
మంత్రి విడదల రజనికి టికెట్ ఇస్తే ఓడిస్తాం
- Ap political StoryNewsPolitics
- April 14, 2023
- No Comment
- 35
మంత్రి విడదల రజనికి అసమ్మతి బెడద మొదలైంది. నాలుగేళ్ల నుంచి చిలకలూరి పేట వైసీపీలో విభేదాలు ఉన్నా, అవి ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి. ఎమ్మెల్యేగా గెలిచే వరకు సైలెంటుగా పనిచేసుకుపోయిన విడదల రజని, గెలిచాక వైసీపీ నేతలకే చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తో ఆమెకు పొసగడం లేదు. తాజాగా మండల స్థాయి నేతలు కూడా ఆమెపై తిరుగుబావుటా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో విడదల రజనికి టికెట్ ఇస్తే ఇండిపెండెంటుగా అభ్యర్థిని నిలుపుతామంటూ హెచ్చరించారు. అసలు చిలకలూరిపేట వైసీపీలో ఏం జరుగుతోంది.
విడదల రజని. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకురాలు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలను పొగడ్తలతో ముంచి అనుకున్నది సాధించుకునే నేర్పరితనం ఆమె సొంతం. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన విడదల రజని, రాక్షసులు ఎలా ఉంటాడు అంటే పిల్లలకు జగన్ ఫోటోలు చూపాలంటూ ఎన్నికలకు ముందు మహానాడులో ఆమె చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయింది. సీన్ కట్ చేస్తే, ఆమె వైసీపీలో చేరిపోయారు. చిలకలూరిపేట టికెట్ సంపాదించుకున్నారు. పేటలో ఆమెను గెలిపించడానికి వైసీపీ నేతలు అందరూ కష్టపడ్డారు. అయితే గెలిచిన తరవాత విడదల రజని అసలు రూపం బయట పడింది. ఎమ్మెల్యేగా గెలవడానికి సహకరించిన వైసీపీ నేతలకే ఆమె మూడు చెరువుల నీళ్లు తాగించడం మొదలు పెట్టారు. విడదల రజని ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆమె తీరు మారిపోయింది. ఇక మంత్రి పదవి కూడా రావడం, వైసీపీ పెద్దల అండదండలు లభించడంతో విడదల రజని బిహేవియర్ మొత్తం మారిపోయిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
నియోజకవర్గంలో తాను చెప్పిందే అందరూ వినాలని శాసించడం మొదలు పెట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో అక్కడ వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా విడిపోయాయి. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో 2019లో విడదల రజనికి మర్రి రాజశేఖర్ టికెట్ త్యాగం చేశారనే చెప్పవచ్చు. తాజాగా మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి వరించింది. అయినా నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమానికి ఎంపీ,ఎమ్మెల్సీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదనే విమర్శలను మంత్రి విడదల రజనీ మూటకట్టుకున్నారు. ఇటీవల జరిగిన సీఎం జగన్ రెడ్డి చిలకలూరిపేట పర్యటనలోనూ మంత్రి రజని, ఎంపీల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి.
చిలకలూరిపేట వైసీపీ అసమ్మతి నేతలు రోడ్డునపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మంత్రి విడదల రజనీ మరలా పోటీ చేస్తారని పల్నాడు జిల్లా వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బీద మస్తాన్ రావు ప్రకటించడంతో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి విడదల రజనికి టికెట్ ఇస్తే ఓడిస్తామని వైసీపీ కీలకనేతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు. పల్నాడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ బీద మస్తాన్ రావును అసమ్మతి నేతలు గుంటూరులో కలిసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. చిలకలూరిపేట టౌన్, నాదెండ్ల, యడ్లపాడు మండలాలకు చెందిన వైసీపీ అసమ్మతి నేతలు ఎంపీని కలసి మంత్రి విడదల రజనికి టికెట్ ఇస్తే ఓడిస్తామని మొహమాటం లేకుండా ఎంపీకి చెప్పేశారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ సమావేశాలకు ముఖ్య నేతలకు కూడా సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో మరలా ఆమెకే టికెట్ అని ప్రకటించారని, ఆమెకు టికెట్ ఇస్తే రెబల్ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని కూడా వారు హెచ్చరించారు. వైసీపీ అసమ్మతి నాయకులకు నాదెండ్ల మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. మంత్రి రజనిపై మూడు మండలాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అధిష్ఠానం మంత్రి రజనికి టికెట్ ఇస్తే ఒక సీటు పోయినట్టేనని అసమ్మతి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని మంత్రి విడదల రజని డిక్టేటర్ మాదిరి ఎందుకు రెచ్చిపోతోందనుకుంటున్నారా? ఆమెకు ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆశీస్సులు దక్కడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. సజ్జల అండతోనే విడదల రజని ఎవరినీ లెక్కచేయడం లేదని, చిలకలూరిపేటలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను అసలే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎవరెంత గింజుకున్నా మరలా తనకే టికెట్ వస్తుందనే ధీమాలో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ అయితే తెచ్చుకోవచ్చు, కానీ గెలవాలంటే మాత్రం స్థానిక నాయకుల సహకారం తప్పనిసరి. ఎన్నికల్లో డబ్బు పడేస్తే అందరూ దారికి వస్తారనే, ధీమాతోనే ఇలా ప్రవర్తిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే చిలకలూరిపేట వైసీపీలో నాయకులు, కార్యకర్తలు మూడు వర్గాలుగా విడిపోయారు. మంత్రి విడదల రజనికి టికెట్ ఇస్తే ఆమె వ్యతిరేకవర్గాలన్నీ ఏకమై ఆమెను ఓడించేందుకు పావులు కదుపుతాయనే విషయం అధిష్ఠానాన్ని కలవరపెడుతోంది.
రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. పార్టీలో ప్రతి కార్యకర్తా పనిచేస్తేనే గెలుపు సాధ్యం అవుతుంది. పదవి మోజులో కళ్లు నెత్తికెక్కితే ఎన్నికల్లో జనం తగిన బుద్ది చెబుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చిలకలూరిపేట వైసీపీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు గమనిస్తే అక్కడ ఆ పార్టీ నిండి మునిగిపోయిందని అర్థమౌతోంది. ఇక వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు.