
పట్టాలెక్కనున్న వందేభారత్ మెట్రో రైళ్లు..
- Ap political StoryNewsPolitics
- April 19, 2023
- No Comment
- 32
దేశంలో రైల్వేల ఆధునికీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య సక్సెస్ పుల్ గా నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు ప్రజాదరణ కూడా పొందాయి. త్వరలో వందే మెట్రో రైళ్లను కూడా నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలు వందేభారత్ రైళ్లకు, వందే మెట్రోకు తేడా ఏమిటి? వందే మెట్రోలో టికెట్ ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉంచనున్నారా?
వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఈ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. రెండు ప్రధాన నగరాల మద్య 600 నుంచి 800 కిలోమీటర్ల దూరం ఉండే ప్రాంతాలను కలుపుతూ వందేభారత్ రైళ్లను నడుపుతున్నారు. అయితే త్వరలో వందేభారత్ మినీ వెర్షన్ లో భాగంగా వందే భారత్ మెట్రోలను తీసుకురావాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికే వందే మెట్రోలు పరుగులు తీయనున్నాయి. ప్రధాన నగరాలకు రాకపోకలు వేగవంతం చేసేందుకు ఈ వందే మెట్రోలను ప్రవేశపెట్టనున్నారు. మెట్రో నగరాలకు వంద నుంచి 150 కిలోమీటర్ల దూరాలను కలుపుతూ వందే మెట్రోలను రోజుకు నాలుగైదు సార్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే సమీప ప్రాంతాల వారికి , చదువుకునే విద్యార్థులు వేగంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ఈ వందే మెట్రోలు ఉపయోగపడనున్నాయి.
వందేభారత్ రైళ్లు ఇప్పటికే దేశంలోని 44 నగరాలను కలుపుతా 14 రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల మధ్య గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు నడుపుతున్నారు. వీటిల్లో 16 కోచ్ లు ఉన్నాయి. అయితే వందే మెట్రో రైళ్లలో కేవలం 8 కోచ్ లు మాత్రమే ఉంటాయి. అంటే వందే భారత్ కు ఇది మినీ వెర్షన్ అని చెప్పవచ్చు. వందేభారత్ రైళ్లలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ తరగతులు ఉన్నాయి. వందే మెట్రోలో అలాంటి తేడాలు ఉండవు. వందేభారత్ సుదూర ప్రాంతాలను కవర్ చేస్తుంది. వాటిల్లో బాత్ రూం సదుపాయం ఉంది. వందే మెట్రోల్లో మాత్రం బాత్ రూం పదుపాయం ఉండదు. వీటిల్లో ప్రయాణం గంటలోపుగానే ముగుస్తుంది. కాబట్టి ప్రయాణీకులకు కూడా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. వందేభారత్ రైళ్లలో స్వల్ప మార్పులు చేసి, వందే మెట్రోలను త్వరలో పరుగులు పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబరులో వందే మెట్రో పట్టాలెక్కనుంది.
వందేభారత్ రైళ్ల టికెట్ విషయంలో ప్రయాణీకులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వీటిల్లో ధరలు సామాన్యులకు అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని, రోజు వారీ ప్రయాణీకులకు కూడా అందుబాటు ధరలో వందే మెట్రో టికెట్ ఖరారు చేయనున్నారు. అదే జరిగితే మహానగరాలకు రోజువారీ ప్రయాణం చేసే వారికి ఊరట లభిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.