గుడివాడలో..కొడాలికి ఎదురుగాలి

గుడివాడలో..కొడాలికి ఎదురుగాలి

కొడాలి నానికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందా? గుడివాడలో కొడాలికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా ?అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈసారి కొడాలి గెలిచే పరిస్థితి లేదని జగన్ సీక్రెట్ సర్వేలు తేల్చేశాయట. అందుకే కొడాలి సైలెంట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే జగన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గడప గడపకు కార్యక్రమంలోనూ, నీవే మా నమ్మకం జగన్ ప్రోగ్రామ్ లోనూ కొడాలి నాని కనిపించకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు గుడివాడ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించిన ఐ ప్యాక్ టీం, కొడాలి నానికి టికెట్ ఇవ్వకపోవడమే బెటర్ అని హైకమాండ్ కు నివేదించిందట. ఈ పరిణామాలతో కొడాలి ఆందోళన చెందుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

కొడాలి నాని..పరిచయం అక్కర్లేని వ్యక్తి. బూతుల మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయ్యారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత మంత్రి పదవి ఊడిపోవడంతో కొంత వరకు తన బూతుపురాణం తగ్గించుకున్నారు. మళ్లీ జగన్ కొడాలిని క్యాబినెట్ లోకి తీసుకుంటారన్న వార్తలతో ఈ మధ్య కాస్త రంకెలేశారు. అయితే, ఎగిరెగిరి పడుతున్న కొడాలి.. అసలు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది.

కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ను తిట్టడానికే కొడాలి నానికి జగన్ గతంలో మంత్రి పదవి ఇచ్చారనేది జగమెరిగిన సత్యం. గడచిన రెండు దశాబ్దాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసిన కొడాలి నాని గుడివాడలో అభివృద్ధిని అటకెక్కించారు. ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేయలేదు. గుడివాడలో కనీసం రోడ్లపై గుంటలు పూడ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎంత సేపటికి ప్రతిపక్ష నాయకుడిపై బూతులతో విరుచుకుపడటం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడింది లేదు. దీంతో జనంలో కొడాలి తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇదే విషయాన్ని తాజాగా సర్వే నిర్వహించిన ఐ ప్యాక్ టీం నిర్థారించింది. దీంతో కొడాలి నాని డిఫెన్స్ లో పడిపోయారనే ప్రచారం జరుగుతోంది.

2004లో మొదటి సారి గుడివాడ నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని, తరవాత వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయడం ప్రారంభించారు. వైసీపీ అధినేత కూడా కమ్మ సామాజికవర్గాన్ని బండ బూతులు తిట్టేందుకు ఓ కమ్మ నాయకుడు దొరికాడని సంబరపడిపోయారు. అయితే సుదీర్ఘ కాలంలో కొడాలి నాని భూతులతో చివరకు వైసీపీకే తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రతిపక్షాలు ఎండగడుతూ ఉంటాయి. వారికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ నేతలకు ఉంటుంది. అయితే ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నించిన ప్రతిసారి…. కొడాలి నాని బూతులతో విరుచుకుపడి విషయాన్ని డైవర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే హోదాలో హుందాగా వ్యవహరించాల్సింది పోయి మాటల్లో వర్ణించలేని భాషను ఉపయోగిస్తున్న కొడాలిని చూసి నియోజకవర్గ ప్రజలు ఈసడించుకుంటున్నారు. అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం మాటలతో కాలయాపన చేస్తున్న కొడాలిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని…సాక్షాత్తూ సీఎం జగన్ రెడ్డి పరోక్షంగా నిర్వహిస్తున్న ఐ ప్యాక్ టీం సర్వేలోనే ఈ విషయం వెల్లడికావడం గమనార్హం.

కొడాలి నాని మంత్రి పదవి వెలగబెట్టినా, కనీసం కంకిపాడు- గుడివాడ రోడ్డు కూడా వేయించలేకపోయారని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ దారిలో రోజూ కనీసం 20 వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. రద్దీగా ఉండే ఈ రోడ్డుకు కనీసం మరమ్మతులు చేయించకపోవడం కూడా కొడాలి నానిపై వ్యతిరేకతకు దారితీసింది. ఇక గుడివాడ సిటీలో రోడ్లు కూడా అధ్వాన్నంగా తయారయ్యాయి. చినుకు పడితే చిత్తడిగా మారుతోందని జనం వాపోతున్నారు. వీటికి తోడు గుడివాడ సిటీకి సమీపంలో టీడీపీ హయాంలో నిర్మించి, పంపిణీకి సిద్దంగా ఉంచిన పదివేల టిడ్కోఇళ్లను అలాగే వదిలేశారు. దీంతో పేదల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇవన్నీ కొడాలి నానిపై జనంలో వ్యతిరేకత రావడానికి దారితీశాయని తాజా సర్వేల ద్వారా తెలుస్తోంది.

ప్రతిపక్ష నాయకులను తిట్టుకుంటూ, అభివృద్ధి చేయకుండా మాటలు చెప్పుకుంటూ వెళితే జనం నమ్మరని కొడాలికి అర్థమైనట్టుంది. అందుకే ఏవో కొన్ని పనులైనా పూర్తి చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. అయినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. గుడివాడలో రైలు గేటులతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వే ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేసినా… పనులు మాత్రం నేటికీ మొదలు పెట్టలేదు. దీనికి తోడు మట్టి, ఇసుకను యథేశ్చగా దోచేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొడాలిపై వచ్చే ఎన్నికలనాటికి మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాలన్నీ కొడాలి నాని రాజకీయ పతనానికి దారితీయనున్నాయనే టాక్ వినిపిస్తోంది.

మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ఓ ప్రధాన సామాజికవర్గంతోపాటు, గుడివాడ ప్రజలు కూడా కొడాలి నానిని వదిలించుకోవాలని చూస్తున్నట్టు సర్వే రిపోర్టుల విశ్లేషణ ద్వారా తెలుస్తోంది.ఇప్పటి వరకు తనకు నియోజకవర్గంలో ఎదురేలేదని, ఎవరొచ్చినా ఓడిస్తానంటూ విర్రవీగిన కొడాలి నాని.. వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని తేలడంతో డిఫెన్స్ లో పడిపోయారట.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *