
ధర్మవరంలో జగన్ కు నిరసన సెగ.. కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు
- Ap political StoryNewsPolitics
- April 28, 2023
- No Comment
- 39
బటన్ల మీద బటన్లు నొక్కేస్తున్నా…175 సీట్లు గెలిచేస్తున్నాం. ప్రతీ మీటింగ్ , సభలలో ఏపీ సీఎం జగన్ రెడ్డి చెబుతున్న మాటలు. అయితే, ఆయన చెబుతున్నదేంటి…చేస్తున్నదేంటి? అనేది రోడ్డెక్కితేగానీ తెలిసిరాలేదు. ధర్మవరం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రికి…తన పాలనపై ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనే తత్వం బోధపడింది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలిసొచ్చింది. రోడ్డు మీదకు వస్తే జనం ఏవిధంగా నిలదీస్తారో స్వయంగా చవిచూశారు. పరిహారం కోసం నాలుగేళ్లుగా పాలకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని పక్షంలో..ధర్మవరం మండలంలో కొందరు రైతులు సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
సత్యసాయి జిల్లాకు వెళ్లిన సీఎం జగన్ రెడ్డి… తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గాన ధర్మవరం మీదుగా వెళ్తుండగా కొందరు రైతులు కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. తుంపర్తి, మోటుమర్ల గ్రామాలకు చెందిన వారు ఒక్కసారిగా రహదారి పైకి చేరుకొని…. ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినన పొలాలకు పరిహరం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, భద్రతా సిబ్బంది కిందకు దిగి వారిని పక్కకు ఈడ్చి పడేశారు. ఈలోపు సీఎం వాహనం వారిని దాటుకుని వెళ్లిపోయింది. తమకు న్యాయం చేసేదెవరంటూ మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. ఓ మహిళలు విలపిస్తూ రోడ్డుపై పడిపోయారు.
ధర్మవరం నియోజకవర్గంలో జగన్ కాన్వాయ్ కు అడ్డం పడిన వారంతా వైసీపీ సానుభూతిపరులే. జగన్ ను నమ్మి నట్టేట మునిగారు. పేదల కోసం టిడ్కో ఇళ్లు నిర్మించడానికి, గత టీడీపీ ప్రభుత్వం భూములు సేకరించింది. అప్పుడు ఎకరానికి ఐదు లక్షల పరిహరం ఇచ్చింది. అయితే వైసీపీ నేతలు .. తమ పార్టీ సానుభూతిపరుల్ని రెచ్చగొట్టారు. పరిహారం చాలదని కోర్టుకెళ్లేలా చేసుకున్నారు. సగం మంది భూములు ఇచ్చిన వారు పరిహారం తీసుకున్నారు. కోర్టుకెళ్లిన వారికి పరిహారాన్ని ప్రభుత్వం జమ చేసింది. అయితే, తాము వచ్చాక పరిహారం పెంచి ఇస్తామని చెప్పిన జగన్ మడమ తిప్పేశారు. పరిహారం పెంచకపోగా అసలు పట్టించుకోవడమే మానేశారు. దాంతో, వైసీపీ నేతల మాటలు నమ్మి అటు పొలం పోయి..ఇటు పరిహారం అందక రైతులు రోడ్డున పడ్డారు. ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోవడం లేదని, నిండా ముంచేశారని బాధితులు బోరుమంటున్నారు.
రాష్ట్రంలో జగన్ ను నమ్మి మోసపోయిన బాధితులంతా రోడ్డెక్కుతుండడంతో, ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. రైతులను రోడ్డున పడేసి, గాలి మోటార్ లో తిరుగుతోన్న జగన్ కు..కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జనం తిరుగుబాటుతో ఏపీలో జగన్ పాలనకు రోజులు దగ్గరపడినట్లేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.