
సీఎం కేసీఆర్ రిపోర్ట్ లో ఏముంది? 40మందికి టిక్కెట్ లేనట్లేనా?
- NewsPoliticsTechnology
- April 28, 2023
- No Comment
- 41
హద్దులు దాటుతున్నారు, దళిత బంధు మేస్తున్నారు. పద్దతి మార్చుకుంటే మంచిది, లేదంటే తోక కత్తిరిస్తా. బీర్ఎస్ ప్రతినిథుల సభలో ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గులాబీ దళపతి. బాగా పనిచేసుకుంటే సరే, లేదంటే నో టికెట్ అని కూడా తేల్చేశారు. ఎమ్మెల్యేలు జాగ్రత్త పడకపోతే, ఆ తర్వాత తాను చేసేదేమీ ఉండదని హెచ్చరించారు. వంద సీట్లు గెలవడమే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధంకావాలని…ప్రజాప్రతినిథులకు దిశానిర్దేశం చేశారు. అయితే, సిట్టింగ్ లపై కేసీఆర్ సీరియస్ అవ్వడం వెనక కారణమేంటి? ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరు? టిక్కెట్ ఊస్టింగ్ అయ్యేదెవరికి? అనేది హాట్ టాపిక్ గా మారింది.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రతినిథులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో ఆర్నెల్లలో ఎన్నికలు జరగనున్న వేళ, ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లు జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. సరిగా పనిచేయకపోతే తోక కత్తిరిస్తానని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సర్వేల విషయాన్ని ప్రస్తావించారు.నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ తెప్పించుకున్న సీఎం కేసీఆర్, అందులో 40 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారని సమాచారం. అయితే ఆ 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో చర్చగా మారింది. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నా.. విమర్శలను తిప్పి కొట్టడంలో నేతలు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారట కేసీఆర్. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఘాటు హెచ్చరికలు పంపారని అంటున్నారు.
అదేవిధంగా, దళితబంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు కమిషన్లు దండుకుంటున్న వైనంపై సీరియస్ అయ్యారు కేసీఆర్. దళిత బంధు మేస్తున్న వారి చిట్టా తన వద్ద ఉందన్న ముఖ్యమంత్రి…అవన్నీ బంద్ చేయాలని హెచ్చరించారు. అనుచరులు దళితబందులో కమిషన్ లు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేదేనంటూ తేల్చి చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనే విషయాన్ని తెలుసుకోవాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. లేకపోతే సీటు ఉండదు, పార్టీ అండ ఉండదంటూ ముఖం మీదే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది గులాబీ పార్టీ. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలవాలని టార్గెట్ పెట్టున్నారు. ఆ లక్ష్యం నెరవేరితే, జాతీయ స్థాయిలో ఫోకస్ పెట్టొచ్చనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. ఆ దిశగానే మిషన్ 100 సాధించేలా ఎన్నికలకు సన్నద్ధం కావాలని ప్రజాప్రతినిథులకు దిశానిర్దేశం చేశారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని, క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం తో పాటుగా ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవాలన్నారు.షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సర్వసభ్య సమావేశంలో స్పష్టం చేశారు కేసీఆర్.
పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుతోంది. అలాంటి నేతల విషయంలో కేసీఆర్ కాస్త ఘాటుగానే స్పందించారు. పార్టీ నేతలు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లోనూ సమస్య ఉంటే లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా… అధిష్ఠానంతో విన్నవించుకోవాలని అన్నారు.
గతంలో సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తానన్నారు కేసీఆర్. అయితే, చాలా మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉందనే విషయం సర్వేల్లో తేలినట్లు చెబుతున్నారు. కొందరిని పక్కనబెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ లకు సీఎం సాబ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో, ఎమ్మెల్యేలు టెన్షన్ పడిపోతున్నారు.