
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?
- Ap political StoryNewsPolitics
- September 19, 2023
- No Comment
- 16
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్, బీజేపీల నుంచి అసమ్మతి నేతలను లాగుతూనే… కలిసొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచన చేస్తోంది. మరోవైపు, పార్టీ పరంగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తుక్కుగూడలో విజయభేరిని సక్సెస్ చేసిన కాంగ్రెస్… ఆరు గ్యారంటీ స్కీములను ప్రజల ముందుంచింది. కర్ణాటకలో ఏ హామీలైతే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయో… అవే పథకాలను ఇక్కడా ప్రకటించింది. విజయభేరి సభలో సోనియా ప్రకటించిన హామీలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణలో సంక్షేమ పథకాలతో ఆకట్టుకోవాలంటే… ఆషామాషీ కాదు. సూపర్ సిక్స్ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్… ఏమేరకు ఓట్లు రాబడుతుందనేది ఇప్పుడు పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రకటించిన హామీలకు భారీ బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. ఆ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వి అబద్ధపు హామీలని ఇప్పటికే ప్రత్యర్థులు విమర్శలు మొదలుపెట్టారు. అన్నింటినీ దాటుకొని పోవాలంటే… పథకాల అమలు తీరు తెన్నుల గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ఇచ్చినం, కచ్చితంగా ఎన్నికల హామీలను అమలు చేసి తీరుతామని హస్తం పార్టీ చెబుతోంది.
కేసీఆర్ సర్కార్ కూడా గత రెండు పర్యాయాలు చాలా హామీలే ఇచ్చింది. కానీ, ఇప్పటికీ చాలా వరకు అమలుకు నోచుకోలేదు. దళితులకు మూడు ఎకరాల భూమి గంగలో కలిసిపోయింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు కొందరికే దక్కాయి. ఇప్పుడు గృహలక్ష్మీ పథకమంటూ మళ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా జిమ్మిక్కులు చేస్తోంది. ఇన్నాళ్లు రుణమాఫీ ఊసెరగని కేసీఆర్… సరిగ్గా ఎన్నికలకు ముందు మాఫీ మొదలుపెట్టారు. ఇలా ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మాలంటే.. అంతకు మించిన ప్రయత్నాలే చేయాలి.
మొత్తంగా, ఆరు గ్యారంటీ స్కీములను ప్రజల్లోకి పంపించిన కాంగ్రెస్, వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్, ప్రత్యర్థుల మేనిఫెస్టో రిలీజ్ కు అనుగుణంగా… కాంగ్రెస్ మళ్లీ కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.