూతి లేదనేది స్పష్టం అవుతోంది..

ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటంలో, ఉద్యోగ సంఘాల నాయకులు చేతులెత్తేసినట్టు భావించాల్సి వస్తోంది. నాలుగేళ్ల నుంచి ఒకటో తేదీ జీతాలు రాకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా? ముందుగా నోటీసులిచ్చి సమ్మెకు దిగితే ప్రభుత్వం దిగిరాదా? జీతాలు కూడా అడుక్కోవాలా? ఉద్యోగ సంఘాల నాయకులు ఇంతలా దిగజారడం అనేది భారతదేశ చరిత్రలోనే చూడలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో ఆ సంఘాల్లో చీలక తప్పేలా లేదు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *