
ఏపీ రాజకీయాల్లో డబుల్ గేమ్ ఆడుతున్న బిజేపీ
- Ap political StoryNewsPolitics
- April 9, 2023
- No Comment
- 30
కేంద్ర బీజేపీ పెద్దలు గోడమీద పిల్ల వాటం ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు జనసేనానితో పొత్తు కొనసాగిస్తూనే, వైసీపీ ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలనీయం అని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర బీజేపీ పెద్దలు చుక్కలు చూపిస్తున్నారు. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఆధారంగా ముందుకు వెళతామని జనసేనాని ప్రకటించి చారిత్రాత్మక తప్పిదం చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో అరశాతం కూడా ఓట్లు లేని బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురు చూడటం అంటే, ఆ పార్టీ బీజేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండాలంటే, ప్రతిపక్షాలన్నీ కలసి పోటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు బీజేపీ కూడా కలసి రావాలి.
ఒకవేళ టీడీపీతో కలసి పొత్తులో పోటీ చేసేందుకు ఇష్టం లేకపోతే కేంద్ర బీజేపీ పెద్దలు స్పష్టంగా ప్రకటించవచ్చు. కానీ జనసేన అధినేత ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఏపీలో టీడీపీతో కలసి ముందుగు సాగే విషయంలో మాత్రం బీజేపీ నేతలు స్పష్టత ఇవ్వడం లేదు. జనసేన, భారతీయ జనతా పార్టీలు, టీడీపీని కలుపుకుంటే రాష్ట్రంలో ఓట్ల చీలికను నివారించవచ్చు. జనసేనాని టీడీపీతో కలసి పోటీ చేసేందుకు సంసిద్దంగా ఉన్నా, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఏపీలో కొందరు బీజేపీ నేతలు వైసీపీతో పెనవేసుకుపోయారు. ఏపీ బీజేపీ నేతలకు టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. జనసేనతో మాత్రమే వారు పొత్తుకోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని ఓట్లు చీలికను ఎలా అడ్డుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది.
వైసీపీకి కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని ఎవరిని అడిగినా చెబుతారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పులు చేయడం కేంద్రంలోని బీజేపీ సహకారంతోనే సాధ్యమైంది. మరోవైపు సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ టూర్ తో…. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అటకెక్కింది. ఇలా వైసీపీ అధినేత జగన్ రెడ్డికి అప్పులు, కేసులు విషయంలో కేంద్రంలోని బీజేపీ నేతలు సహకరిస్తున్నారు. ఆ రెండు పార్టీల అనుబంధం ఏపీలో కన్నా ఢిల్లీలోనే బలంగా ఉంది. జనసేనాని మాత్రం వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనీయం అని పదే పదే చెబుతున్నారు. అదెలా సాధ్యం.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జనసేన, బీజేపీ కలసి వస్తేనే ఓట్ల చీలకను నివారించడం సాధ్యం అవుతుంది. అలా కాకుండా అధికారం దిశగా అడుగులు వేస్తున్నామని జనసేనాని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. స్వతంత్ర పార్టీగా ఎదగాల్సిన జనసేనను బీజేపీకి తాకట్టు పెట్టారా అనే అనుమానం కూడా ఒక్కోసారి కలుగుతోంది. ఏపీలో జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో సస్పెన్స్‌లో పడ్డారు. జనసైనికులు బీజేపీతో కలసి ముందుకు సాగేందుకు మొదటి నుంచీ ఏ మాత్రం ఆసక్తి చూప లేదు. దీనికి కారణం లేకపోలేదు. వార్డు మెంబరును కూడా గెలిపించుకోలేని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జనసైనికులకు ఇష్టం లేదు. అయితే ఏపీలో వైసీపీ అరాచకాలను అడ్డుకుని ఎన్నికలకు వెళ్లాలంటే కేంద్రంలోని బీజేపీ నాయకుల ఆశీస్సులు ఉండాలని జనసేనాని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
జనసేన, వైసీపీ విషయంలో ప్రధాని మోడీ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ రెడ్డికి సహకరిస్తూనే, ఏపీలో పరిస్థితులు బాగాలేవని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంధ్రబాబుతో వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని, శాంతిభద్రతలు కూడా క్షీణించాయని, ఏపీలో పంజాబ్ తరహా పాలన నడుస్తోందని ప్రధాని మోడీ చెప్పడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీలో వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలన్నీ తెలుసంటున్న ప్రధాని మోడీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా? చర్యలు తీసుకోకపోగా వైసీపీ అధినేత జగన్ రెడ్డి అడిగిందే తడవుగా లక్షల కోట్లు అప్పు వచ్చేలా చేశారు.
మోడీ, అమిత్ షా వైఖరి గమనిస్తే వైసీపీని కాదని టీడీపీతో కలసి వచ్చేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కర్నాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ 100 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు ఏపీ సీఎం జగన్ రెడ్డి, బీజేపీ పెద్దలకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంత మంచి అవకాశం బీజేపీ నేతలు ఎందుకు వదులుకుంటారు చెప్పండి. బీజేపీ నాయకుల మైండ్ సెట్ అంతగా అర్థం చేసుకోలేని జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్ మ్యాప్ అంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు కూడా అసహనంగా ఉన్నారు. జనసేన అధినేత తీసుకుంటోన్న నిర్ణయాలు, అసంబద్ద ప్రకటనలతో ఏపీలో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్న చందంగా తయారైంది.
ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారపార్టీ అరాచకాలను ఎండగట్టి, పోరాడి గెలవాలి. అంతేగాని కేసులకు భయపడితే ప్రస్తుత రాజకీయాలకు అసలే పనికిరారు. ఏపీలో ఏమాత్రం పట్టులేని బీజేపీ నేతల చుట్టూ తిరగాల్సిన దుస్థితి జనసేనానికి ఎందుకు వచ్చింది. అవసరం ఉంటే బీజేపీ నేతలే జనసేనాని ఇంటికి వస్తారు కదా? ఇక్కడ మాత్రం రివర్స్ లో జరుగుతోంది. ఏపీలో ఓట్లు చీలకుండా చేయడం ద్వారా, అధికారానికి దగ్గర కావాలనే ఆకాంక్షతో ఉన్న జనసేనాని, బీజేపీ ఆడుతోన్న గేమ్ నుంచి ఎంత తొందరగా బయట పడితే అంత మంచిది. అలా కాకుండా బీజేపీ నేతలు ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తే మాత్రం జనసేనానికి 2019 ఫలితాలే పునరావృతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.