సీబీఐను అడ్డుకుంటున్న అదృశ్య శక్తులు ఆ ముగ్గురే..!!

సీబీఐను అడ్డుకుంటున్న అదృశ్య శక్తులు ఆ ముగ్గురే..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన నిందితులకు సీబీఐ సపోర్ట్ చేస్తోందా..? సీఎం జగన్ రెడ్డి ఒత్తిడితో.. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాలు సీబీఐ పనితీరును నియంత్రిస్తున్నారా..?

ఏపీలో తమ ఆప్తమిత్రుడు జగన్ రెడ్డి కోసం.. వివేకా హత్య కేసు విచారణను కేంద్రం నీరు గారుస్తోందా..? ఆంధ్రప్రదేశ్‌లో నేరమయ రాజకీయాలకు పరోక్ష సహకారం అందిస్తోందా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. వివేకానందరెడ్డి కిరాతక హత్య కేసులో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చేంత వరకు అరెస్టు చేయకుండా సీబీఐ తాత్సారం చేస్తుండటం… ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హత్య కేసులో బాధితుల పక్షాన కాకుండా.. నిందితులకే అండగా నిలుస్తున్న సీబీఐ తీరు నివ్వెర పరుస్తోంది.

తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో..? వ్యవస్థలు ఎంతగా దిగజారిపోతాయో.. ? వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ తీరును చూస్తే ఇట్టే అర్ధం అయిపోతుంది. తన సొంత చిన్నాన్న వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటానికి సీఎం జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే.. ఏపీలో క్రిమినలైజ్డ్ పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు వెళ్ళిన వైనం కళ్లకు కడుతోంది.

గత నాలుగేళ్ళుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అడగకుండానే అన్ని సహకారాలు అందిస్తున్న జగన్ రెడ్డికి.. ఇప్పుడు ప్రధాని మోడీ… కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందిస్తున్న సహకారం కూడా నివ్వెర పరుస్తోంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న సీబీఐను ప్రధాని మోడీ.. లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్ప మరెవ్వరూ నియంత్రించలేదు. సీబీఐ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అయిన ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా.. సీబీఐ కావాలనే చేస్తున్న తాత్సారం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఢిల్లీ నుంచి అనుమతి రాకపోవటంతోనే కింది స్థాయిలో అధికారులు.. మీన మేషాలు లెక్కిస్తూ కూర్చుంటున్నారు. దీంతో.. ఇప్పుడు అన్ని వేళ్లూ ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల నే దోషులుగా చూపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో విచారణను అడ్డుకుంటున్న అదృశ్య శక్తులు ఈ ముగ్గురే అని సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కిరాతకమైన హత్య కేసులో కీలక నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటానికి.. కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

వాస్తవానికి.. వివేకా హత్య కేసులో విచారణ నెమ్మదిగా సాగుతుందనే కారణంతోనే సుప్రీం కోర్టు దర్యాప్తు అధికారిని మార్చి కొత్త వారిని నియమించింది.అదేం దౌర్భాగ్యమో కానీ కొత్త దర్యాప్తు అధికారుల చేతిలోకి వివేకా కేసు వచ్చాక.. దర్యాప్తు పూర్తిగా పక్కదారి పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ హత్య కేసులో కీలక నిందితులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర రెడ్డి ఉన్నారు. భాస్కర రెడ్డిని తెల్ల వారు ఝామునే అరెస్టు చేసి లోపలేసిన సీబీఐ.. అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం తీవ్రమైన జాప్యం చేస్తోంది. కళ్ళ ముందే నిందితుడు దర్జాగా తిరుగుతున్నా.. నోటీసులు.. విచారణలు అంటూ కాలయాపన చేస్తోంది. నిందితుడు హై కోర్టు నుంచి.. సుప్రీం కోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ వెసులు బాటు కల్పించటం.. అందర్నీ నివ్వెర పరుస్తోంది. కంచే చేను మేసిన చందంగా సీబీఐ పని తీరు ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రిని ఆఘమేఘాల మీద అరెస్టు చేసి లోపలేసిన సీబీఐ… అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం చేతుల ముడుచుకుని కూర్చోవటం న్యాయనిపుణులను సైతం నిశ్చేష్టుల్ని చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు… ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు సహకరించక పోతే.. సీబీఐ ఇలా చేతులు ముడుచుకుని ఎలా కూర్చుంటుంది..? అనే ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నం అవుతున్నాయి.

ఇక..స్వయంగా 31కు పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడుగా ఏపీ సీఎం జగన్ రెడ్డి ఉన్నారు. చట్టంలో లొసుగుల్ని ఉపయోగించుకుని ఆయన కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అటువంటి జగన్ రెడ్డి.. గత నాలుగేళ్లుగా కేంద్రం ఏ కోరుకుంటే అది చేసి పెడుతున్నారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం వరకు.. ప్రధాని మోడీ ఏం చేసినా నోరు మెదపకుండా కూర్చుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా.. అన్ని పార్టీలకన్నా ముందుగా గుడ్డిగా సపోర్ట్ చేసేస్తున్నారు.

ఈ విధంగా ప్రధాని మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అడుగులకు మడుగులు ఒత్తుతున్న సీఎం జగన్ రెడ్డి.. వివేకా హత్య కేసు విచారణను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ కేసులో తన తమ్ముడు అవినాష్ రెడ్డిని అసెంబ్లీ వేదికగానే జగన్ రెడ్డి సమర్ధించారు. ఇప్పుడు.. కేంద్రంలో తనకున్న పలుకుబడిని.. పరపతిని ఉపయోగించి.. సీబీఐ బారి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇంత నిస్సిగ్గుగా సీబీఐను ఇటు రాష్ట్ర ప్రభుత్వం… అటు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరు.. అందర్నీ నివ్వెర పరుస్తోంది. ఓ హత్య కేసులో నిందితులకు అనుకూలంగా దర్యాప్తు సంస్థలు పని చేస్తున్న వైనం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

 

 

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *