వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. అవినాష్ రెడ్డి అనుచరుని అరెస్ట్..!

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. అవినాష్ రెడ్డి అనుచరుని అరెస్ట్..!

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు జోక్యంతో మారిన టీమ్…విచారణ స్పీడప్ చేసింది. ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడిని సీబీఐ అరెస్టు చేసింది. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. గూగుల్ టేకౌట్ ఆధారంగా అతని నుంచి పక్కా ఆధారాలను రాబడుతోంది. ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం కావడంతో త్వరలోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే, ఈనెలాఖరు లోగా హత్య కేసును ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. తాజాగా ఉదయ్ అరెస్ట్ తో నిందితుల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక, తర్వాత అరెస్ట్ అవినాష్ రెడ్డేననే ఊహగానాలు వినిపిస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న.. వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా కడపలో మకాం వేసిన 15మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం…పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుంది. ఉదయ్ కుమార్ రెడ్డిని కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ కు తరలించి ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టు చేసింది.

వివేకా హత్యలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రపై సీబీఐ పక్కా సమాచారాన్ని సేకరించిందని చెబుతున్నారు. వివేకా హత్య తర్వాత ఫ్రీజర్, అంబులెన్స్, వైద్యుల్ని తెప్పించడంలో ఉదయ్ పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, గూగుల్ టేక్ ఔట్ సమాచారం ఆధారంగా…వివేకా హత్య రోజు అవినాష్, శివశంకర్ తో పాటు ఉదయ్ ఘటనా స్థలానికి వెళ్లినట్లు సీబీఐ గుర్తించింది. వాటి ఆధారంగా ఉదయ్ పాత్రపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్ప‌టికే పలుమార్లు ఉదయ్ ని సీబీఐ విచారించింది. గతంలో విచారణ పేరుతో సీబీఐ తనని వేధిస్తోందని… సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై క‌డ‌ప కోర్టులో ఉదయ్ కేసు కూడా వేశాడు.

ఇక.. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో జరిగిన వివేకా హత్య కేసు తీవ్ర సంచలనం రేపింది. ఈకేసులో ఇటీవలే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు.నాలుగుసార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇవ్వాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన అనుచరుడైన ఉదయ్ అరెస్ట్.. కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఉదయ్ కుమార్ రెడ్డి తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్నాడు. సీఎం జగన్ సతీమణి అయిన వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డికి ఓ హాస్పటల్ ఉన్న విషయం తెలిసిందే. ఉదయ్ తండ్రి ప్రకాశ్ రెడ్డి.. ఆ హాస్పటల్లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఈసీ గంగిరెడ్డి ఆదేశాలతో వైఎస్ వివేకా మృతదేహానికి ప్రకాష్ రెడ్డి కుట్లు వేసినట్టు తెలుస్తోంది. సునీల్ బెయిల్ పిటిషన్ కౌంటర్‌లో ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి పాత్రలను సీబీఐ వెల్లడించింది. ఉదయ్ అరెస్ట్ తో కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు.. వివేకా హత్య జరిగి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. ఇప్పటికే దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నా కోర్టుకు మాత్రం తగిన వివరాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైంది. ఇంకెన్నాళ్లు దర్యాప్తు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు…ఇన్వస్టిగేటివ్ టీమ్ లో మార్పులు చేసింది. అంతకుముందు ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌ సింగ్‌ ను తప్పించింది. విచారణ కోసం కేఆర్ చౌరాసియా నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది. అంతేకాదు వివేకా కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు ఏప్రిల్ నెలాఖరు వరకూ గడువు విధించింది. దీంతో, సీబీఐ దూకుడు పెంచుతోంది. అయితే, నిర్ణీత గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు సాగుతున్నాయి. ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ తో, నెక్ట్స్ లిస్ట్ లో ఉన్నదెవరనేది..? హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే అవినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోనుందని తెలుస్తోంది. అదే గనుక జరిగితే ఏపీ సీఎం జగన్ రెడ్డికి రాజకీయంగా కోలుకోలేని ఎదురదెబ్బ తగులుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *