
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తొలగించనున్న జగన్..?
- Ap political StoryNewsPolitics
- March 28, 2023
- No Comment
- 31
2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ గాలి.. నెల్లూరు జిల్లాలోనూ తన ప్రభావం చూపింది. జగన్ మాటలను నమ్మిన నెల్లూరు ప్రజలు మొత్తం 10కి 10 స్థానాల్లో వైసీపీని గెలిపించారు. దీంతో.. వైసీపీకి నెల్లూరు కంచుకోట అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. వైసీపీ కంచుకోటకు ఇప్పుడు బీటలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో పార్టీ మొత్తం తుడుచిపెట్టుకు పోయేలా కనిపిస్తోంది. దీనికి కారణం.. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డికి.. మలివిడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కటమే అని చెబుతున్నారు. ఏ ముహూర్తాన సీఎం జగన్ రెడ్డి… కాకానికి కేబినెట్ పోస్టు ఇచ్చారో.. ఆనాటి నుంచే నెల్లూరు వైసీపీలో ముసలం రాజుకుంది. కాకానికి మంత్రి పదవి ఇవ్వటాన్ని జీర్ణించుకోలేని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆనం రాం నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపు రెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వారు.. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమయం చూసి కాకానిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో వీరంతా పని చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి, రాం నారాయణరెడ్డి వంటి వారు పార్టీకి దూరం అయ్యారు.
ఇక.. మలి విడత మంత్రివర్గ విస్తరణలో తనకు మరో సారి ఛాన్స్ దక్కుతుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆశించారు. అయితే సీఎం జగన్ రెడ్డి అనూహ్యంగా కాకానికి మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో.. కాకానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరోవైపు.. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో నడుస్తున్న… తనకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అని.. కోటం రెడ్డి భావించారు. కానీ.. ఆయనకు కాకుండా కాకానికి మంత్రి పదవి ఇవ్వటంతో.. కోటంరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అయినా సీఎం జగన్ రెడ్డి హృదయం కరగక పోవటంతో.. కోటంరెడ్డి తనదారి తాను చూసుకున్నారు. మరోవైపు.. వైఎస్ కేబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా కీలక పోస్టు నిర్వహించిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి సైతం జగన్ కేబినెట్‌లో పోస్టు ఆశించారు. తన సీనియార్టీకి తగ్గ పదవి దక్కుతుందని ఎదురు చూశారు. కానీ ఆనంకు సైతం హ్యాండిచ్చిన జగన్ రెడ్డి… మలివిడత విస్తరణలో కాకానికే పట్టం కట్టారు. దీంతో సహజంగా ఆనం కూడా తన దారి తాను చూసుకున్నారు. వీరితో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. ఇలా.. కీలక నేతలందరీని పక్కన పెట్టిన జగన్ రెడ్డి.. వ్యూహాత్మకంగా పెద్ద తప్పు చేశారు.
తమను కాదని కాకానికి మంత్రి పదవి ఇవ్వటంతో.. నెల్లూరు జిల్లాలో ఒక్కో వైసీపీ నేతా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వీరంతా జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. పార్టీలో కొనసాగుతున్న నేతలు సైతం కాకాని మీద కారాలు,మిరియాలు నూరుతున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నెల్లూరు వైసీపీని కుదిపేశాయి. టీడీపీకి ఓటు వేశారంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణరెడ్డి మీద సస్పెన్షన్ వేటు పడింది. పార్టీలో ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఇవాళో.. రేపో తట్టాబుట్టా సర్దుకుని వేరు కుంపటి పెట్టుకుంటారనే టాక్ నడుస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే.. త్వరలో నెల్లూరు వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. పార్టీ అధిష్టానం డ్యామేజ్ కంట్రోల్‌కు దిగినట్టు చెబుతున్నారు. ఈ మొత్తం పరిణామాలకు.. కాకానికి మంత్రి పదవి ఇవ్వటమే కారణనే భావనకు సీఎం జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగిస్తే తప్ప.. నెల్లూరు వైసీపీలో అసంతృప్తి జ్వాలలకు అడ్డుకట్ట పడదని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో.. జగన్ రెడ్డి ఆయనను తన కేబినెట్ నుంచి త్వరలో తప్పించటానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్థాన సలహాదారు సజ్జలతో సంప్రదించిన జగన్ రెడ్డి.. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.