
బండిపై ఈటెల బాణం.. ఢిల్లీలో ఏం జరిగిందంటే?
- NewsPoliticsTelangana Politics
- May 22, 2023
- No Comment
- 33
అంతర్గత కలహాలు, కుమ్ములాటలకు కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ తో ఇప్పుడు తెలంగాణ బీజేపీ కూడా పోటీ పడుతోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకునే కాషాయ నేతలు..గ్రూపులుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో ఓటమితో కేంద్ర పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కోల్పోవడం, ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై పడే అవకాశముండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నేతల మధ్య విభేదాలు అగ్రనేతలకు మరింత తలనొప్పిగా మారాయి.
బండి సంజయ్ తీరుపై ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. సంజయ్ ను పార్టీ అధ్యక్షల బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే, అగ్రనేతలు మాత్రం ఎన్నికల వరకు బండినే బాస్ గా కొనసాగించాలని భావించారు. కానీ, పార్టీలో అంతర్గత కలహాలు పెరగడం, కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో మరోసారి తప్పులు చేయకూడదనే ఆలోచనతో ఉన్నారట. ఈ క్రమంలోనే చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈటెల రాజేందర్ తెలంగాణలో పార్టీ పరిస్థితిపై అమిత్ షాకు కీలక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
దక్షిణ భారతదేశంలో హిందుత్వ అజెండాతో ప్రచారం చేయడం అంతగా వర్క్ అవుట్ కాదనే అభిప్రాయంతో ఈటెల వర్గం ఉంది. హైదరాబాద్ పేరు మార్చడం, ముస్లిం కోటా, హిజాబ్ వంటివి కాకుండా.. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళితే ఫలితముంటుందని భావిస్తున్నారు. ఇవే విషయాలను ఈటెల హైకమాండ్ కు నివేదించారని అంటున్నారు. బండి సంజయ్ తరుచుగా తెలంగాణ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగే సమయంలో.. హిందూత్వ అంశాలను ప్రస్తావిస్తుంటారు. ఇటీవల నూతన సచివాలయం గోపురాలు మసీదులా ఉన్నాయని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇలా ప్రతి విషయంలో ఆయన హిందూత్వ అజెండాతో ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉంటే…బయటి నుంచి వచ్చినవారికి, కొత్తవారికి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు బీజేపీలో ఓ వర్గం అంగీకరించడం లేదనే చర్చ సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలోకి వచ్చేందుకు ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపడం లేదని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి సహా కొందరు నేతలు అంత యాక్టీవ్ గా కనిపించడం లేదు. పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టాలనే ఆలోచనతో ఉన్న ఈటెల రాజేందర్… సంజయ్ ఏకపక్ష పోకడలపై రగిలిపోతున్నారు. వివేక్ సహా మరికొందరు నేతలు సంజయ్ పై తీవ్ర అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల పొంగులేటి ఇంటికి ఈటల వర్గం వెళ్లిన సందర్భంగా.. ఆ విషయం తనకు తెలియదంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం పార్టీలో విభేదాల్ని బయటపెట్టింది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితిని మరింత లోతుగా అధ్యయనం చేస్తున్న బీజేపీ హైకమాండ్.. తెలంగాణ విషయంలో కొన్ని కఠిన కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది.
మొత్తంగా, త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ఫుల్ ఫోకస్ పెడుతోంది. భారీ బహిరంగసభలకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక చేజారిన క్రమంలో, తెలంగాణలో పార్టీ నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈటెల, బండి సంజయ్ లను ఢిల్లీకి పిలిపించి… విభేదాలు పక్కన బెట్టి పార్టీ గెలుపుపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది.