
పూరీ జగన్నాథ రథయాత్రకు పోటెత్తిన భక్తజనం
- News
- June 20, 2023
- No Comment
- 22
జగన్నాథుని నామస్మరణతో పూరీ వీధులన్నీ మారుమోగుతున్నాయి. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుని రథయాత్ర కన్నులపండువగా జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి పోటెత్తారు. శ్రీక్షేత్రంతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది దాదాపు 10లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసారు. రైళ్లు, బస్సులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈక్రమంలో రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
పూరీలో జరిగే రథయాత్రకు ఏటా కొత్తగా రథాలు తయారు చేస్తారు. అంతేకాదు, సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా ఉత్సవ విగ్రహాలనే ఊరేగింపుగా తీసుకెళతారు. కానీ, పూరీలో దీనికి భిన్నం. ఏకంగా మూల విరాట్టులే ఆలయం నుంచి బయటకు వచ్చి భక్త జనులకు నేత్రపర్వం చేస్తాయి. జనఘోషలో జగన్నాథుని జన యాత్ర సాగుతుంది. ఎంత దూరం నుంచైనా స్వామిని భక్తులు చూడగలగడం ప్రత్యేకత. ఘోష యాత్రలో స్వామి దివ్య తేజస్సుతో దర్శనిమిస్తారు.
పురుషోత్తముని నిలయమైన పూరీని భక్తులు వైకుంఠపురంగా అభివర్ణిస్తారు. స్వామి కొలువుండే శ్రీక్షేత్రం శైవ, వైష్ణవ, శాక్తేయుల నిలయం. ఎంతోమంది రుషులు, మనులు, మహాత్ములు, సిద్ధయోగులకు జ్ఞానోదయం చేసిన మహోన్నత ధామం ఇది. సృష్టి, స్థితి, లయ కారకుడైన జగన్నాథుడు సర్వాంతర్యామి. ఆలయంలో ఆయనకు చేసే సేవల్లో అర్థం, పరమార్థం ఇమిడి ఉంటాయి. తన లీలలతో ఆయన మానవాళికి దివ్య సందేశం ఇస్తాడని తత్వ సంపన్నులంటారు.