కర్ణాటక కింగ్ ఎవరు?

కర్ణాటక కింగ్ ఎవరు?

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో రాజకీయ మంటలు మండిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ..కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరీహోరీ పోరుతో రాజకీయం వేడెక్కుతోంది. మరోసారి కర్ణాటకను గెలిచి, మిగతా సౌత్ స్టేట్స్ ను తమ వశం చేసుకోవాలనే ఆలోచనతో ప్రధాని మోడీ ఉంటే..ఈసారి ఎలాగైనా కమలం పార్టీని నిలువరించాలనే ఎత్తుగడతో కాంగ్రెస్ ఉంది. రెండు పార్టీల మధ్య అధికార పీఠం ఎప్పుడూ దోబూచులాడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ తో కలిసి సంకీర్ణసర్కార్ ఏర్పాటు చేసినా..ఆ తర్వాత బిగ్ పార్టీగా నిలిచిన బీజేపీ తన రాజకీయ వ్యూహంతో పీఠాన్ని కదిలించి అందలమెక్కింది.అయితే, ఈసారి పూర్తి మెజార్టీ సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

కర్ణాటకలో గెలుపెవరిది? మరోసారి కాషాయ జెండా ఎగురుతుందా? లేక కాంగ్రెస్ జెండా పాతేస్తుందా? ఆ రెండు కాకుండా కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారా? బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. మళ్లీ అధికారం తమదేనని కమలనాథులు కుండబద్దలు కొడుతుంటే, కాంగ్రెస్ సైతం ఈసారి పీఠం తమదేనని బల్లగుద్ది చెబుతోంది. ఇక, సందిట్లో సడేమియా అన్నట్లు ఇద్దరి మధ్య విజయం దోబూచులాడితే, తానే కింగ్ మేకర్ అంటూ జేడీఎస్ కుమారస్వామి కాలర్ ఎగరేస్తున్నారు.

కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్దిరోజులే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార వేడిని పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది.కన్నడ ప్రజలను ఆకట్టుకునేందుకు ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తోంది. ప్రధాని మోడీ చరిష్మాని నమ్ముకొని కమలనాథులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని కూడా పలుమార్లు కర్ణాటకను సందర్శించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అదే సమయంలో తాజాగా నాటునాటు సాంగ్ తో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది బీజేపీ. కర్ణాటకలో తాము చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఓ పాట కట్టింది. ఆస్కార్ గెలుచుకున్న నాటునాటు పాటను మోడీమోడీగా రీమిక్స్ చేసి రిలీజ్ చేసింది.ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ కాంగ్రెస్ కూడా 2009 ఎన్నికల ముందు స్లమ్ డాగా మిలియనీర్ లోని ‘జై హో’ సాంగ్ ను రీమిక్స్ చేసి ‘జై హో కాంగ్రెస్’ అంటూ రీమిక్స్ చేసింది.

ఇక, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీలో కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. అసంతృప్తుల బెడద ఎక్కువ కావడంతో అగ్రనేతలు హైరానా పడుతున్నారు. సౌత్ లో బీజేపీ అధికారంలోకి ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అక్కడ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొని, తెలంగాణపై గురిపెట్టాలనే ఆలోచనతో కేంద్రపెద్దలున్నారు. అందుకోసం కర్ణాటకలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలోనే ఎన్నికల ప్రచారంలో ముందున్న బీజేపీ అభ్యర్థులను అంతే స్పీడ్ గా ప్రకటించేస్తోంది. అయితే, అది బీజేపీ కొంపముంచేలా కనిపిస్తోంది. జాబితాలో పేరులేని సిట్టింగ్‌లు, సీనియర్‌ నేతల నుంచి బీజేపీకి అసంతృప్తుల సెగ తగులుతోంది. టిక్కెట్‌ ఆశించి భంగపడిన వారంతా రాత్రికి రాత్రే పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు గుడ్‌బై చెప్పడంవంటివి చేస్తున్నారు.

కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకుగాను మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమమంలోనే దూకుడు పెంచినన బీజేపీ, 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. దాంట్లో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించింది.ఫస్ట్ లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో కొందరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి లక్ష్మణ సవది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళూరు సుళ్య టికెట్‌ చేజారడంతో మంత్రి ఎస్‌.అంగార రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి కేఎస్‌.ఈశ్వరప్ప కూడా రాజకీయ విరమణ ప్రకటించారు.మరోవైపు, మడిగెరె ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇదిలా ఉండగానే, 23మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా కూడా రిలీజ్ చేసింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో ఏడుగురికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపించింది. సెకండ్ లిస్ట్ లో మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ పెట్టర్‌ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. షెట్టర్‌కు చివరి జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఒవేళ తనకు టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటికే తేల్చి చెప్పారు.ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.అసమ్మతి చల్లార్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు, ఎన్నికలు జరగనున్న కర్ణాటక లో అమూల్ వర్సెస్ నందిని అంశం రాజకీయ దుమారం రేపుతోంది. కర్ణాటక గౌరవానికి, గుజరాత్ వ్యాపారానికి ముడిపెట్టి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, అధికార బీజేపీని ఇరకాటంలో పడేశాయి. పాడిరైతులతో నేరుగా సంబంధం ఉన్న ఈ అంశం, ఎన్నికల్లో ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతుందోనని కమలదళం ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ కన్నడ బ్రాండ్ నందినీ డైరీకి సపోర్ట్ చేస్తూ, అమూల్ టార్గెట్ గా చేస్తున్న రాజకీయం హస్తం పార్టీకి మైలేజ్ పెంచుతోందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి సెగలు, రాహుల్ జోడో యాత్ర తమకు ప్లస్ అవుతుందనే లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు తమవైపే ఉన్నారని కూడా విశ్వసిస్తోంది.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల తర్వాత ప్రభావం చూపే పార్టీ జేడీఎస్. ఈసారి కూడా జేడీఎస్ కింగ్ మేకర్ గా మారుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే, కర్ణాటకలో ఈసారి తెలుగువారిపై కుమారస్వామి స్పెషల్ ఫోకస్ పెట్టారు. కేసీఆర్ బీఆర్ఎస్ జేడీఎస్ తరపున ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది.ఎన్నికల ప్రచారం తుది అంకంలో కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జేడీఎస్ తరపున ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. ఈసారి కర్ణాటక ఎన్నికల్లో 59 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి ధీమాతో ఉన్నారు. అయితే, ఏ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎన్నికల ఫలితాల తర్వాత గానీ చెప్పలేమంటున్నారు. జేడీఎస్ ఇప్పటికే 97 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా, కాంగ్రెస్ 165 మంది పేర్లను ప్రకటించింది.

మొత్తంగా, మోడీ చరిష్మా ను నమ్ముకొని బీజేపీ…రాహుల్ యాత్రను నమ్ముకొని కాంగ్రెస్ ఉన్నాయి. ఇక, కుమారస్వామి తనకున్న కొద్దిపాటు బలగంతో పాటు కేసీఆర్ ను నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. ఈ ముగ్గురి మొనగాళ్లలో గెలిచే మొనగాడు ఎవరనేది మే 13నాటి ఫలితంతో తేలిపోనుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *