
కర్ణాటకలో బ్రహ్మానందం ప్రచారం..ఎవరికోసమో తెలుసా ?
- NewsPolitics
- May 5, 2023
- No Comment
- 34
టాలీవుడ్ టాప్ కమెడీయన్, హాస్యబ్రహ్మ…. బ్రహ్మనందం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిక్క బళ్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున ప్రచారంలో పాల్గొని సందడి చేశారు.బ్రహ్మానందం రాకతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుధాకర్ ను గెలిపించాలని కోరుతూ బ్రహ్మానందం క్యాంపెయిన్ చేస్తున్నారు.
2019లో ఉప ఎన్నిక సమయంలోనూ బ్రహ్మానందం సుధాకర్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చా…సుధాకర్ ను గెలిపించండి అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా సినిమా డైలాగ్స్ చెప్పి అలరించారు. ఖాన్స్ తో గేమ్స్ ఆడొద్దు…శాల్తీలు లేచిపోతాయంటూ జనాన్ని ఉత్సాహపర్చారు. చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గంలో చాలామంది తెలుగు వారు ఉండటంతో బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు.సుధాకర్ ఎంతో మంచివాడని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు దూరంగా ఉండే బ్రహ్మానందం…బీజేపీకి ఓటేయాలంటూ కర్ణాటకలో సుధాకర్ తరపున ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. అప్పుడప్పుడు ఏదో ఓ సినిమాలో మెరుస్తున్నారు. ఇలాంటి సమయంలో సడన్ గా కన్నడనాట ఎంట్రీ ఇచ్చి…ఖాన్స్ తో గేమ్ ఆడొద్దంటూ అందరినీ సర్ ప్రైజ్ చేశారు బ్రహ్మానందం. కాగా, సుధాకర్ 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2019లో బీజేపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే అనర్హత వేటు ఎదుర్కొని.. ఉప ఎన్నిలకు వెళ్లారు. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా చిక్కబళ్లాపూర్ నుంచివిజయం సాధించారు.
ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగు నటుడు తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న సుధాకర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.