ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలకు వైసీపీ చిత్తు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలకు వైసీపీ చిత్తు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవటంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను చవి చూశారు. 2019 ఎన్నికల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలే గెలిచి.. పార్టీ ఘోర పరాజయం పాలైనా.. ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వైసీపీ దాడులు.. కేసులు.. వేధింపులను ఎదుర్కొంటూ పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. “టీడీపీ పని అయిపోయింది”.. అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెటకారాలు ఆడినా.. చంద్రబాబు తన పని తాను చేసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన శాసన మండలి ఎన్నికలను ఓ సవాల్‌గా తీసుకున్న ఆయన.. తన పార్టీ అభ్యర్ధులకు ఘన విజయాలు చేకూర్చి.. అధికారపక్షానికి చెమటలు పట్టించారు.

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను తీసుకున్నా.. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను తీసుకున్నా చంద్రబాబు రాజకీయ చాణుక్యం కనిపిస్తుంది. ముందుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికను తీసుకుంటే.. అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓ జనసేన తిరుగుబాటు ఎమ్మెల్యే, నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఎమ్మెల్సీగా నెగ్గాలంటే 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కానీ టీడీపీ చేతిలో 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందుగా అభ్యర్ధి ఎంపికలో తన రాజనీతిని ప్రదర్శించారు. బీసీ మహిళ అయిన పంచుమర్తి అనురాధకు ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ చేశారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ జెండా పట్టుకుని తిరుగుతున్న నేతగా అనురాధకు మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా ఇటు ప్రజా గళాన్ని.. అటు పార్టీ స్వరాన్ని బలంగా వినిపిస్తున్న మహిళా నాయకురాలు ఆమె. అటువంటి బీసీ మహిళా నేతకు టికెట్ ఇవ్వటం ద్వారా చంద్రబాబు బలమైన కేండెట్‌ను బరిలోకి దింపినట్టు అయ్యింది. అదే సమయంలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు అనురాధకు కూడగట్టేలా.. జరిపిన మంత్రాంగం కూడా ఫలించింది. దీంతో.. ఏకంగా 23 ఓట్లు అనురాథకు పోల్ అయ్యాయి. మొత్తం ఏడుకు ఏడు సీట్లు గెలుచుకుంటామని భావించిన వైసీపీ ఆశలను వమ్ము చేస్తూ.. అనురాథ ఘన విజయం సాధించగలిగారు. ఆమె విజయం వెనుక చంద్రబాబు అనుసరించిన వ్యూహాలు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాయని.. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసి సంచలనం సృష్టించింది. ఈ మూడు విజయాల వెనుక కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు అద్భుతంగా పని చేశాయనే చెప్పవచ్చు. ముందుగా.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడిన ఆయన.. విపక్షాల ఓట్లన్నీ టీడీపీకి మళ్ళేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా జనసేన కేడర్ టీడీపీ అభ్యర్ధుల వైపు డ్రైవ్ అయ్యేలా చేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ తరువాత బలమైన, ప్రజల్లో మంచి పేరున్న నాయకులనే ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా బరిలోకి దింపారు. రాయలసీమ వెస్ట్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నకైన భూమిరెడ్డి రాం భూపాల్ రెడ్డి, రాయలసీమ ఈస్ట్ నుంచి గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన వేపాడ చిరంజీవి రావు లకు స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కష్టకాలంలో పార్టీ జెండాను మోస్తున్న నేతలుగా కేడర్‌లోనూ ఆదరాభిమానాలు ఉన్నాయి. దీంతో వీరి అభ్యర్ధిత్వాలకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలక్షన్, పోల్ మేనేజ్మెంట్‌లో పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఓట్లు గంపగుత్తగా టీడీపీకి పడేలా చంద్రబాబు చాణుక్యనీతిని చూపించారు. మరోవైపు రాయలసీమలో వైసీపీ ఓట్లు సైతం టీడీపీకి పోల్ అయ్యేలా చంద్రబాబు పన్నిన వ్యూహాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. దీంతో మొత్తం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గ్రాండ్ విక్టరీ కొట్టారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సాధించిన తాజా విజయాలతో.. అనేక మంది నోటికి తాళాలు పడినట్టయ్యింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పని కష్టమంటూ ఎకసెక్కాలు ఆడిన నాయకులు ఇప్పుడు.. ఇదెలా సాధ్యం అయ్యిందంటూ.. కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నారు. 73 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు ఏం చేస్తారంటూ ఎగతాళి చేసిన వాళ్ళు.. ఆయన వ్యూహాలు చూసి నోరు వెళ్లబెడుతున్నారు. 2019 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు.. విపక్ష ఓట్లు చీలకుండా చేసిన ప్రయత్నాలు అంతిమంగా టీడీపీ అభ్యర్ధులకు ఘన విజయాలు చేకూర్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అధికార వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు ప్రకటించారంటే.. చంద్రబాబు వ్యూహాలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డబ్బుతో ప్రలోభ పెట్టారని వైసీపీ చేస్తున్న ఆరోపణలు దూదిపింజల్లా తేలి పోతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే రాజకీయ చాణుక్యం 2024లో కూడా చూపిస్తే.. చంద్రబాబుకు ఎదురే ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *