స్వరాభిషేకానికి… కళా తపస్వి ప్రాణాభిషేకం

స్వరాభిషేకానికి… కళా తపస్వి ప్రాణాభిషేకం

తెలుగు సినిమాకు సమున్నత గౌరవం
సంగీతానికి, కళకు అత్యంత ప్రాధాన్యత
నంది అవార్డులు, జాతీయ పురస్కారాలు
విశ్వనాథ్ సినిమాలు ఆణిముత్యాలుగా చెరగని ముద్ర

బహుముఖ ప్రజ్ఞాశాలి… సినీ దర్శకదిగ్గజం కళా తపస్వి కాశీనాధుని విశ్వనాథ్ తెలుగు సినిమాను గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన అగ్రగణ్యులు. సినిమాలో సన్నివేశానికి తగ్గట్టుగా సంగీత ప్రదానంగా సాగే శంకరాభరణం సినిమా కాశీనాధుని విశ్వనాధుని కళాతపస్వీగా తీర్చిదిద్దింది. కథా రచయితగా.. సినీ దర్శకుడిగా… శాస్త్రీయ సంగీతంతో చేసిన ప్రయోగం అద్భుతాన్ని ఆవిష్కించింది. జేవీ సోమయాజులు కథానాయకుడిగా.. సంగీత స్వరానికి స్వర్ణ కంకణాలు తొడిగారు. శంకరాభరణం సినిమా విడుదలైన రోజే… కళా తపస్వీ విశ్వనాథ్ ప్రాణాలు యాధృశ్చికంగా అనంత వాయువుల్లో లీనమయ్యాయి.

గుంటూరుజిల్లా తెనాలి సమీపంలోని పెద్దపులివర్రులో 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. విశ్వనాథ్ కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం గుంటూరు, విజయవాడల్లో సాగింది. బియస్సీపూర్తి చేసిన విశ్వనాథ్ బంధువుల ప్రోత్సాహంతో ఉపాధికోసం చెన్నై వెళ్లారు. అక్కడ తనకు అనువైన ఉద్యోగం వెతుక్కునే క్రమంలో విశ్వనాథ్ తొలుత వాహిణి స్టూడియోలో రికార్డింగు థియేటర్ లో అసిస్టెంటుగా చేరారు. అక్కడ దశల వారీగా సినిమా రంగంపట్ల అపారమైన అనుభవం సొంతంచేసుకున్నారు.

అన్నపూర్ణాఫిలింస్ లో అక్కినేని నాగేశ్వరరావు విశ్వనాథ్ కు సినీఅవకాశం కల్పించారు. విశ్వనాథ్ తెరకెక్కించిన తొలిసినిమా 1965లో ఆత్మగౌరవం సినిమాకాగా… చివరి సినిమా శుభప్రదంగా నిలిచింది. 1965లో తెరకెక్కించిన తొలిసినిమా ఆత్మగౌరవానికి నంది పురస్కారం అందుకున్నారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద నంది అవార్డును సొంతంచేసుకున్నారు. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్వాతిముత్యం, స్వర్ణకమలం, సప్తపది, శృతిలయలు వంటి సినిమాలు తెలుగుప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చెల్లెలి కాపురం, చిన్ననాటి స్నేహితులు, సీతామహాలక్ష్మి వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, శుభసంకల్పం వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. స్వీయ దర్శకత్వంలో కథారచయితగా సొంత సినిమాలను తెరకెక్కించి అద్భుతమై దృశ్యకావ్యాలకు నంది అవార్డులు, జాతీయస్థాయి పుస్కారాలను అందుకున్న దర్శక దిగ్గజంగా పేరుగడించి.. చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.

తెలుగు సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించిన ఘనతను సొంతచేసుకున్న కళా తపస్వీ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ఆణిముత్యాలు తెలుగు ప్రజానీకాన్ని తరతరాలు పెనవేసుకు పోయాయి. విశ్వనాథ్ సినిమాల్లో ప్రతిసన్నివేశం ప్రేక్షకలోకాన్ని హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. సామాజికాంశాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించి ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. భర్తను కోల్పోయి కన్నబిడ్డతో ఉన్న మహిళ, అమాయక యువకుడితో మూడు ముడుల బంధంతో కలిపే అద్భుతమైన దృశ్యకావ్యం ప్రపంచకీర్తిని గడించింది. కమల్ హాసన్ కు సినీకెరీర్ లోనే అద్బుతమైన ఘట్టంగా స్వాతిముత్యం నిలిచింది. కమల్ హాసన్ లోని బాడీ లాంగ్వేజ్ ను సినిమాలో గొప్పగా చిత్రీకరించారు. స్వాతిముత్యం తెలుగుసినీ ప్రపంచాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లిందనే కంటే… కమల్ హాసన్ సినీ ప్రస్థానానికి పెద్దమైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. స్వచ్ఛమైన ప్రేమ, ఆప్రేమను పంచిన సహచరి మరణించినా… ఆజ్ఞాపకాలను వీడకపోవడం… ప్రతి దశలోనూ కనిపించే అమాయకత్వం అన్నీకలిస్తే స్వాతిముత్యం.. ఈ సినిమా మన భారత దేశం తరపున ఆస్కార్ కు నామినేటైన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.

సినిమాలకు దర్శకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించగలిగారు. తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సీతారామయ్య గారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి, ముగించే వరకూ షూటింగ్‌కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్‌‌కి అలవాటు. తనను తాను కార్మికుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ బట్టలు తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్‌ పేర్కొన్నారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, సిరివెన్నెల, శృతి లయలు, స్వాతికిరణం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, వంటి అగ్రహీరోల చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఉన్నతమైన ప్రమాణాలతో తెరకెక్కించిన సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా అవార్డులను అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2016లో సినిరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. కాశీనాథుని విశ్వనాథ్ తెలుగు సినిమాకు ప్రత్యేక గౌరవాన్ని సంపాదించిపెట్టారు. తెలుగు సినిమారంగానికి దర్శకుడిగా , కధారచయితగా సేవలు అందించినందుగాను హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *