ఆంధ్రాలో చదువులు.. పక్క రాష్ట్రాల్లో కొలువులా..?

ఆంధ్రాలో చదువులు.. పక్క రాష్ట్రాల్లో కొలువులా..?

ఏపీలో యువత భవిష్యత్ గాడాంధకారంగా మారుతోంది. రాష్ట్రంలో ఉపాధి లేదు. ఉద్యోగ కల్పన లేదు. పరిశ్రమలు లేవు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. దాంతో, చదువుకున్న యువత సొంతరాష్ట్రంలో నిరుద్యోగులుగా మారుతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పట్టాలు సాధించిన పట్టభధ్రులంతా..సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే అవకాశం లేకపోవడంతో పక్క రాష్ట్రాల్లో కొలువులు వెతుక్కుంటున్నారు.

చదువులు అయిపోయిన చాలా మంది…జగన్ రెడ్డిని నమ్ముకుంటే.. నిండా మునుగుతామని భావిస్తూ ఇతర రాష్ట్రాలు, దేశాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు.. బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ఏపీ యువత “పట్టాలు” చేతపట్టుకుని వలస పోతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తా.. ప్రతీ జిల్లాను ఓ హైదరాబాద్‌లా మారుస్తా.. ఇక్కడే ఉపాధి కల్పిస్తా..” – ఇదీ విపక్షనేతగా జగన్ మోహన్ రెడ్డి ఏపీ యువతకు ఇచ్చిన హామీ. ప్రత్యేక హోదా మాట దేవుడెరుగు.. కనీసం గుమస్తా ఉద్యోగానికి కూడా దిక్కు, మొక్కు లేని విధంగా ఏపీ పరిస్థితి తయారైంది. జగన్ రెడ్డి దెబ్బకు ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు పారిపోతుండగా.. చదువుకున్న యువత సైతం.. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంటోంది.

గత నాలుగేళ్ళుగా.. ఏపీలో చదువుకున్న యువత, ఆ తర్వాత కొలువు సాధించాలంటే…ఇతర రాష్ట్రాలవైపు చూడాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. ఏపీకి ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా, ఉన్న వాటిని తరిమేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. నిరుద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి విద్యావంతులను రోడ్డునపడేశారు. దాంతో, చాలా మంది రాష్ట్రంలో ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు.

ఇక, డిగ్రీలు, ఇంజినీరింగ్ లు చదివిన మరెందరో…రాష్ట్రంలో కూలీగా మారలేమంటూ…ఉద్యోగం వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంజినీరింగ్‌ చదివిన వారికి విజయవాడ, వైజాగ్‌ పనిచేసే అవకాశాలు లేకపోవడంతో…హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే లాంటి నగరాలకు వెళుతున్నారు. అక్కడ టీసీఎస్,టెక్ మహీంద్రా, ఐబీఎం లాంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.

రాష్ట్రంలో ఉన్నతవిద్య చదువుతున్న వారిలో 35.14% మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. జాతీయ సగటు కంటే నిరుద్యోగ పట్టభద్రులు రాష్ట్రంలోనే రెండింతలు అధికంగా ఉన్నారు. గత మూడేళ్లలో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు 10 శాతానికి పైగా పెరిగినట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ నివేదిక బహిర్గతం చేసింది.

ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి ఉంటే…రాష్ట్రానికి ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చేవి. ఇక్కడే ఎందరో ఉద్యోగాలు చేసుకునే వారు. కానీ, జగన్ రెడ్డి ఉన్న పరిశ్రమలనే తరిమేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల్లో 73శాతానికి పైగా పట్టభద్రులే ఉన్నారు. ఎంటెక్‌లో 21 వేలకు పైగా సీట్లు ఉంటే, చేరుతున్నవారు 5వేలలోపే. సాధారణ పీజీ కోర్సుల్లో 37% మందే ప్రవేశాలు పొందడం ఆందోళనకర విషయమే.

ఏపీలో.. ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించకపోవడంతో కొత్తవి రాకపోగా.. ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి అంటే వాలంటీర్లు, కూలీ పనులు, కార్మికులు, నైట్‌ వాచ్‌మన్లు అన్నట్టుగా ఏపీ మారిపోయింది. సీఎంఈ నివేదిక సైతం దీన్నే ధ్రువీకరించింది. ఏటా లక్షలాది మంది ఉత్తీర్ణులై విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో 90శాతం మంది ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. మూడు రాజధానుల ప్రకటనతో నిర్మాణ రంగం కుదేలైంది.

దీంతో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాలనేవి లేకుండా పోయాయి. పెద్ద వ్యాపారులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లిపోయారు. పరిశ్రమలనేవి రాకపోవడంతో మెకానికల్‌ ఇంజినీర్లకు ఉద్యోగాలు కరువైపోయాయి.

ప్రస్తుతం ఏపీలో ఐటీ అభివృద్ధికి అవకాశం ఉన్న విశాఖ పరిస్థితే అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో ఒకటో, రెండు పెద్ద కంపెనీలున్నా పెద్దగా ప్యాకేజీలు లేకపోగా, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. దాంతో, యువశక్తి అంతా రాష్ట్రాన్ని వీడుతుండడంతో ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *