
ఐటీ టెన్షన్ .. బీఆర్ఎస్ ఆర్థిక మూలాలపై బీజేపీ గురి
- NewsPoliticsTelangana Politics
- June 14, 2023
- No Comment
- 17
అధికార పార్టీ నేతలపై ఐటీ అటాక్స్ తో తెలంగాణలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిథులే టార్గెట్ గా ముగ్గురు కీలక నేతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురి పెట్టారు. దాంతో, గులాబీ నేతల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలకు చెందిన… ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో మరో ఆర్నెళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ను అష్టదిగ్బంధనం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. పార్టీకి ఆర్థిక తోడ్పాటునందించే నేతలే లక్ష్యంగా, నగదు వ్యవహారాలపై ఇన్ కంట్యాక్స్ రైడ్స్ చేపడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ముగ్గురు ఆర్థికంగా బలమైన నేతలు. బీఆర్ఎస్ పార్టీకి తమ వ్యాపార సంస్థల ద్వారా నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో ఐటీ సోదాలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ను చూసుకుంటున్నారు. సీఎం తరపున ఆయనే అన్ని చక్క బెడుతూ ఉంటారు. పైళ్ల శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు కొన్ని సూట్ కేసు కంపెనీలను పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి జ్యూయెలరీ సహా పలు వ్యాపార సంస్థలున్నాయి. గతంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా యుద్ధం నడిచేది. ఆ సమయంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ సహా బీఆర్ఎస్ కు చెందిన పలువురిపైనా ఈ తరహా దాడులు జరిగాయి. ఐతే, ఇటీవల కాలంలో కేసీఆర్ బీజేపీపై విమర్శలకు పోవడం లేదు. దాంతో, ఐటీ దాడుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే, అనూహ్యంగా..మళ్లీ ఇన్ కం ట్యాక్స్ అధికారుల సోదాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పార్టీలో చేరికలు ఆగిపోగా, ఉన్న నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఇదంతా కర్ణాటకలో బీజేపీ ఓటమి ఓ కారణమైతే…ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత విషయంలో బీజేపీ చూసీ చూడనట్టుగా వ్యవహరించడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజల్లోకి వెళ్లిపోయినట్టుగా కమలనాథులు భావిస్తున్నారు. అందుకే, ఇంతకాలం సైలెంట్ గా ఉన్న కమలనాథులు, ఐటీ దాడులతో తమ మధ్య ఎలాంటి అవగాహన లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. సరిగ్గా అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు ఐటీ అటాక్స్ జరగడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఎన్నికల వేళ, బీఆర్‌ఎస్‌లో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలే టార్గెట్‌గా…. ఐటీ దాడులు సాగుతుండటంతో బీఆర్‌ఎస్‌లో కలవరపాటు మొదలైంది.