బండి, సోముకు షాక్.. కిషన్ రెడ్డి, పురందేశ్వరిలకు కొత్త టాస్క్

బండి, సోముకు షాక్.. కిషన్ రెడ్డి, పురందేశ్వరిలకు కొత్త టాస్క్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధినాయకత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చేసింది. తెలంగాణలో ప్రెసిడెంట్ మార్పు గురించి ముందే తెలిసినప్పటికీ, ఏపీలో మాత్రం ఎవరూ ఊహించని వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించి కేంద్ర పెద్దలు సర్ ప్రైజ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ తో తెగించి కొట్లాడుతున్న బండిసంజయ్ ను పక్కనబెట్టి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సారథ్య బాధ్యతలు అప్పగించగా.. ఏపీలో జగన్ తో అంటకాగుతోన్న సోమును తప్పించి.. ఎన్టీఆర్ వారసురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్టానం…తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. తెలంగాణలో అందరూ ఊహించినట్టే బండి సంజయ్ అని హైకమాండ్ పక్కనబెట్టింది. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు అధ్యక్షుడిగా ఉన్నారు. 2016-18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మోడీ కేబినెట్ లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. బండి సంజయ్ ఒంటెత్తు పోకడలకు పోతున్నారంటూ, పార్టీలో చేరిన నేతలు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. సంజయ్ ను మార్చాల్సిందేనని, లేకపోతే తమదారి తాము చూసుకుంటామంటూ హైకమాండ్ కు తేల్చిచెప్పారు. దీంతో, కొంతకాలంగా తెలంగాణ అధ్యక్ష విషయంలో మేథోమథనం జరిపిన బీజేపీ అగ్రనేతలు..ఎట్టకేలకు కిషన్ రెడ్డి వైపు మొగ్గుచూపారు. ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు.

ఇక, ఏపీలో జగన్ కు తొత్తుగా మారిన సోము వీర్రాజును సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది బీజేపీ అధిష్టానం. ఆ స్థానంలో కేంద్రమాజీ మంత్రి, పురంధేశ్వరిని నియమించింది. తొలుత సత్యకుమార్ పేరును పరిశీలించిన హైకమాండ్…ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు, వివాదాలకు దూరంగా ఉండే పురంధేశ్వరిని అధిష్టానం ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి.. 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో పురందేశ్వరి కాషాయతీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీకి ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పురందేశ్వరికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇటీవలే పార్టీలో చేరిన ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు.

ఏపీలో గుట్టు చప్పుడు కాకుండా అధిష్టానం తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో… సోము వీర్రాజు షాక్ కు గురయ్యారు. పదవికి రాజీనామా చేయాలని నడ్డా నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో సోము వీర్రాజు ఖంగుతిన్నారు. బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతా రామరాజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన కాసేపటికే ఈ షాకింగ్ న్యూస్ ఆయన వినాల్సి వచ్చింది. జగన్ కు బీటీమ్ గా మారిన సోము… పార్టీలో వర్గపోరును పెంచి పోషించారనే ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవలి కాలంలో ఆయనపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అదీ చాలదన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటానికి కూడా కారణం సోము వీర్రాజేనన్న టాక్ నడిచింది.

బీజేపీలో ఉంటే గెలవలేమనే రీతిలో సోము చేసిన కామెంట్స్ కూడా ఆయన పదవికి ఎసరు పెట్టాయి. సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ ఏమాత్రం బలపడలేదు కాబట్టి, ఆయన్ను పక్కనబెట్టిందని అనుకోవచ్చు. కానీ, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా బండి సంజయ్ గట్టిగా కొట్లాడుతున్నా కూడా పదవి కోల్పోవాల్సి వచ్చింది. 2018 ఎన్నికల తర్వాత అధ్యక్ష బాధ్యతలు అందుకున్న సంజయ్…పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ వచ్చారు. సంజయ్ సారథ్యంలోనే బీజేపీ… దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలను గెలుచుకుంది. జీహెచ్ఎంసీలో 48 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి అన్ని వర్గాలకు బీజేపీని చేరువ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి బండికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలతో కష్టాలు మొదలయ్యాయి. వర్గపోరు మొదలైంది. అంతే, అధ్యక్ష పదవికి ఎసరు పడింది.

మొత్తంగా, తెలంగాణలో బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ కొట్లాడిన కాషాయ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. నేతల కుమ్ములాటలతో రోడ్డున పడింది. ఈనేపథ్యంలో కీలక బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి , పార్టీ నేతలను గాడినపెట్టి ఎన్నికలను ఫేజ్ చేయడం కత్తిమీద సామే. ఇక, ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందన్న వార్తలతో…ఓ సీనియర్ మహిళా నేత అయిన పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించడం సంచలనమనే చెప్పాలి. అయితే, పురంధేశ్వరి సారథ్యంలో వచ్చే ఎన్నికలను బీజేపీ ఏవిధంగా ఎదుర్కొంటున్నదో చూడాలి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *