
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పది లక్షల అమెరికా స్టడీ వీసాలు రెడీ
- News
- April 21, 2023
- No Comment
- 28
అమెరికాలో విద్యనభ్యసించడం, అక్కడే ఉద్యోగంలో స్థిరపడటం ఇవన్నీ భారతీయ సగటు విద్యార్థుల కల. ఆ కల మరింత ఈజీగా నెరవేరబోతోంది. భారత్ నుంచి ఏటా లక్షలాది మంది ఉన్నతచదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళుతుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది యూఎస్ కు పయనం అవుతున్నారు. అయితే, వీరంతా వీసాలు పొందేందుకు చాలా ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు. ఈ ఏడాది నుంచి వీసా సులభతరం కానుంది.
అమెరికాలో చదువుకోవాలనే భారత విద్యార్థుల కల నెరవేరనుంది. ఇక నుంచి వీసాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. గతంలో వీసా కోసం కనీసం ఆరు నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఈ ఏడాది భారతీయ విద్యార్థుల కోసం 10 లక్షల వీసాలు ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, అమెరికా వీసాల కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ .
హైదరాబాద్ నానక్ రామ్ గూడలో 2,800 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కొత్త అమెరికా కాన్సులేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. ఇక వీసాల జారీ మరింత సులభంగా, త్వరగా చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద అమెరికా కాన్సులేట్ కార్యాలయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. గతంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం ద్వారా రోజుకు కేవలం 1100 వీసాలు మాత్రమే జారీ చేయగలిగేవారు. దీంతో వేలాది మంది వీసాల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. నూతన కార్యాలయం అందుబాటులోకి రావడంతో రోజుకు 3,500 వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు. దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే అమెరికా వీసా ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది…
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారిలో 70 శాతం మంది అమెరికాకు వెళుతున్నారు. ఏటా లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. 2022లో ప్రపంచ దేశాల నుంచి అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన వారిలో భారతీయుల సంఖ్య 65 శాతానికి పెరిగింది. అమెరికాలో చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 70.5 శాతానికి ఎకబాకింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అమెరికా వీసాల కోసం పెరుగుతున్న డిమాండును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఐదు కాన్సులేట్ కార్యాలయాలను ఆధునికీకరించారు. ఈ కార్యాలయాల నుంచి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమెరికా కాన్సులేట్ జనరల్ అధికారులు వెల్లడించారు.
అమెరికా వీసాల సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచడంతో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వీసా జారీ ప్రక్రియ కూడా నెల రోజుల్లోనే పూర్తి కానుండడం శుభపరిణామం. అమెరికా కాన్సులేట్ అధికారులు తీసుకున్న చర్యలను ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.