
అక్షయ తృతీయనాడు బంగారం ఎందుకు కొనాలి ?
- News
- April 21, 2023
- No Comment
- 30
అక్షయ తృతీయ ప్రత్యేకత ఏమిటి ? ఆరోజు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలా? అక్షయ తృతీయ వస్తుందనగానే జ్యూవెలరీస్ అన్నీ కిటకిటలాడిపోతుంటాయి.అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే, కలసి వస్తుందని…ఏడాదంతా సంపద ఉంటుందని భారతీయల విశ్వాసం. అయితే, అసలు అక్షయ తృతీయనాడు బంగారం కొనుగోలు చేయాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అక్షయ అంటే క్షయం లేదని, తరగిపోనిది అని అర్థం. వైశాఖ మాసం శుక్లపక్షంలో 3వ రోజు వస్తుంది కాబట్టి అక్షయ తృతీయ అయింది. ఈ రోజంతా శభకరమైన ముహూర్త కాలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే అక్షయ తృతీయనాడు ఏ పని మొదలుపెట్టినా విజ్ఙాలు లేకుండా ముందుకు సాగుతాయని నమ్మకం. అంతేకాని అక్షయ తృతీయనాడు బంగారం కొనుగోలు చేస్తే ఇక సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటారు అనేది మూడ నమ్మకం.
హిందువులకు పవిత్రమైన దినం అక్షయ తృతీయ. అక్షయ తృతీయ గురించి అనేక శాస్త్రాల్లో ప్రస్తావన ఉంది. మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముని పుట్టినరోజు ఈ రోజే కావడం విశేషం. అందుకే అక్షయ తృతీయనాడు నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణుమూర్తి విగ్రహంపై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. త్రేతాయుగం అక్షయ తృతీయ నాడు మొదలైందని, ఆనాడే పవిత్ర గంగానది దివి నుంచి భూమికి దిగి వచ్చిందనీ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అక్షయ తృతీయ రోజునే వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారత రచన చేశాడని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది. యముడి కుమారుడైన ధర్మరాజు అక్షయ తృతీయనాడు అక్షయపాత్రను పొందాడని పురాణాల్లో ఉంది. అక్షయ తృతీయ అనేది పర్యదినంతో సమానం. ఆరోజు చేపట్టే ఏ పని అయినా ఆటంకాలు లేకుండా సాగుతుంది. అక్షయ తృతీయ నాడు శక్తికొలది బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించి ఏడాది మొత్తం బంగారం కొంటూనే ఉంటారనే ప్రచారంలో వాస్తవం లేదు.
అక్షయ తృతీయనాడే కుచేలుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం ద్వారా కడు పేదరికం నుంచి బయటపడ్డారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే అక్షయ తృతీయనాడు ఇష్టమైన భగవంతునికి అర్పించినదేదైనా అమిత ఫలాలనిస్తుందనీ, కొనుగోలు చేసినది ఏదైనా అక్షయమై నిలుస్తుందనీ భక్తులు నమ్ముతారు. ఏదైనా కొనుగోలు చేస్తే అది నిలుస్తుందనే విషయం పురాణల్లో ఉంది. కాని బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని ఎక్కడా చెప్పలేదు. అక్షయ తృతీయను నవన్న పర్వం అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం నాడు వస్తుంది. ఈ తిథి ఇంటికి శుభాలను, విజయాలను చేకూర్చుతుందని ప్రగాఢ నమ్మకం. అక్షయ తృతీయనాడు దానధర్మాలు చేస్తే భగవంతుని ఆశీస్సులతో సకల శుభాలు కలుగుతాయని ప్రచారంలో ఉంది.
అక్షయ తృతీయనాడు అప్పుచేసి అయినా బంగారం కొనుగోలు చేయాలనేది ప్రచారం మాత్రమే. పసిడి కొనుగోలుకు ప్రత్యేకమైన రోజంటూ ఏదీ లేదనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.