
ఆయనకు చెబితే.. జగన్ కు చెప్పినట్టేనా..?
- Ap political StoryNewsPolitics
- May 11, 2023
- No Comment
- 34
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం ప్రచార ఆర్భాటంగా మిగిలిపోనుందా..? ప్రజల మధ్యకు రాలేని ముఖ్యమంత్రి ఇలా కాల్ సెంటర్ ముసుగులో.. మాయ చేస్తున్నారా..? “జగనన్నకు చెబుదాం” కార్యక్రమంలో చేస్తున్న కాల్స్ అన్నీ.. ముఖ్యమంత్రికి కాకుండా.. టెలిఫోన్ ఆపరేటర్లకు వెళ్ళటం దేనికి సంకేతం..? అంటే.. అన్ని వేళ్ళూ రాష్ట్ర ప్రభుత్వం వైపే దోషిగా చూపిస్తున్నాయి. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆడుతున్న డ్రామాగా.. దీనిని విపక్షాలు అభివర్ణిస్తున్నాయి.
జగన్ రెడ్డి ఏం చెప్పారో విన్నాం కదా.. .. చాలా మందికి ఇంకా ఈ మాటలు గుర్తుండే ఉంటాయి..!! 2019 ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన డైలాగుల్లో.. ” నేను ఉన్నాను.. నేను విన్నాను” అనే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. అంటే.. ఇతను అధికారంలోకి వస్తే… మన బాధలు నేరుగా వింటాడని.. సమస్యలు పరిష్కరిస్తాడని లక్షలాది మంది ప్రజలు భ్రమపడ్డారు.
ఆ మేరకు ఓట్లేసి గెలిపించారు. తీరా జరిగిందేమిటి..? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ.. వినే ఓపిక లేదనే అభిప్రాయానికి దాదాపు జనం అంతా వచ్చేశారు. అసలు వినటమే కాదు.. ముఖ్యమంత్రి దర్శనం దొరకటమే గగనం అయిపోయింది.
స్మాల్ స్పాట్..
తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిన జగన్ రెడ్డి.. ఎక్కడకు వెళ్ళినా పరదాల మాటు పర్యటనలే చేస్తున్నారు. దీంతో.. రాష్ట్ర ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య అంతులేని అగాధం ఏర్పడింది. ఈ మధ్యలో పుట్టుకొచ్చిన సలహాదారులు.. పెత్తనం ఎక్కువైంది. మరోవైపు.. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను సైతం కూల్చేసిన జగన్ రెడ్డి… ప్రజలు తమ బాధలు చెప్పుకునే కొద్దిపాటి అవకాశాన్ని కూడా లేకుండా చేశారు.
వారం వారం జరుగుతున్న స్పందన కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా జరుగుతున్నాయి. దీంతో.. స్పందనలో పరిష్కారం కాక.. ముఖ్యమంత్రి దర్శనం దొరక్క.. తమ ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో.. ప్రజలతో కనెక్టివిటీ పూర్తిగా మిస్ అవుతోందని భయపడుతున్న జగన్ సర్కార్.. ” జగనన్నకు చెబుదాం” పేరుతో ఓ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. రాష్ట్ర ప్రజలు ఎవరైనా నేరుగా తమ సమస్యల్ని ముఖ్యమంత్రితో చెప్పుకోవచ్చని నమ్మబలికింది. దీంతో చాలా మంది సీఎం జగన్ రెడ్డికి తమ సమస్యలు ఏకరువు పెట్టటానికి రెడీ అయ్యారు. అయితే.. వారందరికీ తొలి రోజే తీవ్ర నిరాశ ఎదురైంది.
ప్రభుత్వం ఇచ్చిన 1902 నంబర్ కు ఫోన్ చేస్తే.. కంటిన్యుయస్ గా కాల్ వెయిటింగ్ వస్తోంది. “మా ప్రతినిధులు అంతా ఇతర కాల్స్ లో బిజీగా ఉన్నారు.. కొంతసేపటిలో మిమ్మల్ని సంప్రదిస్తారంటూ” అవతలి వైపు నుంచి సమాధానం వస్తోంది. దయచేసి వేచివుండండి అనే వాయిస్ రిపీట్ అవుతుండంతో.. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ప్రజల సహనానికి పరీక్షగా మారుతోంది. ఒకవేళ కాల్ కలిసినా.. మీ సమస్యను చెప్పండి.. ప్రభుత్వానికి చెబుతాము అంటూ ఆపరేటర్ అంటుండటంతో జనం అవాక్కవుతున్నారు. మీకు చెబితే.. జగనన్నకు చెప్పినట్టు ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఈమాత్రం దానికి ఆర్భాటంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎందుకంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద.. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా తయారైంది.. సీఎం జగన్ రెడ్డి పరిస్థితి. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంతో విపరీతమైన పబ్లిసిటీ వస్తుందని భావించిన ప్రభుత్వానికి తొలి రోజే తీవ్ర భంగపాటు ఎదురైంది. దీంతో.. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆర్భాటపు పథకాల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.