
ట్విట్టర్ కు షాకిస్తున్న థ్రెడ్స్
- NewsTechnology
- July 7, 2023
- No Comment
- 28
ట్విట్టర్ కు గట్టీ పోటీ ఇచ్చేలా మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్, వాట్సాప్ ల మాతృ సంస్థ మెటా కొత్తగా థ్రెడ్స్ ను లాంఛ్ చేసింది. ఎలాన్ మస్క్ బాస్ గా ఉన్న ట్విట్టర్ కు పోటీగా.. మార్క్ జూకర్ బర్గ్ థ్రెడ్స్ ను తీసుకొచ్చారు. వ్యాపార సామ్రాజ్యంలో ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్.. చాలా కాలంగా.. ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత దానికి పోటీగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫారంను తీసుకొచ్చారు. యూజర్ల మధ్య సంభాషణలను మరింత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు థ్రెడ్స్ ను తీసుకొచ్చినట్లు జూకర్ బర్గ్ తెలిపారు. ప్రస్తుతం ఇన్ స్టా గ్రాం ఖాతా ఉన్నవాళ్లు దీనిలోకి డైరెక్ట్ లాగిన్ కావచ్చు. థ్రెడ్స్ లో సైనప్ ప్రాసెస్ ను చాలా సింపుల్ గా రూపొందించారు.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన యాప్ థ్రెడ్స్ వినియోగదారులకు.. జులై 6న ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చింది. థ్రెడ్స్ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్ , ఆపిల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా .. 100 కు పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. అయితే ఐరోపా దేశాల్లో మాత్రం థ్రెడ్స్ ను ఇంకా లాంఛ్ చేయలేదు. అక్కడి ప్రభుత్వ నిబంధనల కారణంగా కాస్త ఆలస్యం కానుంది. గత కొన్ని రోజుల నుంచి ఈ యాప్‌పై అనేక కథనాలు వెలువడ్డాయి. దీంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. యూజర్ నేమ్ అదే ఉంటుంది కానీ బయో, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం ఇచ్చారు. థ్రెడ్స్ యూజర్ నేమ్ మార్చుకోవాలంటే మీ ఇన్ స్టా గ్రాం యూజర్ నేమ్ ను మార్చుకోవాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇన్ స్టాగ్రాం నుంచి వచ్చిన మరో యాప్.
థ్రెడ్స్ యాప్‌లో చాలా వరకు ట్విట్టర్ తరహా ఫీచర్లను ఉన్నాయి. కానీ థ్రెడ్స్ యాప్‌లో 500 అక్షరాల లిమిట్ ఉంది. అదే ట్విట్టర్‌లో కేవలం 280 అక్షరాలు మాత్రమే పోస్ట్ చేయవచ్చు. ఇక ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌తోనే థ్రెడ్స్ యాప్‌లోనూ లాగిన్ కావచ్చు. ఇన్‌స్టాలో ఫాలో అయిన వారిని థ్రెడ్స్‌లో కూడా ఫాలో కావచ్చు. 5 నిమిషాల నిడివితో వీడియోలను కూడా పోస్ట్ చేయవచ్చు. థ్రెడ్స్ యాప్‌కు .. యూజర్ల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. కేవలం విడుదల అయిన తొలి నాలుగు గంటల్లోనే.. ఏకంగా 5 మిలియన్లు మంది .. థ్రెడ్స్ యాప్‌లో అకౌంట్లు తెరిచారు. మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్‌లో తొలి పోస్ట్ చేశారు. ఫైర్ ఎమోజీతో పాటు తొలి నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల సైన్ ఆప్‌లు నమోదు చేసుకోవడం పట్ల జూకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ కు ప్రత్యామ్నాయం కోసం.. గత కొంతకాలంగా.. యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా యాప్స్.. ట్విట్టర్ కు పోటీగా వచ్చినా.. ఏదీ నిలబడలేకపోయింది. అయితే కొద్ది నెలల క్రితం ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన మార్పులపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో దీనికి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్ ను లాంఛ్ చేసి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జూకర్ బర్గ్ అనుకున్నారు. ఇన్ స్ట్రాగ్రాం యూజర్లలో నాలుగింట ఒక వంతు యూజర్లు థ్రెడ్స్ ను రెగ్యులర్ గా ఉపయోగించినా ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ అవతరిస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు థ్రెడ్స్ ఖాతాలను ప్రారంభించారు. మొదటి పోస్టులు కూడా పెట్టారు. ఒకవేళ థ్రెడ్స్ విజయవంతమైతే మాత్రం.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కు గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.