
సత్తా చాటిన పొంగులేటి.. జనగర్జన రీసౌండ్ అదిరిందా..?
- NewsPoliticsTelangana Politics
- July 3, 2023
- No Comment
- 18
తెలంగాణ కాంగ్రెస్ రేసు ఇచ్చింది. ఖమ్మంలో తన సత్తా ఏంటో చాటి చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గులాబీ పార్టీలో గుబులు పుట్టించారు. కాంగ్రెస్ జన గర్జన సభ దెబ్బకు… బీఆర్ఎస్, బీజేపీ నేతల్లో సౌండ్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ సృష్టించిన అడ్డంకులను దాటుకొని హస్తం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఖమ్మం సభకు దూసుకెళ్లారు. లక్షలాదిగా తరలివెళ్లి సభను సక్సెస్ చేశారు. మమ్ముల్ని ఎవడ్రా అడ్డుకునేదంటూ కాంగ్రెస్ నేతలు గర్జించారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ నినదించారు .
రోడ్లు బ్లాక్ చేశారు. చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరించారు. అయినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభను అడ్డుకోలేకపోయారు. ప్రజలను ఆపలేకపోయారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నే రీతిలో జన గర్జన సభ పెట్టి తీరుతానని చెప్పిన శ్రీనివాసరెడ్డి…చెప్పినట్టే చేశారు. గత జనవరి 18న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభను ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ కు రెట్టింపు స్థాయిలో పట్టుదలగా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేశారు పొంగులేటి.
బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంకులు సృష్టించినా, అంచనాలకు మించి ఊహించని రీతిలో సభ సక్సెస్ కావడంతో …కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. మొత్తంగా 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరు కావడంతో పార్టీ పరంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఖమ్మం సభ రేపటి ఎన్నికలకు విజయం సాధించేందుకు నాంది పలకనుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
పొంగులేటి అరేంజ్ చేసిన జనగర్జన సభను చూసి రాహుల్ గాంధీ ఉప్పొంగి పోయారు. అశేష జనవాహిని ఉద్దేశించి ఆసక్తికర ప్రసంగం చేశారు. కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. బీజేపీకి బీటీమ్ గా ఉన్న బీఆర్ఎస్ ఖేల్ ఖతమంటూ ప్రసంగంతో ఉర్రూతలూగించారు. ఖమ్మంలో పదికి పది గెలుస్తామంటూ కాంగ్రెస్ నేతలు గర్జించారు. పొంగులేటితో పెట్టుకుంటే అట్లుంటది మరి అంటూ హస్తం పార్టీ శ్రేణులు, ప్రత్యర్థులపై సెటైర్లు పేల్చుతున్నారు.
కాంగ్రెస్ జనగర్జన సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు వంద ఎకరాల స్థలంలో ఈ సభకు దాదాపు 5లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. దీనికోసం దాదాపు 200 మంది కూలీలు, మరో 200 మంది సాంకేతిక నిపుణులు మూడు రోజులపాటు శ్రమించారు. వేదికపై 200 మంది కూర్చునేలా.. పైకి 250 మంది ఎక్కినా తట్టుకునేలా ఏర్పాటు చేశారు. గాలిదుమారం, వర్షం వచ్చినా వేదిక కూలిపోకుండా, ఎల్‌ఈడీలు కిందికి ఒరిగి పోకుండా రూ.కోటిన్నర ఖర్చుతో నాలుగు క్రేన్లను అనుసంధానం చేశారు. వీఐపీలు విశ్రాంతి తీసుకునేందుకు వేదికకు అనుసంధానంగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. సభా వేదికకు రెండు వైపులా 70 అడుగుల ఎత్తున సోనియా, రాహుల్, పొంగులేటి కటౌట్లను ఉంచారు.
మొత్తంగా, జనగర్జన సభను సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన హస్తం పార్టీ..పొంగులేటి రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ కు తిరుగులేదనే ధీమాతో కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు టార్గెట్ గా..సరికొత్త అస్త్రాలను సంధించేందుకు సన్నద్ధమవుతోంది.