
సొంత పార్టీ వాళ్లే కుట్ర చేస్తున్నారంటూ బాలినేని కంటతడి
- Ap political StoryNewsPolitics
- May 6, 2023
- No Comment
- 22
వైసీపీలో తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి దాదాపు ఎగ్జిట్ అయినట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ర్పచారంపై స్పందించారు. ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
వైవీ వర్గం తనను టార్గెట్ చేయడాన్ని తట్టుకోలేకపోతోన్న బాలినేని…పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వస్తున్నాయి. అయితే, బాలినేని వైసీపీకి దూరం కావాలనుకుంటున్నారా? లేక బాలినేనినే పార్టీ వద్దనుకుంటుందా? అనే డైలమా ఉండేది. ఈ క్రమంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కంటతడి పెట్టిన తీరుతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. తాను పార్టీ మారుతున్నానంటూ సొంత పార్టీ వాళ్లే కుట్రలు చేస్తున్నారంటూ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డిపై బాలినేని మండిపడ్డారు.
వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అంతేకాదు, బంధువు కూడా. ప్రకాశం జిల్లాలో పార్టీకి వెన్నుముకగా ఉండి అహర్నిశలు కష్టపడ్డానని చెబుతుంటారు. అలాంటి నేత పరిస్థితి ఇప్పుడు పార్టీలో అగమ్యగోచరంగా మారింది. సొంత పార్టీ నేతలే తనను టార్చర్ పెడుతున్నారంటూ కన్నీటిపర్యంతమయ్యారు బాలినేని.
తన కుటుంబంపై నిందలు వేస్తున్నారు. భూకబ్డాలు, హవాలా డబ్బులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. తాను టికెట్ ఇప్పించిన వారితోనే తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఆ నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తెలంగాణకు చెందిన వ్యక్తితో తనను తిట్టిస్తున్నారని, ఆఖరికి వైజాగ్ నుంచి కూడా కొందరి చేత విమర్శలు చేయిస్తున్నారంటూ బాలినేని బావ వైవీపై ఫైర్ అయ్యారు.తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా గానీ, నమ్ముకున్న కార్యకర్తలను మాత్రం వదులుకునేది లేదన్నారు.
తిరుపతిలో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు చేసిన వ్యాఖ్యలను బాలినేని తీవ్రంగా ఆక్షేపించారు. గోనె …వై.వి.సుబ్బారెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుకుంటే తమకేం అభ్యంతరం లేదని..కానీ, తాను వందలకోట్లు సంపాదించానంటూ మాట్లాడడం బాధాకరమన్నారు బాలినేని. అవి ఎక్కడున్నాయో నిరూపించాలన్నారు. అసలు తెలంగాణకు చెందిన గోనే ప్రకాశ్ రావుకు ఇక్కడి విషయాలు ఎందుకని ప్రశ్నించారు. ఇక, వైవీ సుబ్బారెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టాడంటూ గోనె వ్యాఖ్యానించడాన్ని బాలినేని తీవ్రంగా తప్పుబట్టారు.
ఎవరు రాజకీయాల్లో ముందున్నారో ప్రజలందరికీ తెలుసని, తమ తండ్రి జనతాపార్టీ నుంచి పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు బాలినేని. అదేవిధంగా గడపగడపకు వెళ్లమంటున్నారనే కారణంతోనే సొంత నియోజకవర్గంపై దృష్టిపెట్టేందుకు… ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానని చెప్పారు బాలినేని. ఒంగోలు డీఎస్పీ నియామకం విషయాన్ని సీఎంవో దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. మొత్తంగా, బాలినేని పార్టీలో తనకు తీరని అన్యాయం జరుగుతోందంటూ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో…ఆయన పార్టీ వీడడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో బాలినేని భవిష్యత్ కార్యాచరణ ఏవిధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.