
ఎన్నికల వేళ.. చంద్రబాబు మరో కీలక నిర్ణయం
- Ap political StoryNewsPolitics
- July 12, 2023
- No Comment
- 15
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పొలిటకల్ పార్టీలు.. తమ కార్యక్రమాల స్పీడ్ ను పెంచుతున్నాయి. నాలుగేళ్లుగా సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని.. స్వయంగా ప్రజలే వచ్చి ధర్నాలు చేస్తూ.. వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. కాలం గడిచేకొద్దీ.. ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుందని.. జగన్ .. ముందస్తుకు వెళ్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు .. సైకిల్ స్పీడును మరింత పెంచారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా రాజకీయంగా దూకుడు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో.. తన రోజూవారీ షెడ్యూల్ మార్పులు చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు.. పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో .. తన ఆధ్వర్యంలోనే .. చంద్రబాబు. పర్యవేక్షించనున్నారు.
ఏపీ, తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో .. ప్రతినెలా.. రెండు జిల్లాల్లో పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ వైపున .. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి .. యువనేత నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ద్వారా.. పలు జిల్లాలను టచ్ చేస్తూ.. జగన్ ప్రభుత్వ అవినీతిని ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర కూడా.. 2 వేల కిలోమీట్లర్లను పూర్తి చేసి.. ప్రజలకు మరింత చేరువైంది.మరోవైపు రాజమండ్రి మహానాడు వేదికగా ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టోపై.. టీడీపీ నేతల బస్సు యాత్రలు జరుగుతున్నాయి. మొత్తం మూడు జోన్లుగా విభజించి ఐదు బస్సుల్లో ఈ యాత్రలను నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యం లో తాను కూడా .. ఈ యాత్రల్లో పాలుపంచుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
దసరా నాటి కల్లా.. రెండో మేనిఫెస్టో ప్రకటనపై.. ఇప్పటికే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. వచ్చే కొద్ది రోజుల్లో .. నెలలో రెండు జిల్లాల పర్యటనలకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ.. పార్టీ క్యాడర్ తో పాటు.. పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. జిల్లాల టీడీపీ సీనియర్ నేతల మధ్య సమన్యయంతో.. ఎన్నికలకు వెళ్లాలని.. చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు నెలల్లోనే వెలువడే అవకాశం ఉండటంతో.. ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వచ్చినా.. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగినా .. క్యాడర్ అంతా సిద్ధంగా ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. టీడీపీ మేనిఫెస్టో, పార్టీ కార్యకలాపాలు, పర్యవేక్షణ చేసేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
చంద్రబాబు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని.. ముఖ్య సీనియర్ నేతలతో పాటు.. జిల్లాల పార్టీ కార్యాలయాల నేతలకు అందచేయనున్నారు. అన్ని జిల్లాల్లోని పార్టీ నేతలు, శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు చంద్రబాబు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల సమీక్షలను చేస్తూ..టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు.. కృతనిశ్చయంతో ఉన్నారు. టీడీపీలోని కీలకమైన, సీనియర్ నేతలతో .. వ్యక్తిగతంగా భేటి అవ్వడంతో పాటు.. వారి సలహాలను కూడా తీసుకోనున్నారు. ఇప్పటి వరకు టెలీ కాన్ఫరెన్స్ ల ద్వారా దిశానిర్దేశం చేస్తున్న చంద్రబాబు.. ఇకపై.. జిల్లాల్లో పర్యటిస్తూ.. నేతలు, స్థానికులతో స్వయంగా మాట్లాడుతూ.. వైసీపీ నియంతృత్వ పాలనపై.. సమరభేరి మోగించనున్నారు.