
జగన్ తో పొంగులేటి భేటీ వెనక షర్మిల ఉందా?
- Ap political StoryNewsPoliticsTelangana Politics
- July 7, 2023
- No Comment
- 14
తెలంగాణలో మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి…ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా షర్మిల కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పొంగులేటి జగన్ ను కలవడం సంచలనం రేపుతుంది.
తాడేపల్లిలోని సీఎం నివాసంలో పొంగులేటి జగన్ ను కలుసుకున్నారు. వైఎస్ ఫ్యామిలీతో పొంగులేటికి సత్సంబంధాలున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన సందర్భంలోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ ను ఓసారి కలిశారు. అటు షర్మిల, విజయమ్మను కూడా కలుసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. షర్మిల గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీ తరపున పాదయాత్ర చేపట్టినప్పుడు…పొంగులేటి ఆమెతో కలిసి నడిచారు.
పాలేరులో షర్మిల పోటీ చేస్తే ఆమెను గెలిపించేస్తానని పొంగులేటి హామీ ఇచ్చినట్టు టాక్ కూడా వినిపించింది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం వెనక జగన్ ఉన్నారనే ఊహగానాలు వినిపించాయి. ఈ క్రమంలో షర్మిల కూడా హస్తం గూటికి చేరతారనే ప్రచారంతో… జగన్ తో పొంగులేటి భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి.