చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీపై ఏపీ బీజేపీలో కలవరం..!

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీపై ఏపీ బీజేపీలో కలవరం..!

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ పార్టీల మధ్య పొత్తు.. బీజేపీలో చిచ్చు రాజేస్తోందా..? తెలుగుదేశానికి దూరంగా జనసేనను ఉంచాలని ప్రయత్నిస్తున్న నేతలకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదా..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ భేటీని చూసి తట్టుకోలేక పోతున్నారా..? పొత్తులపై పవన్‌నే అడగండంటూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎందుకు అంటున్నారు..? బీజేపీలోని మూడు వర్గాలు మూడు రకాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాయి..?ఏదో అనుకుంటే.. ఇంకేదో అయినట్టుగా ఉంది.. ఏపీలోని కొంత మంది బీజేపీ నేతల పరిస్థితి. కమలంతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. తమ పార్టీని కాదని సైకిల్ ఎక్కాలనకోవటం.. కొంత మంది కమలనాథులకు మింగుడు పడటంలేదు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సోము వీర్రాజుకైతే.. పవన్, చంద్రబాబు భేటీని తలచుకుంటేనే చిర్రెత్తుకొచ్చేస్తోంది. లోలోన అసహనంతో రగిలిపోతున్న వీర్రాజు.. పైకి మాత్రం దానిని కప్పిపుచ్చుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబుతో పవన్ భేటీపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరగా.. నన్నెందుకు అడుగుతారు..? ఆయన్నే అడగండి అంటూ చిర్రుబుర్రులాడారు. అసలు పవన్ కళ్యాణ్ తమతో పొత్తులో ఉన్నారో లేదో.. జనసేనే చెప్పాలంటూ అసహనం ప్రదర్శించారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారో తమకెలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. టీడీపీకి జనసేన దగ్గర కాకుండా చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతుండటంతోనే.. సోము విర్రాజు ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక. భారతీయ జనతాపార్టీలో ఆదినారాయణ రెడ్డి వంటి వారు మాత్రం.. పవన్ టీడీపీతో కలిసినా ఫర్వాలేదని అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏపీలో తిరుగే ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి.. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని కూడా ప్రకటించేశారు. అయితే దీనిపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అవుతోంది. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంద. కానీ.. ఇటు జనసేన, అటు టీడీపీ లేకుండా బరిలోకి దిగితే బీజేపీ మునగటం ఖాయమని ఆదినారాయణ రెడ్డి వంటి వారు భావిస్తున్నారు.

ఒకవేళ తనపై వేటు పడినా.. ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటానికి సిద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. మాజీ మంత్రి విష్ణుకుమార్ రాజు లాంటి బీజేపీ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ అనుకూల స్టాండ్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే.. టీడీపీ లాంటి భావ సారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకోవటమే బెటరనే వాదనలను వీరు వినిపిస్తున్నారు.

ఇక.. చివరగా.. జనసేన మాత్రం వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలబోనివ్వమని చెబుతోంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనకు జనసేన, టీడీపీతో పాటు అన్ని విపక్ష పార్టీలు కలిసి రావాలని పిలుపు నిస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి చంద్రబాబు నాయుడుతో భేటీ కావటం.. అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎటువంటి భేషజాలకు పోకుండా.. తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేనాని వేస్తున్న అడుగులకు ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీ శ్రేణుల నుంచే కాకుండా.. తటస్థ ఓటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఎవరు కలిసి వచ్చినా.. రాకపోయినా.. టీడీపీతో జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. అయితే దీనిపై బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *