
ఈటల కోసం కేటీఆర్ ఏం చేశారంటే?
- NewsPoliticsTelangana Politics
- June 29, 2023
- No Comment
- 19
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ ప్రచారం జరుగుతున్న వేళ…దాన్నుంచి బయటపడేందుకు కాషాయ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ వేదికగా జరుగుతున్న రాజకీయం సెగలు రేపుతోంది. హత్యా రాజకీయాలకు తెలంగాణ దూరం. అయితే, తనను అంతమొందించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందంటూ… ఈటల, ఆయన భార్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. రూ.20 కోట్లు సుపారీ కూడా ఇచ్చారని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా కేసీఆర్ చంపించే కుట్ర చేస్తున్నారనేది ఈటల ఫ్యామిలీ చేస్తున్న ఆరోపణ.ఇక, ఈటలనే తనను చంపాలనుకుంటున్నారని కౌశిక్ రెడ్డి కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఇప్పుడు ఈటల భద్రతపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈటల అభిమానులు, అనుచరులు ఆయనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలనే డిమాండ్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో Y కేటగిరీ భద్రతను కేటాయించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో, లైన్ లోకి వచ్చిన మంత్రి కేటీఆర్.. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి ఈటల భద్రతపై చర్చించారు. అయితే, ఈటల కుటుంబం ఆరోపణలు చేస్తోంది…కేసీఆర్, కౌశిక్ రెడ్డిపైనే. కానీ, కేటీఆర్ మాత్రం ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని సూచించడం కొసమెరుపు. రాష్ట్ర పోలీసు బలగాలతో ఈటలకు అవసరమైనంత సెక్యూరిటీని కల్పించాలని చెప్పడం చూస్తుంటే తెరవెనకాల ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ జోష్ కనిపిస్తోంది. బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో ఈటల, రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీ పిలిపించిన అధిష్టానం, ఏం చర్చించిందో గానీ…మళ్లీ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అగ్గి రాజుకుంటోంది. హస్తిన నుంచి వచ్చాక తనపై హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ఈటల చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ పెద్దగా పేర్లు పెట్టి విమర్శలు చేయని ప్రధాని మోడీ కూడా…కవిత బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండి, ప్రజలు బాగుండాలంటే బీజేపీకి ఓటేయండని అంటున్నారు. అది కూడా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన మీటింగ్ లో మోడీ తెలంగాణ రాజకీయాలు, కేసీఆర్ ఫ్యామిలీ పేరెత్తడం గమనార్హం. మళ్లీ పార్టీలో ఊపు తీసుకొచ్చేందుకు కాషాయపార్టీ కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.