
అమరవీరులకు అవమానం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ
- NewsPoliticsTelangana Politics
- June 23, 2023
- No Comment
- 18
తెలంగాణలో రాజకీయం ఇప్పుడు అమరవీరుల చుట్టూ తిరుగుతోంది. వారి త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడినా, అమరులు కుటుంబాలకు ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యం. అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేసి, తెలంగాణ ద్రోహులను… కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకున్నారని ప్రతిపక్షాలు తొమ్మిదేళ్లుగా దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. అయినా ఏనాడు గులాబీ దళపతి వారిని పట్టించుకోలేదు. అయితే, సడన్ గా అమరవీరుల కుటుంబాలపై ప్రేమ ఒలకబోస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న అమరవీరులు, ఉద్యమకారులను కాంగ్రెస్ దగ్గరకు తీస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ మేల్కొన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కలలు గంటున్న కేసీఆర్ కు, కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. హస్తం పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. దానికి తోడు కాంగ్రెస్ డిక్లరేషన్ లు, ఆ పార్టీ నేతల్లో ఉన్న ఐక్యత… గులాబీల గుండెల్లో గుబులు రేపుతోంది. ఈనేపథ్యంలో కేసీఆర్ గత రెండు ఎన్నికలకు భిన్నంగా… అమరవీరుల కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, హైదరాబాద్ నడిబొడ్డున అమరుల స్మారక చిహ్నం నెలకొల్పిన బీఆర్ఎస్… ఇప్పుడు రాష్ర్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరులను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక దినోత్సవం నిర్వహిస్తోంది. అంతకు మించి మలిదశ పోరాటంలో తొలి అమరుడైన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వనుందనే ప్రచారం జోరందుకుంది.
ఇదిలా ఉంటే… బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ దశాబ్ది దగా అంటూ దుమ్మెత్తిపోస్తోంది. కేసీఆర్ కు అమరవీరుల కుటుంబాలన్న ఆదుకోవాలన్న చిత్తశుద్దే లేదని , ఎన్నికల కోసమే జిమ్మిక్కులు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది కుటుంబాలను…. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ విస్మరించారని మండిపడుతున్నారు. వాటిని తిప్పికొట్టేందుకే…. కేసీఆర్ శంకరమ్మకు పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.