
రైతులకు చల్లని కబురు
- Ap political StoryNewsPolitics
- June 8, 2023
- No Comment
- 23
ఎండాకాలం వెళ్లిపోతోంది. రెయిన్ సీజన్ వచ్చేసింది. అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గురువారం ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రుతుపవనాల ఆగమన ప్రభావంతో కేరళలో గత 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. గంటకు 19 నాట్‌ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. అయితే తొలి వారంలో మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది.
సాధారణంగా జూన్ 1వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. వాతావరణ మార్పులు, తుపాను కదలికల కారణంగా వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.