
బండిని మారిస్తే బీజేపీలో జరిగేది అదేనా..?
- NewsPoliticsTelangana Politics
- July 2, 2023
- No Comment
- 15
తెలంగాణలో మొన్నటిదాకా విరబూసిన కమలం, ప్రస్తుతం వాడిపోతోంది. ఎన్నికలకు ముందు కమలదళంలో కుమ్ములాటలు కేడర్ ను గందరగోళంలో పడేస్తున్నాయి. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒంటెత్తు పోకడలకు పోతున్న బండిని మార్చాలని వలస నేతలు పట్టుబడుతున్నారు. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామంటూ ఢిల్లీ పెద్దల ముందు కుండబద్దలు కొడుతున్నారు. దీంతో, అధ్యక్షుడిని మార్చేందుకు హైకమాండ్ కిందా మీద పడుతోంది. ఎన్నికలకు ముందు ఎందుకొచ్చిన గొడవ అని కొందరు ప్రెసిడెంట్ పదవి వద్దంటుంటే..మరికొందరు అడిగినా ఇచ్చే పరిస్థితిలో అధిష్టానం కనిపించడం లేదు. అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్నావారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనుకుంటోన్న అగ్రనేతలు, డైలమాలో పడిపోయారు.
తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కుమ్ములాటలకు కేరాఫ్ గా ఉన్న కాంగ్రెస్ ను మించిపోయారు కమలనాథులు. బండి సంజయ్ వర్గం వర్సెస్ వలస నేతలు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీంతో, వర్గాలుగా చీలిపోయి వాదులాడుకుంటున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత హస్తం పార్టీ హ్యాండ్ రెయిజ్ చేయడంతో… బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో, నేతలను కట్టడి చేసేందుకు పార్టీలో ప్రక్షాళణకు సిద్ధమయ్యింది అధిష్టానం. బండి సంజయ్ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకొని కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనే ఆలోచనలో కేంద్రపెద్దలు ఉన్నారట. అయితే, పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కిషన్ రెడ్డి సముఖంగా లేరన్న వార్తలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి కాదనుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మణ్ పేరు పరిశీస్తున్నారట.
రాష్ట్ర నేతలంతా విభేదాలు పక్కనబెట్టి అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర పెద్దలు సూచించినప్పటికీ.. పార్టీలో గొడవలు సద్దుమణగడం లేదు. ఇటీవల నడ్డా సభకు ఈటల, రాజగోపాల్ రెడ్డిలు దూరమవ్వడం పెనుదుమారమే రేపింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావనతో… ఈటల రాజేందర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ఈటల, రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం పార్టీ పరిస్థితిపై చర్చించింది. రాజేందర్ కు త్వరలోనే ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
ఇటీవల ఈటల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా…బీజేపీ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పార్టీలో మరింత అగ్గిరాజేసింది. సొంత పార్టీ నేతలను గాడినపెట్టాలంటే ఏం చేయాలో, అగ్రనేతలకు ట్యాగ్ చేస్తూ… దున్నపోతుకు సంబంధించిన ఓ వీడియో పెట్టారు. దీనిపై ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు, గౌరవాన్ని బట్టి నడుచుకోవాలని జితేందర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కొందరు బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. రాజాసింగ్ ను మళ్లీ పార్టీలోకి తీసుకుంటే, ప్రత్యర్థులు టార్గెట్ చేసే అవకాశముంది. మొత్తంగా, ఈ వ్యవహారాలన్నీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
తాజా పరిణామాలపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో చేరిన నేతలు ఉంటారో వెళ్తారో తెలియదు. అలాంటి వారి మాటలు విని, పార్టీ విధేయులను దూరం పెట్టుకోవద్దని కొందరు అధిష్టానానికి నివేదిస్తున్నారట. ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని మారిస్తే పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మాస్ ఇమేజ్ ఉన్న బండి సంజయ్ నే కొనసాగించాలని చాలా మంది నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. సంజయ్ వల్లే పార్టీ బలోపేతమైందని, ఆయన్ను మారిస్తే కొత్త చేరికలు ఉండకపోగా పార్టీని వీడేవారు ఉంటారని కొందరు సూచిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.