
వైసీపీలో జల్లికట్టు చిచ్చు..
- Ap political StoryNewsPolitics
- September 5, 2023
- No Comment
- 16
చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార పార్టీ నేతల మధ్య ఆదిపత్య పోరు రోజురోజుకు తారా స్థాయికి చేరుతోంది. కుప్పం మండలం వానగట్టపల్లె గ్రామంలో జల్లిజట్టు నిర్వహించే విషయంలో సర్పంచ్ వర్గానికి, ఎంపీటీసీ వర్గానికి మధ్య విబేధాలు వచ్చాయి. ఎడ్ల పందాలు నిర్వహించేందుకు ఎంపీటీసీ మంగమ్మ వర్గం చిత్తూరు ఎమ్మెల్సీ భరత్, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్, మండల పార్టీ అధ్యక్షుడు మురుగేష్ అనుమతితో జల్లికట్టు సన్నాహాలు చేశారు. కుప్పం మండలం వానగుట్టపల్లి పంచాయతీ పరిధిలో .. వేలాది రూపాయల ప్రైజ్ మనీతో ఎడ్ల పందాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేయగా.. ఎడ్ల పందాల్లో పాల్గొనేందుకు ఆంధ్ర , తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుండి సుమారు 500 మంది టోకన్లు సైతం కొనుగోలు చేశారు. అయితే జల్లికట్టు జరగకూడదంటూ సర్పంచ్ వర్గీయులు పట్టుపట్టారు. ఇదే వ్యవహారంలో.. వైసీపీ పార్టీ పంచాయతీ అధ్యక్షులు కృష్ణప్ప రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా మరో ఇద్దరు వార్డు సభ్యులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొందని.. ప్రశాంతత దెబ్బతింటోందని, జల్లికట్టు వద్దంటూ సర్పంచ్ వర్గీయులు పోలీసులను కోరారు.
వానగుట్టపల్లి పంచాయతీలో అధికార పార్టీ నేతల మధ్య తలెత్తిన వివాదం.. రాజీనామాలకు దారి తీయడంతో.. పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని రాత్రికి రాత్రి పోలీసుల ద్వారా జల్లికట్టును అడ్డుకున్నారు. వాన గుట్టపల్లిలో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు.అయితే తాము అందరి అనుమతితో ఎడ్ల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తే అడ్డుకుని.. తమ పరువు తీశారు అంటూ ఎంపీటీసీ మంగమ్మ వర్గీయులు ఆరోపించారు. ఎడ్ల పందాలు జరుపుకోమని చెప్పిన నేతలే ఆఖరి నిమిషంలో రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ భరత్.. గ్రామ సర్పంచ్ తన సొంత సామాజికవర్గం వారే కావడంతో వారి మాటకే విలువ ఇచ్చి లోలోన జల్లికట్టు నిర్వాహణను అడ్డుకున్నారని ఎంపీటీసీ వర్గం ఆరోపిస్తోంది.
కుప్పం నియోజకవర్గంలో చాలా చోట్ల జల్లికట్టు, ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నా అడ్డుపడని పోలీసులు.. తమ గ్రామంలో మాత్రమే ఎందుకు జరగనివ్వడం లేదని ఎంపీటీసీ మంగమ్మ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ భరత్ తీరును నిరసిస్తూ ఎంపీటీసీ వర్గీయులు గ్రామ సచివాలయానికి తాళాలు వేశారు.అనంతరం కుప్పం – తిరుపత్తూరు రహదారిపై ధర్నాకు దిగారు. ఎమ్మెల్సీ భరత్ చాలా గ్రామాల్లో తన సామాజికవర్గం వారినే ప్రోత్సహిస్తూ తొలినుంచి వైసీపీలో ఉన్న వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీటీసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ తీరు మారకపోతే.. తాము కూడా వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. మొత్తంగా వానగుట్టపల్లి వైసిపి పంచాయతీ ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.