
టీడీపీలోకి ఎమ్మెల్యే రాజాసింగ్?
- NewsPoliticsTelangana Politics
- April 28, 2023
- No Comment
- 28
హిందూత్వవాది, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సంబంధించిన సంచలన వార్త ఒకటి వైరల్ అవుతోంది. రాజాసింగ్ టీడీపీవైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. రాజాసింగ్ తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉండేవారు.
మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ పట్ల పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేయడంతో… బీజేపీ ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఎదురుచూసినా, ఫలితం లేకపోయింది. గత 6 నెలల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారట. త్వరలోనే తెలుగుదేశంలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
రాజాసింగ్ గతంలో టీడీపీ నుంచే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇప్పుడు తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అనుచరుల ద్వారా తెలుస్తోంది. గోషామహల్ తోపాటు మరో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని రాజాసింగ్ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి..రెండుమూడు రోజుల్లో పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ ముఖ్య నేత ఒకరు చెప్పారట. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, గోషామహాల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకోవాలని రాజాసింగ్ ప్లాన్ చేసుకుంటున్నారట.
రాజాసింగ్ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరపున 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి వరుసగా రెండోసారి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలిచారు.