
ఉద్యోగులకు అంతేసి జీతాలు వేస్ట్ అన్న జేపీ వ్యాఖ్యలపై దుమారం
- Ap political StoryNewsPolitics
- April 1, 2023
- No Comment
- 46
ప్రభుత్వ ఉద్యోగులకు ” అంతేసి జీతాలు అనవసరం.. పెన్షన్లు ఇవ్వటం పూర్తిగా దండగ” అంటూ మాజీ ఐఏఎస్ అధికారి.. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ చేసిన చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఉద్యోగుల మనోభావాలను కించ పరిచేలా జేపీ మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సివిల్ సర్వీస్ అధికారిగా పని చేసిన జేపీ ఇలా మాట్లాడటం ఏంటని చాలా మంది నిలదీస్తున్నారు. ఆయన పెద్ద మొత్తంలో పెన్షన్ పొందటం లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీజేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, తదితరులు జేపీ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఏపీ ప్రభుత్వానికి వత్తాసు పలికేలా జేపీ వ్యాఖ్యాలు ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. జేపీ.. ఓ సీనియర్ ఐఏఎస్ లా కాకుండా.. పెయిడ్ ఆర్టిస్ట్‌లా మాట్లాడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేపీ.. ప్రభుత్వ ఉద్యోగులను చులకన చేస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు సెక్టార్‌లో 20 వేల రూపాయల జీతాలే కష్టంగా మారిన తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు 80 వేలు… లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని జేపీ అన్నారు. అంతే కాదు.. వారికి పనికి మించిన వేతనం వస్తోందని.. పన్నుల రూపంలో ప్రజల సొమ్మును ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు అంతేసి జీతాలే వేస్ట్ అని.. వారికి పెన్షన్లు ఇవ్వటం కూడా దండగ అని జేపీ వ్యాఖ్యానించారు. ఇక.. సీపీఎస్ విధానం రద్దును కూడా ఆయన వ్యతిరేకించారు. జీతాలు, పెన్షన్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాల్ని బెదిరిస్తున్నారంటూ.. జేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన జేపీ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు, పెన్షన్లు అనేది ప్రభుత్వం వేస్తున్న భిక్ష కాదని.. అది ఉద్యోగుల హక్కు అని తేల్చి చెబుతున్నారు. పెన్షన్.. ప్రభుత్వ “భిక్ష” కాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్న విషయం జేపీకి తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు. సామాన్య ప్రజలే కాదు.. ఉద్యోగులు కూడా భారీ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని.. ఇవన్నీ పక్కన పెట్టి జేపీ అసంబద్దంగా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వేతనాలు, పెన్షన్లపై మాట్లాడని జేపీ.. ఉద్యోగుల్ని టార్గెట్ చేయటం ఏంటని నిలదీస్తున్నారు. ఉద్యోగులు లేకుండా ఏ ప్రభుత్వమైనా ఎలా పని చేస్తుందని..? ప్రశ్నిస్తున్నారు. జేపీ వ్యాఖ్యలపై భవిష్యత్ ఆందోళనలకు సమాయత్తం అవుతున్నారు.
ఇక.. తనకు తాను అపర మేధావిలా భావించే జేపీ.. స్వచ్ఛమైన రాజకీయాల కోసం పని చేస్తున్నానని చెప్పుకొస్తుంటారు. కానీ.. ఏపీలో ఉద్యోగుల పడుతున్న కష్టాలు.. నెల నెలా జీతాలు రాని వైనం, పెన్షన్లు అందని వైనంపై మాత్రం నోరు మెదపటం లేదు. ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన పీఎఫ్ సొమ్మును సైతం జగన్ సర్కార్ వాడేసుకుంటున్నా… నేటికీ జేపీ నోరు మెదపిన పాపాన పోలేదు. రివర్స్ పీఆర్సీ ఇచ్చి.. ఉద్యోగుల ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం దెబ్బ తీసినా.. జేపీ లాంటి స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలేదని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తాను నిప్పు అని చెప్పుకునే జేపీ.. వైసీపీ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ఎలా మాట్లాడతారని నిలదీస్తున్నాయి. ఆయన మాటల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని.. ఓ రాజకీయ పార్టీకి తొత్తులా జేపీ మాట్లాడటం తగదని హితవు పలుకున్నాయి. మొత్తం మీద.. ఉద్యోగుల జీతాలు.. పెన్షన్లపై జేపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై మళ్లీ జేపీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.