
ముందస్తు ఎన్నికలతో మూడుతుందని జగన్ భయపడుతున్నారా..?
- Ap political StoryNewsPolitics
- April 3, 2023
- No Comment
- 29
ఏపీలో ముందస్తు ఎన్నికలు.. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు పదవీ గండం తప్పదనే ప్రచారం నేపథ్యంలో.. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్యేల వర్క్ షాప్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశంలో సంచలన ప్రకటనలు ఉంటాయని అంతా భావించారు. ముఖ్యంగా అసెంబ్లీని రద్దు చేసి సీఎం జగన్ ముందస్తుకు వెళతారనే ప్రచారం జోరుగా సాగింది. అలాగే పలువురు మంత్రులపై వేటు వేస్తారని.. కొంత మంది ఎమ్మెల్యేలకూడా సీఎం క్లాస్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ.. వీటన్నింటికీ భిన్నంగా సీఎం జగన్ ఎమ్మెల్యేలతో వర్క్ షాప్‌ను ముగించేశారు. అసెంబ్లీకి మరో ఏడాది వరకు గడువు ఉన్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని సీఎం ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో సీఎం జగన్ ముందస్తు మంతనాలు సాగించి వచ్చారు. తెలంగాణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సైతం ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు చెబుతున్నారు. ఈ మేరకే ఎమ్మెల్యేలకూ దిశా నిర్దేశం చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. సీఎం జగన్ తన మనసు మార్చుకున్నారు. ఏపీలో ముందుస్తు ఎన్నికలకు వెళితే మొదటికే మోసం వస్తుందనే భయంతో ఆయన.. వెనుకడుగుకు వేసినట్టు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఘోర వైఫల్యాలు జగన్ ను వెనక్కు లాగినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల మీటింగ్‌లో ముందస్తు పై సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేయలేక పోయారని అంటున్నారు.
ఇక.. గతంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాపుల్లో.. సీఎం జగన్ చాలా మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. అయితే ఈ సారి సుతి మెత్తగా సూచనలు, సలహాలకే ఆయన పరిమితం అయ్యారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా తాను వదులుకోవటానికి సిద్ధంగా లేనని సీఎం చెప్పటం వెనుక.. ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలే కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పని చేయని ఎమ్మెల్యేలకు ఛాన్స్ లేదని ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన సీఎం జగన్…ఈ సారి అలాంటి మాటలు మాట్లాడలేదు. పైగా 60 మందికి టికెట్లు దక్కవంటూ కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ.. డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియా ప్రచారాలని తిప్పికొట్టలేక పోతున్నారని.. ఇలాగైతే ఎలా..? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను మీడియా ఎత్తి చూపుతోందనే వ్యాఖ్యలు వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని సైతం తక్కువ చేసేలా జగన్ ప్రసంగం కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో లబ్దిదారులెవరూ లేరని జగన్ చెప్పుకొచ్చారు. లబ్దిదారులు కాని వారి ఓటింగ్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నధోరణిలోనే జగన్ ప్రసంగం కొనసాగింది. వచ్చే ఎన్నికల్లో లబ్దిదారులంతా మనకే ఓటేస్తారంటూ ఆయన ఎమ్మెల్యేల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. అయితే.. 9 ఉమ్మడి జిల్లాలు 108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను తక్కువ చేసి చూపటం.. వైసీపీకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తం మీద ఎమ్మెల్యేల వర్క్ షాప్ సాక్షిగా ముందస్తు ఎన్నికలపై సీఎం వెనుకడుగు వేయటం చర్చనీయాంశంగా మారింది.