
పవన్ పోటీ చేసే నియోజకవర్గం అదేనా..?
- Ap political StoryNewsPolitics
- April 3, 2023
- No Comment
- 33
టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే..ఠక్కున కుప్పం గుర్తుకు వస్తుంది. సీఎం జగన్ పేరు చెప్పినా.. పులి వెందుల గుర్తుకు వస్తుంది. యువనేత లోకేష్ కూడా మంగళగిరి కేంద్రంగానే తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. కానీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు చేబితే.. ఆయన నియోజకవర్గం ఇదీ అని చెప్పే పరిస్థితి లేదు. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇది నా సొంత నియోజకవర్గం అనే విధంగా.. ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోలేదు. 2019లో అటు గాజువాక.. ఇటు భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఆ రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తరువాత అయినా ఆ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని రాజకీయ కార్యకలాపాలు చేశారా..? అంటే అదీ లేదు. గాజువాక, భీమవరంలో పోటీ చేసినప్పటికీ.. ఆ తరువాత ఆ రెండు నియోజకవర్గాల్లో నిర్ధిష్టంగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. దీంతో.. ఆయనకు సొంత నియోజకవర్గం అన్నదే లేకుండా పోయింది.
2029 ఎన్నికలు జరిగి నాలుగేళ్లు కావస్తోంది. 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమౌతున్నాయి. కానీ.. నేటికీ పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం ఇదీ అని చెప్పే పరిస్థితి లేదు. దీంతో.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం.. సస్పెన్స్‌గా మారింది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయాలనకుంటే అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ..? చెబుతుండటం పార్టీలో నెలకొన్న గందరగోళానికి అద్ధం పడుతోంది. అయితే.. తాజా సర్వే నివేదికలు, గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, రాజకీయ సమీకరణాలను బట్టి.. పవన్ భీమవరం, పిఠాపురం, గాజువాక లేదా తిరుపతి స్థానాల్లో ఎక్కడో ఓ చోట నుంచి పోటీ చేయవచ్చని అంటున్నారు.
ఇక.. పవన్ పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్న నియోకవర్గాల్లో టాప్ ప్లేస్‌లో భీమవరం నిలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఆ ప్రాంతంతో కొద్దొ గొప్పో అనుబంధం ఉంది. భీమవరంలో పవన్ సొంత సామాజిక వర్గం ఓట్లు దాదాపు 80 వేలకు పైగా ఉన్నాయి. అక్కడ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు 32.43 శాతం ఓటింగ్‌తో 62 వేల 285 ఓట్లు వచ్చాయి. కేవలం 4 శాతం ఓట్ల తేడాతోనే ఆయన పరాజయం పాలయ్యారు. మరోవైపు భీమవరంలో టీడీపీ అభ్యర్ధికి 54 వేల కు పైగా ఓట్లు పోలయ్యాయి. ఆ రెండు పార్టీల ఓట్లు కలిపితే సుమారు 1 లక్షా 16 వేల వరకు ఉన్నాయి. అక్కడ వైసీపీ బలం కేవలం 70 వేలుకు కాస్త అటూ ఇటుగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ గ్రాఫ్ బాగా తగ్గగా.. జనసేన ఓటింగ్ 36.5 శాతానికి పెరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ భీమవరం బరిలోకి దిగితే ఘన విజయం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. టీడీపీతో పొత్తు కుదిరితే సుమారు 30 నుంచి 40 వేల మెజార్టీ కూడా రావచ్చని అంటున్నారు. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప.. భీమవరం నుంచి పవన్ పోటీ చేయటం పక్కా అని.. జనసేన పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భీమవరం తరువాత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం నిలుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న పిఠాపురంలో కూడా కాపు ఓటింగ్ భారీ స్థాయిలో ఉంది. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో జనసేనకు 27 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత స్తానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించింది. పైగా అక్కడ తాజా సర్వేల్లో జనసేన ఓటింగ్ 35 శాతానికి పెరిగినట్టు తెలుస్తోంది. పిఠాపురంలో టీడీపీకి గత ఎన్నికల్లో 67 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనానికి ఈ సీటు కేటాయించాల్సి వస్తే టీడీపీ అభ్యర్ధి వర్మ రంగంలోంచి తప్పుకునే అవకాశం ఉంది. దీంతో జనసేనాని గెలుపు నల్లేరు మీద నడక కాగలదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇక.. పిఠాపురం తరువాత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గం గాజువాక అని అంటున్నారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 29.37 శాతంతో 58 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని రెండవ స్థానంలో నిలిచారు. అక్కడ టీడీపీ అభ్యర్ధికి 56 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలటంతో సుమారు 74 వేల ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అభ్యర్ధి విజయం సాధించగలిగారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. ఖచ్చితంగా ఘన విజయం సాధించటానికి ఛాన్స్ ఉంది. అంతే కాదు.. ఆ ప్రభావం కాకినాడ అర్బన్, రూరల్, తుని, పెద్దాపురం తదితర నియోజకవర్గాలపై ఉంటుంది. దీంతో పిఠాపురం వైపు కూడా జనసేనాని మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
చివరగా.. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో తిరుపతి పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. గతంలో ఆయన సోదరుడు చిరంజీవి ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. తిరుపతిలో కాపు, బలిజ సామాజిక వర్గ ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో.. పవన్ అక్కడి నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో తిరుపతిలో జనసేనకు కేవలం 6.83 శాతం ఓట్లే రాగా.. ఈ సారి జనసేన గ్రాఫ్ 17 శాతానికి పెరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే.. తిరుపతిలో టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి పవన్ పోటీ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ పవన్ బరిలోకి దిగినా.. తిరుపతిలో టీడీపీ పూర్తి సహాయ, సహకారాల పై పవన్ ఆధారాపడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
మొత్తం మీద.. ఇప్పటి వరకు సొంత నియోజకవర్గం అంటూ ఏర్పాటు చేసుకోని పవన్.. 4 నియోజక వర్గాలపై కన్నేశారు. వీటిలో ఎక్కువగా భీమవరం లేదా పిఠాపురం నుంచే ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వే రిపోర్టుల్లో సైతం ఈ రెండు స్థానాల్లో మెరుగైన ఓట్ల శాతం వస్తున్నట్టు తేలింది. దీంతో ఈ రెండు స్థానాల్లో ఒక చోట నుంచి పవన్ పోటీ పక్కా అని తెలుస్తోంది.