
జగన్‌ను ఇరికించిన అజయ్ కల్లం..! త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సీబీఐ..?
- Ap political StoryNewsPolitics
- May 20, 2023
- No Comment
- 66
తన చిన్నాన్న వివేకా హత్య కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని.. ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అడ్డంగా ఇరికించారా..? ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. ఆయన జగన్ రెడ్డిని బుక్ చేసేశారా..? వివేకా మరణ వార్త ప్రపంచానికి తెలియక ముందే.. జగన్ రెడ్డికి తెలుసు అనే విషయం సీబీఐకు చెప్పేశారా..? సీబీఐకు ఆయన ఇచ్చిన వాంగ్మూలం మొత్తం వివేకా హత్య కేసునే మలుపు తిప్పనుందా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య జరిగిన రోజు ఉదయం తాము జగన్ ఇంట్లోనే ఉన్నామని ఒప్పుకున్న అజయ్ కల్లం.. వివేకా మరణ వార్తను సైతం తమకు జగన్ రెడ్డే చెప్పారని వెల్లడించారు. దీంతో అజయ్ కల్లం స్టేట్ మెంట్ పెను సంచలనం సృష్టిస్తుండటమే కాకుండా.. కేసు విచారణలో అత్యంత కీలకంగా మారుతోంది.
“ఏదో అనుకుంటే.. ఇంకేదో అయినట్టుగా తయారయ్యింది.. వివేకా హత్యకేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి”. ముఖ్యమంత్రి హోదాలో ఈ కేసు నుంచి తన వాళ్ళను కాపాడాలని జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ.. టైమ్ మాత్రం ఆయనను తాచుపాములా కాటేస్తూనే ఉంది. ఓవైపు.. తమ్ముడు అవినాష్ రెడ్డిని కేసు నుంచి బయట పడేద్దామని జగన్ రెడ్డి భావిస్తుండగా.. మరోవైపు స్వయంగా ఆయనే కేసులో కూరుకుపోతున్నట్టు కనిపిస్తోంది. దీనికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, జగన్ సన్నిహితుడు, మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం పెట్టిన ప్రెస్‌మీట్ నిదర్శనంగా నిలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు 2019 మార్చి 15వ తేదీన.. అజయ్ కల్లం తో పాటు మరో నలుగురు జగన్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారని మీడియాలో కథనాలు వచ్చాయి.
తెల్లవారు ఝాము 4.30 నిమిషాల సయంలో వివేకా మరణ వార్తను జగన్ రెడ్డే స్వయంగా వారికి చెప్పినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. కానీ.. ఈ కథనాలను జగన్ రెడ్డి కానీ.. వైసీపీ నేతలు కానీ ఖండించలేదు. చివరకు… ఆ నలుగురిలో ఒకరైన అజయ్ కల్లం బయటకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. ఆరోజు తాము జగన్ రెడ్డి ఇంటిలో ఉన్నామన్న ఆయన.. వివేకా మరణ వార్తను తమకు జగన్ చెప్పినట్టు ఒప్పుకున్నారు. ఇదే అంశంపై సీబీఐ తన నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు కూడా వెల్లడించారు. అయితే వివేకా మరణ వార్తను జగన్ ఏ టైమ్‌లో చెప్పారనే విషయం మాత్రం తనకు గుర్తులేదని అజయ్ కల్లం చెప్పుకొచ్చారు.
వాస్తవానికి వివేకా మరణ వార్త ఉదయం 6.30 నిమిషాల తరువాతే బయటి ప్రపంచానికి తెలిసింది. కానీ.. తాజాగా ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం తెల్లవారు ఝామునే జగన్ రెడ్డి వద్ద ఆ సమాచారం ఉందని తెలుస్తోంది. వీరి భేటీపై కథనాలు రాసిన మీడియాలో కూడా.. ఆ నలుగురి మీటింగ్ తెల్లవారు ఝాము 4.30 సమయంలో జరిగిందని పేర్కొంది. తమ మీటింగ్ సమయంలోనే జగన్ కు కాల్ వచ్చిన విషయాన్ని సైతం అజయ్ కల్లం ఒప్పుకున్నారు. అంటే హత్యతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారే జగన్ కు కాల్ చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా తెల్లవారు ఝామున జగన్ ఇంట్లో ఆ నలుగురు భేటీ అయిన విషయాన్ని సైతం అజయ్ కల్లం కన్ఫర్మ్ చేశారు. సో.. అజయ్ కల్లంతో పాటు మిగిలిన ఆ ముగ్గుర్ని, చివరకు జగన్ రెడ్డిని సైతం సీబీఐ విచారించే ఛాన్స్ కనిపిస్తోంది. విషయం అంత వరకు వస్తే.. జగన్ భార్య భారతి సైతం సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటికే.. సోదరుడు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కోవటంతో..జగన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీబీఐ తనదాకా వస్తుందని ఆయన భయపడుతున్నారు. విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి ఏం చెబుతున్నాడో అనే టెన్షన్ జగన్ రెడ్డిని వెంటాడుతోందని అంటున్నారు. ఇక.. భవిష్యత్‌లో తాను కూడా సీబీఐ విచారణకు వెళ్లాల్సి వస్తే రాజకీయంగా జగన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం మీద.. ఆ నలుగురిలో ఒకరైన అజయ్ కల్లం ఇచ్చిన స్టేట్ మెంట్..సీఎం జగన్ రెడ్డిని వివేకా కేసులో పూర్తిగా ఇరికించిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.