
తెలంగాణలో మొదలైన.. ఎన్నికల సంగ్రామం
- NewsPoliticsTelangana Politics
- July 9, 2023
- No Comment
- 14
తెలంగాణాలో ఎన్నికలకు సరిగ్గా.. 6 నెలలు మాత్రమే ఉంది. ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్‌కు చెందిన అధికారులు పలు దఫాలుగా .. తెలంగాణ ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లను కూడా వేగవంతం చేసింది. ఇక ఎలక్షన్ కమిషన్ రాష్టంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ ఇస్తే.. అప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో .. తెలంగాణ జిల్లాల్లోని అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే.. వివిధ జిల్లాల అధికారులు ఎన్నికల పనులపై దృష్టి సారించారు. దీంతో అన్ని జిల్లాల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. సెప్టెంబర్ లేదా.. అక్టోబర్ మధ్యలో ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో అధికారులు కొత్త ఓటర్ల నమోదు, ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్ల తనిఖీలను ముమ్మరం చేశారు. బీఎల్‌వోల నియామకంతో పాటు శాఖలవారీగా ఆఫీసర్లు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ దాదాపు పూర్తి కావొచ్చింది. అటు బూత్‌ల వారీగా వసతులు ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలైంది. మరోవైపు కొత్త ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ జోరుగా సాగుతోంది. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటర్ లిస్టులో మార్పు చేర్పుల కోసం చేపట్టిన సర్వే.. జూన్ 23కే పూర్తైంది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా నియమించిన అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాత ఓటర్ లిస్టుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎన్నికల యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది.
తెలంగాణలో దాదాపుగా .. 10.5 లక్షల డూప్లీకేట్ ఓట్లను తొలగించినట్లు సమాచారం.తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర జిల్లా స్థాయి ఆఫీసర్లు.. వారంలో రెండు రోజులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ లలో ఇంకా ఎలాంటి వసతులు కల్పించాలనేది నోట్ చేసుకుంటున్నారు. క్రిటికల్, హైపర్ క్రిటికల్, సెన్సిటివ్ ప్రాంతాలను మండల స్థాయి ఆఫీసర్లు విజిట్ చేసి పరిశీలిస్తున్నారు. ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్‌ను అన్ని గ్రామాలవారీగా పంచాయతీ ఆఫీసుల వద్ద అతికించనున్నారు. పొలిటికల్ పార్టీలకు.. ఓటర్ల లిస్ట్‌ను అందజేసి, ప్రతి శని,ఆదివారాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నారు. అనంతనం సెప్టెంబరులో తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఒక సెట్ తహసీల్దార్ ఆఫీసులో, మరొక సెట్ మొబైల్ ఈవీఎం ద్వారా గ్రామాల్లో ప్రదర్శించనున్నారు. మొబైల్ టీమ్ వెంట సెక్టోరియల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. ప్రతి ఓటరుకు .. ఈవీఎం పట్ల అవగాహన కార్యక్రమాన్ని.. జూలై 10 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఆఫీసర్లు రూట్ మ్యాప్ లకు సంబంధించిన షెడ్యూల్స్ తయారు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు.. ఎన్ని ఈవీఎంలు అవసరం అవుతాయనే వివరాలను అధికారులు నోట్ చేస్తున్నారు.
విలేజ్ లెవల్‌లో 12 కేటగిరీలలో ఉన్న వర్కర్లను బీఎల్వోలుగా గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, పంచాయతీ సెక్రటరీలు, వీవోఏలను బీఎల్వోలుగా నియమించారు. తెలంగాణ వ్యాప్తంగా 34,867 మంది బీఎల్వోలుగా పని చేస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ సర్కార్ నిర్వహించిన.. వివిధ సర్వేల్లో భాగస్వామ్యం కావడంతో ఎక్కువ జిల్లాల్లో అంగన్వాడీలు, ఆశలనే బీఎల్వోలుగా నియమించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలు గతంలో గరుడ యాప్ ద్వారా అప్ డేట్ చేసేవారు. కానీ .. ఇప్పుడు కొత్తగా.. బీఎల్వో యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారానే కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, డెలిషన్‌కు సంబంధించిన ఫామ్స్‌ను బీఎల్వోలో అప్ లోడ్ చేస్తున్నారు.