వైసీపీకి విజయసాయి రెడ్డి గుడ్ బై..?

వైసీపీకి విజయసాయి రెడ్డి గుడ్ బై..?

కొంత కాలంగా వైసీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఎంపీ విజయ సాయిరెడ్డి, త్వరలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా..? కేంద్రంలో అధికార బీజేపీలో చేరటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా..? వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉంటూనే.. ఆయన కమలంతో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా..? జగన్ తో పడలేక తనదారి తాను చూసుకోవాలని భావిస్తున్నారా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేపో.. మాపో విజయసాయిరెడ్డి జగన్ కు ఝలక్ ఇచ్చి…కాషాయ గూటికి చేరవచ్చనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని.. ఎంపీ విజయసాయిరెడ్డిని జంట కవులుగా చెప్పుకోవచ్చు. జగన్ రెడ్డి బిజెనస్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ గా ఎదిగితే.. విజయసాయిరెడ్డి ఆడిటర్ నుంచి రాజకీయ నాయకునిగా టర్న్ అయ్యారు. క్విడ్ ప్రో కేసుల్లో ఒకరు ఏ1 కాగా.. మరొకరు ఏ2గా వీడని అనుబంధాన్ని కొనసాగించారు. వైసీపీ ఏర్పాటు దగ్గర నుంచి ఆ పార్టీ అధికారంలోకి రావటం వరకు విజయసాయిరెడ్డి…. జగన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నారు. అందుకే జగన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. అయితే.. జగన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక.. క్రమంగా విజయసాయిరెడ్డి హవా తగ్గి.. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. మరోవైపు.. . సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే విజయసాయి రెడ్డి.. గత ఏడాది డిసెంబర్ నుంచి సైలెంట్ అయిపోయారు. ప్రతిపక్షాలను తిడుతూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టటం ఆపేశారు. అనవసరమైన విషయాల్లో ప్రెస్ మీట్లు పెట్టటాన్ని కూడా బంద్ చేశారు. ఓవరాల్‌గా విజయసాయిరెడ్డికి ఏమైంది..? అనుకునేలా.. ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. దీంతో.. విజయసాయిరెడ్డి కి జగన్ రెడ్డికి మధ్య ఎక్కడ చెడింది..? అనే విషయంపై ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. వారిద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయనే దానిపై అంతా ఏకాభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌ పదవి సైతం విజయసాయిరెడ్డికి దూరం అయ్యింది. కేవలం ఢిల్లీలో లాబీయింగ్‌కే జగన్ రెడ్డి.. ఆయనను పరిమితం చేశారు. క్రమంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరం పెట్టారు. ఇటీవల వివేకా కేసులో అరెస్టులు సందర్భంగా.. జగన్ నిర్వహించిన అంతర్గత సమావేశానికి సైతం విజయ సాయిరెడ్డిని పిలవలేదు. దీంతో.. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి ఎగ్జిట్ కన్ఫామ్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఆయనను పార్టీ నుంచి సాగనంపటానికే జగన్ రెడ్డి నిర్ణయించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి కౌంటర్‌‌గా అన్నట్టు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్..జగన్‌ తో జరుగుతున్న కోల్డ్ వార్‌కు అద్దం పడుతోందని అంటున్నారు.

ఇక.. వైఎస్ జగన్‌కు దూరం అవుతున్న విజయసాయిరెడ్డి.. కేంద్రంలో బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు పిలిచినా.. పిలవకపోయినా.. అధికారిక కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. బీజేపీ నేతలతో చాలా కాలంగా టచ్‌లో ఉన్న నేపథ్యంలో.. ఆయన అటువైపు నుంచి నరుక్కు వస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ జగన్ తో తేడా వచ్చి దూరమైనా… బీజేపీ ఆశీస్సులు ఉంటే తాను సేఫ్ జోన్‌లో ఉన్నట్టేనని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో.. వైసీపీ నుంచి ఎగ్జిట్ అయితే.. బీజేపీలోకి ఎంట్రీపై ఢిల్లీ పెద్దలతో ఆయన ఇప్పటికే మంతనాలు సాగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ నిర్ణయాన్ని బట్టి.. తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఉండేలా విజయ సాయిరెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

అటు ఢిల్లీ బీజేపీ పెద్దలతోనే కాకుండా.. ఇటు తెలంగాణలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో కూడా విజయసాయి రెడ్డి సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. జగన్ కు వాళ్ళిద్దరూ దూరమైనా.. విజయ సాయిరెడ్డి మాత్రం వైఎస్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వివేకా కేసు వ్యవహారంలో జగన్, భారతీ రెడ్డి, సజ్జల వంటి వారు ఓవైపు ఉండగా.. వైఎస్ ఫ్యామిలీ మొత్తం మరోవైపు ఉంది. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీ నిట్టనిలువునా చీలిపోయింది. అయితే.. ఈ పరిణామాల కన్నా ముందే జగన్‌కు విజయ సాయిరెడ్డికి గ్యాప్ రాగా.. ప్రస్తుతం అది మరింత పెరిగింది. దీంతో ఆయన కూడా వైఎస్ విజయమ్మ, షర్మిల కోటరీలోకే వెళ్ళిపోయినట్టు చెబుతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో టచ్‌లోనూ ఉంటూనే.. ఇటు లోకల్‌‌గా వైఎస్ ఫ్యామిలీతో అసోసియేషన్ కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ జగన్ టార్గెట్ చేసినా లోకల్ గా వైఎస్ ఫ్యామిలీ.. ఢిల్లీలో బీజేపీ పెద్దలు తనకు అండగా ఉంటారనే ద్విముఖ వ్యూహంతో విజయసాయి ముందుకు వెళుతున్నారని అంటున్నారు.

మొత్తం మీద.. వైఎస్సార్ సీపీలో నిన్న, మొన్నటి వరకు నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి త్వరలోనే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళి పోవటం, బీజేపీ గూటికి చేరటం ఖయామనే వార్తలు వస్తున్నాయి. అయితే విజయ సాయిరెడ్డి ఎలాంటి స్టెప్ వేస్తారో వేచి చూడాలి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *