
పాదయాత్రను అడ్డుకుంటారా? అనుమతి లేకున్నా.. ఆగేదేలే…
- Ap political StoryNewsPolitics
- January 24, 2023
- No Comment
- 114
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సమాయాత్తమయ్యారు. యువగళం పేరుతో ఏపీలో చేపట్టనున్న పాదయాత్రపై ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు నాలుగు వందలరోజులపాటు నాలుగువేల కిలోమీటర్లమేర యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి అటు నారా ఇటు నందమూరి కుటుంబాలు మొత్తం హాజరవుతాయని చెబుతున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ కుమారులు కుమార్తెలు వారి సంతానమంతా వస్తారని అంటున్నారు. దీంతో పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుప్పంలో విసృత ఏర్పాట్లు చేస్తున్నారు.
లోకేశ్ పాదయాత్రకు అనుమతించే విషయంలో పోలీసుల వైఖరిపై తెలుగుదేశంపార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జనంలోకి వెళ్లాలని యువనేత లోకేశ్ సంకల్పిస్తే… అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాల్సి వస్తొందని పోలీసులను హెచ్చరించారు. యువనేత లోకేశ్ ప్రజల బాగోగులను తెలుసుకుంటూ ముందుకు సాగితే ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటనే ప్రశ్నిస్తున్నారు.మూడు వారాల ముందుగా అనుమతి కోరినప్పటికీ.. పోలీసులు నిర్లక్ష్యధోరణి దేనికి సంకేతమని ప్రశ్నించారు. ముందస్తు అనుమతులకోసం పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించారు. రాతపూర్వ అభ్యర్థనలు పంపారు. అయినా పోలీసు అధికారులు అనుమతి మంజూరు విషయంలో తాత్సారం చేస్తున్నారు. సంబంధంలేని ప్రశ్నలతో సాగదీతకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు పాదయాత్ర చేపట్టినపుడు ఏ నాయకుడూ పోలీసుల అనుమతి కోరిన దాఖలాల్లేవు. లోకేశ్ చేపట్టే పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు అధికారపార్టీ నాయకులు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.
అనుమతులు కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి, చిత్తూరు జిల్లా ఎస్పీకి, పలమనేరు డీఎస్పీకి లేఖలు రాసినా స్పందన లేదని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అలాగే ఇదే విషయాన్ని మెయిల్ చేయడంతోపాటు స్వయంగా డీజీపీ కార్యాలయంలో హార్డ్ కాపీలను సైతం అందజేశామని టీడీపీ నేత వర్లరామయ్య చెబుతున్నారు. ఆలస్యంగా స్పందించిన డీజీపీ లోకేష్ పాదయాత్రలో ఎవరెవరిని కలుస్తాడు? ఏ రోజు పాదయాత్ర ఎక్కడ ముగిస్తారు? ఎవరెవరితో ఏ రోజు మాట్లాడతారు? ఏ రోజు ఎక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది? ఎన్ని వాహనాలు పాల్గొటాయి? ఎంత మంది పాదయాత్రలో పాల్గొంటారు వంటి వివరాలన్నీ అడిగారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఉద్ధేశపూర్వకంగా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే సహించేదిలేదని టీడీపీ నాయకులు గట్టిగా హెచ్చరికలు జారీచేశారు. పోలీసులు అనుమతిచ్చినా… ఇవ్వకున్నా.. పాదయాత్ర ఆగేది లేదని టీడీపీ నాయకులు స్పష్టంచేశారు. రాజకీయ నాయకుడు పాదయాత్ర చేపట్టినపుడు ముందస్తుగా ఎవరిని కలుస్తారు? వాళ్ల పేర్లు, వివరాలు ఎలా ఇవ్వగలరని, దేశంలో ఎక్కడైనా ఇలాంటి యక్షప్రశ్నవేసిన దాఖలాల్లేవని టీడీపీ నాయకులు అంటున్నారు.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆతర్వాత జగన్ మోహన్ రెడ్డి, షర్మిల వేర్వేరు సందర్భాల్లో పాదయాత్రలు చేశారు. వీళ్లంతా ఎక్కడా పోలీసుల అనుమతి తీసుకుని పాదయాత్ర చేపట్టిన దాఖలాల్లేవని టీడీపీ నాయకులు పోలీసులకు గుర్తుచేశారు. జగన్ పాదయాత్ర సమయంలో పోలీసుల అనుమతి అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చాయి.
లోకేశ్ పాదయాత్ర ప్రారంభానికి ముందే వైసీపీలో వణుకు పుడుతోంది. అనుమతిచ్చేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రకరకాల ప్రశ్నలతో సాగదీత ధోరణిని అవలంభిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు మాత్రంలో రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించారు. మరోవైపు వివిధ కారణాలను సాకుగా చూపి ఇప్పటివరకు లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతే ఇవ్వలేదు. అయితే పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా అనుకున్న ప్రకారం.. లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ వర్గాలు తేల్చిచెబుతున్నాయి.