ఏపీలో త్వరలో బీజేపీ..వైసీపీ పొత్తు..?

ఏపీలో త్వరలో బీజేపీ..వైసీపీ పొత్తు..?

ఆంధ్రప్రదేశ్‌లో వివేకా హత్య కేసు సాక్షిగా బీజేపీ, వైసీపీ పార్టీల బంధం బలపడుతోందా..? వివేకా హత్య కేసులో ఇబ్బంది పడకుండా… వైసీపీని బీజేపీ పెద్దలు కంటికి రెప్పలా కాపాడుతున్నారా..? అందులో భాగంగానే… అవినాష్ జోలికి సీబీఐ రాకుండా అడ్డుకున్నారా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను చూస్తే… వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసు సాక్షిగా బలపడిన రాజకీయ బంధాన్ని.. ఎన్నికల పొత్తుగా మార్చుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్‌లో పెట్టిన… 10 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటును సైతం కేంద్రం తాజాగా భర్తీ చేయటం.. వైసీపీ, బీజేపీ అనుబంధంపై ఊహాగానాలకు కారణమౌతోంది.

వైఎస్ వివేకా హత్య సాక్షిగా ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపు తీసుకునేలా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్ళుగా అధికార వైసీపీతో రహస్య స్నేహం కొనసాగిస్తున్న బీజేపీ… వివేకా హత్య కేసు విషయంలో మాత్రం ఓపెన్‌గా వైసీపీకి సపోర్ట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య కేసులో కీలక నిందితుడైన ఎంపీ అవినాష్ ‌‌ రెడ్డిపై ఈగ వాలకుండా.. ఆ పార్టీ అగ్రనాయకత్వం సీబీఐను కట్టడి చేసిన విధానం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇన్నాళ్ళు తెర చాటుగా వైసీపీతో స్నేహాన్ని కొనసాగించిన కమలనాథులు.. జగన్ సర్కార్ నడవటానికి అవసరమైన “ఆర్ధిక ఇంధనాన్ని” సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. అయితే.. తాజాగా అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం.. కేంద్రంలో బీజేపీ నాయకత్వం భేషరతుగా వైసీపీకి అండగా నిలవటం గమనార్హం. అవినాష్ అరెస్టుకు కోర్టుల నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోయినా.. సీబీఐని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా బీజేపీ నాయకత్వం కట్టడి చేసేసింది. దీంతో.. జగన్, మోడీ మధ్య రాజకీయ బంధం ఎంత ధృఢంగా ఉందనే విషయం ఏపీ ప్రజలకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. జగన్.. మోడీ జోడీ మధ్య స్నేహం 2019 నుంచి కొనసాగుతున్నా.. ఈ రేంజ్‌లో బీజేపీ నాయకత్వం ఓపెన్‌గా సపోర్ట్ చేయటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించటానికి జగన్ నేతృత్వంలోని వైసీపీ, మోడీ నేతృత్వంలోని బీజేపీ అప్రకటిత పొత్తులతో చేతులు కలిపాయి. ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఈ రెండు పార్టీల స్నేహ బంధం.. కొనసాగుతోంది. అయితే..2019 ఎన్నికల తరువాత అనూహ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సైతం బీజేపీ రాజకీయ పొత్తును కొనసాగిస్తోంది. బహరింగంగా జనసేనతో.. అంతర్గతంగా వైసీపీతో పొత్తు నెరుపుతున్న కమలనాధులు.. ఏపీ రాజకీయాలను శాసించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అపర చాణక్యునిగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని మరోసారి గద్దె ఎక్కుకుండా నిరోధించటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో డైరెక్ట్ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కన్నా.. ఇండైరెక్ట్ పొత్తులో ఉన్న జగన్ కే బీజేపీ నాయకత్వం టాప్ ప్రయార్టీ ఇస్తోంది. ఎంతసేపూ.. బీజేపీతో పొత్తులో ఉన్నానని పవన్ చెప్పుకోవటమే తప్ప.. ఎక్కడా ఆ పొత్తు ధర్మాన్ని పాటించిన దాఖలాలు బీజేపీ వైపు నుంచి కనిపించలేదు. కానీ.. వైసీపీ ఎప్పుడు ఆపదలో ఉన్నా.. కమలనాధులు పెద్దన్నలా ఆదుకుంటూ వస్తున్నారు. వారం వారం రెండు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు ఇవ్వటం దగ్గర నుంచి తాజాగా వివేకా హత్య కేసులో అవినాష్ కు కొండంత అండగా నిలవటం వరకు.. వైసీపీ పట్ల బీజేపీ తన మిత్రధర్మాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చిందనే చెప్పుకోవాలి. దీనికి బోనస్ గా అన్నట్టు 10 వేల కోట్ల కు పైగా రెవెన్యూ లోటు నిధులను సైతం భర్తీ చేస్తూ.. తాజాగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలి కాలంలో.. జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ నాయకత్వం… ఔట్ రేట్‌గా వైసీపీకి సపోర్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే.. వైసీపీ ప్రభుత్వానికి ఇతోధికంగా ఆర్ధిక సాయం చేయటం.. ఆ పార్టీ ఎదుర్కొంటున్న కేసుల నుంచి రిలీఫ్ కల్పించటానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే.. సీబీఐ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మ్యాగ్జిమం ఫేవర్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమని దాదాపుగా నెల రోజుల నుంచి డైలీ వార్తలు వస్తున్నా.. సీబీఐ ఒక్క అడుగు కూడా ముందుకు వేయక పోవటానికి.. కేంద్రంలో బీజేపీ పెద్దలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటు సీఎం జగన్ రెడ్డి కూడా.. బీజేపీ నేతలు అందిస్తున్న సహకారానికి మురిసిపోతున్నట్టు చెబుతున్నారు.గతంలో ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు…జగన్ తమ బంధం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అది వందశాతం నిజమేననిపిస్తోంది. ఇదే సహకారం వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగితే.. టీడీపీ కూటమిని సునాయాసంగా ఎదుర్కోవచ్చనే భావనలో ఆయన ఉన్నారు. మరోవైపు… జనసేన పార్టీ తమకు దూరంగా జరిగినా.. వైసీపీతో ఆ లోటు భర్తీ చేసుకోవాలనే ఆలోచన బీజేపీ పెద్దలకు ఉన్నట్టు తెలుస్తోంది. లెక్కకు మించిన కేసులు ఉన్న జగన్ రెడ్డి అయితే తమ మాట వింటాడని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీతోనే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద.. వివేకా హత్య సాక్షిగా ఏపీలో బలపడుతున్న వైసీపీ, బీజేపీ బంధం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *