
ట్రంప్ మెడకు చుట్టుకున్న శృంగార తారతో లైంగిక సంబంధం
- NewsPolitics
- March 31, 2023
- No Comment
- 31
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. అధ్యక్షుడుగా ఎన్నిక కాక ముందు ప్లేబోయ్‌గా అనేక మంది మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుతం అటువంటి లైంగిక సంబంధాల్లో ఒకటి ఆయన మెడకు చుట్టుకుంది. కోర్టు ముందు దోషిగా చేతులు కట్టుకుని నిలబడేలా చేసింది. లైంగిక సంబంధాలున్న మహిళను డబ్బుతో ప్రలోభపెట్టినట్టు ట్రంప్‌పై నేరారోపణలు రుజువు కావటంతో త్వరలో అరెస్టు అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే క్రిమినల్ ఛార్జ్ ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ట్రంప్ పై ఆరోపణలను న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ నిర్ధారించటం.. అభియోగాలను సైతం మోపటంతో ట్రంప్ అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు.. ట్రంప్ ఎంతో విలాసవంతమైన జీవితం గడిపారు. కోట్లాది రూపాయల సంపద కలిగిన వ్యాపారవేత్తగా ఆయన ఎంతో మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని చెబుతారు. ఈ క్రమంలోనే 2006 లో “స్ట్రోమీ డానియల్స్” అనే అమెరికన్ శృంగార తారతో కూడా ట్రంప్ లైంగిక సంబంధం కొనసాగించారు. అయితే.. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయం బయట పడకుండా.. “స్ట్రోమీ డానియల్స్” కు ట్రంప్ డబ్బులు ఆఫర్ చేశారు. లక్షా 30 వేల డాలర్లు ఇచ్చి “స్ట్రోమీ డానియల్స్” తో “అనైతిక ఒప్పందం” చేసుకున్నారు. అయితే.. రెండేళ్ళ తరువాత ఈ అనైతిక ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ఆ మహిళ న్యూయార్క్ కోర్టుకు ఎక్కింది. దీంతో.. ట్రంప్ భాగోతం బయట పడింది. నిబంధనలకు విరుద్ధంగా.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ట్రంప్ అక్రమ చెల్లింపులు చేశారని, అనైతిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. న్యూ యార్క్ గ్రాండ్ జ్యూరీ తాజాగా వాటిని ధృవీకరించటంతో.. ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఒకవేళ ఆయన పై నేరారోపణలు రుజువు అయితే సుమారు 4 ఏళ్ళ పాటు ట్రంప్ జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ తనను ఇబ్బంది పెట్టేందుకే.. ప్రత్యర్ధులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ ఎదురుదాడి చేస్తున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. ఒకవేళ అరెస్టు అయితే రిపబ్లికన్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద.. అమెరికా మాజీ అధ్యక్షుడి హోదాలో ట్రంప్ క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కోవటం.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి దీని నుంచి ఆయన బయట పడతారా..? లేక జైల్లో ఊచలు లెక్కపెడతారా..? అనేది వేచి చూడాలి.