
బీజేపీ-జనసేన పొత్తు లేనట్టేనా..?
- Ap political StoryNewsPolitics
- March 23, 2023
- No Comment
- 34
ఆంధ్రప్రదేశ్లో జనసేన -బీజేపీ మధ్య కొనసాగుతున్న పొత్తు.. చిత్ర, విచిత్రమైన రాజకీయ పరిణామాలకు వేదికగా నిలుస్తోంది. రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ ఇన్నాళ్ళూ.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సహకరించటం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తరువాత.. అదే రాగాన్ని ఇప్పుడు బీజేపీ నాయకులు ఆలపిస్తున్నారు. తమతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ సహకరించి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఈ దౌర్భాగ్యం తప్పేదని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా.. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి జనసేన పార్టీ సహాయ నిరాకరణే ప్రధాన కారణమని ఆయన అరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ కోసం అడిగినా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాలేదని మాధవ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీతో పొత్తు ఉన్నా లేనట్టే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. త్వరలోనే ఆ రెండు పార్టీల మధ్య నాలుగేళ్ళ స్నేహం పెటాకులు కానుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాధవ్ లాంటి సీనియర్ నేత ఆషామాషీగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరని.. పార్టీలో నెలకొన్న అభిప్రాయాన్నే ఆయన చెప్పి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చిన నేపథ్యంలో..బీజేపీ, జనసేన పార్టీల పొత్తుకు త్వరలోనే శుభం కార్డు పడవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
వాస్తవానికి బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అసలు రాష్ట్ర బీజేపీ నాయకత్వం తమకు సహకరించటం లేదని ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో సైతం పవన్ వ్యాఖ్యాన్నించారు. ఈ క్రమంలో బీజేపీకి రాం రాం చెప్పి తమ దారి తాము చూసుకుంటామనే ధోరణిలో పవన్ మాట్లాడారు. తమతో పొత్తు నటిస్తూనే.. వైసీపీతో బీజేపీ నేతలు అంటకాగుతున్నారని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు. దీంతో.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటింగ్ మొత్తం బీజేపీకి కాకుండా.. టీడీపీ వైపు పోలరైజ్ అయ్యింది. దీంతో.. 3 గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ తెలుగుదేశం ఘన విజయాలను నమోదు చేసింది.
ఎమ్మెల్యే ఎన్నికల్లో నోటాతో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లతో పోటీపడే స్థాయికి బీజేపీ దిగజారి పోయింది. అదే సమయంలో తమ మిత్రపక్షమైన జనసేన పార్టీ కమలంతో కాకుండా.. సైకిల్ వైపు అడుగులు వేస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన మాధవ్ లో జనసేనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ పరాజయానికి జనసేన చేసిన మిత్రద్రోహమే కారణమనేలా మాధవ్ ప్రసంగం సాగింది. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీలో స్టేచర్ ఉన్న నాయకుల్లో ఒకరైన మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేపో..మాపో జనసేన, బీజేపీ పొత్తుకు శుభం కార్డు పడవచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే కనుక జరిగితే.. ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.