జగన్ ప్రభుత్వం అవినీతిపై ఛార్జిషీట్ల దాఖలుకు బీజేపీ నిర్ణయం

జగన్ ప్రభుత్వం అవినీతిపై ఛార్జిషీట్ల దాఖలుకు బీజేపీ నిర్ణయం

వైసీపీ నేతల అవినీతిపై పోరాటానికి బీజేపీ సిద్దమైంది. అవును మీరు విన్నది నిజమే. వైసీపీ నేతల అవినీతి, భూ కబ్జాలు, అరాచకాలు, దాడులపై ఛార్జిషీట్లు దాఖలు చేయాలని కేంద్ర బీజేపీ నిర్ణయించడం రాజకీయ చర్చకు దారితీసింది. కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని వైసీపీ బంధం ఎంత బలంగా పెనవేసుకుపోయిందో నాలుగేళ్లుగా అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో, కేంద్ర బీజేపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. వైసీపీతో అంటకాగితే ఏపీతోపాటు, తెలంగాణలోనూ బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని కేంద్ర పెద్దలు గ్రహించినట్టున్నారు. అందుకే ఏపీలో వైసీపీ నేతల అవినీతిపై పోరాడాలని రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేతల భూ కబ్జాలు, అవినీతి, అరాచకాలను ఎండగట్టేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించడం చర్చనీయాంశం అయింది.

జిల్లాల వారీగా వైసీపీ నేతల అరాచకాలు, అవినీతి,భూ కబ్జాలను ముందుగా ఖరారు చేయాలని రాష్ట్ర నేతలకు కేంద్ర బీజేపీ ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే మేటర్ సీరియస్ గా ఉన్నట్టు అర్థం అవుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఛార్జిషీట్లతో సహా ఫిర్యాదు చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలొచ్చాయి. అంశాల వారీ చార్జిషీట్లు రూపొందించేందుకు సి.ఎం రమేష్, పురందేశ్వరి, సత్యకుమార్, మాదవ్‍తో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుతో వైసీపీపై ప్రత్యక్ష పోరుకు కేంద్ర బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ విడుదల చేసినట్టేనని భావించాల్సి వస్తోంది. మే 5 నుంచి ఈ కమిటీ కార్యాచరణ ప్రారంభించనుంది. ఐదు నెలల కిందటే రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. అయినా సోము వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ నేతలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాంతో, యువ నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో విజయవాడలో ఆ కమిటీ భేటీకానుందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై కేంద్ర బీజేపీకి అందుతున్న ఐబీ నివేదికలు ఆందోళన కలిగించాయని తెలుస్తోంది.

కేంద్ర బీజేపీ నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగడం చూస్తుంటే వైసీపీతో తెగతెంపులకు బీజేపీ సిద్దపడినట్లే కనిపిస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అమరావతి రాజధానిలో పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. పోలీసు అధికారులు దగ్గరుండి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జాతీయ నేత పరిస్థితే ఇలా ఉంటే, అసలు సామాన్యుల పరిస్థితి ఏంటని బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. అందుకే, ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసి, వెంటనే అమల్లోకి తీసుకు వచ్చేందుకు… కీలక నేతలను రంగంలోకి దింపారనే సమాచారం అందుతోంది. ఉత్తరాది బీజేపీలో కీలకంగా చక్రం తిప్పే సత్యకుమార్ ను కూడా తాజా కమిటీలో నియమించడం చూస్తుంటే జగన్ రెడ్డి సర్కారుపై కేంద్ర బీజేపీ సీరియస్ గా ఉన్నట్టు అర్థమవుతోంది.

ఏపీలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. కనీసం వార్డు మెంబరు కూడా గెలిచే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితిని మెరుగుపరిచే నాయకుడు కూడా కనిపించడం లేదు. కానీ వైసీపీతో అంటకాగితే తెలంగాణలోనూ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అసలు వైసీపీతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవనే ప్రయత్నాలు గట్టిగా చేయాలని కేంద్ర బీజేపీ నేతలు రాష్ట్ర బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఏపీ బీజేపీ అధినేతను మార్చకుండా, వైసీపీతో పోరాటం చేస్తున్నట్టు నటించడం వల్ల పెద్దగా ఒరిగేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *